Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

జిఎస్‌టి కింద తగ్గనున్న శ్లాబ్‌లు : సిఇఎ

cda

హైదరాబాద్‌లో ఆరంభమైన 21వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం

న్యూఢిల్లీ: భవిష్యత్తులో వస్తు,సేవల పన్ను(జిఎస్‌టి) కింద ఉన్న శ్లాబులను కుదించే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు(సిఇఎ) అరవింద్ సుబ్రమణియన్ అన్నారు. 12 శాతం, 18 శాతం పన్ను శ్లాబులను కాలక్రమేణ విలీనం చేసే అవకాశముందన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం ‘ఇక్ఫాయ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్’ లో ప్రసంగించిన సుబ్రమణియన్ జిఎస్‌టి అమలు ఓ విప్లవాత్మక ఆర్థిక సంస్కరణగా అభివర్ణించారు. ఆరు నుంచి తొమ్మిది నెలల్లో ఆర్థిక వ్యవస్థ స్థిరపడుతుందనే ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. కొత్త పరోక్ష పన్నుల విధానంలో నిలకడ వచ్చాక పన్ను శ్లాబులను కుదించే ప్రక్రియ ప్రారంభం కావచ్చన్నారు. భవిష్యత్‌లో పెట్రోల్, డీజిల్‌ను జిఎస్‌టి పరిధిలోకి తెచ్చే విషయంలో రాష్ట్రాల అంగీకారమే కీలకమని అన్నారు. అయితే, భారత్‌లాంటి పెద్ద దేశంలో ఒకే జిఎస్‌టి రేటు మాత్రం సాధ్యపడకపోవచ్చని పేర్కొన్నారు. జిఎస్‌టి పోర్టల్‌లో రిటర్నుల ఫైలింగ్ వ్యవస్థల్లో కొన్ని సాంకేతిక అవాంతరాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రాలు భిన్న ఐటి వ్యవస్థలను కలిగి ఉన్న నేపథ్యంలో జిఎస్‌టి సిస్టమ్ కొంత సంక్లిష్టంగా మారిందన్నారు. పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సాంకేతిక అవాంతరాలు గురించి అడిగినప్పుడు వ్యవస్థ ఎంత క్లిష్టంగా ఉందో మీకు చెప్పలేను. ఇంకా బాగా చేయగలిగితే బావుండేదని భావిస్తున్నానన్నారు. కానీ జిఎస్‌టి కౌన్సిల్ ఈ అంశాలన్నింటినీ పరిశీలించి సరైన చర్య తీసుకుంటుంది. అది ముఖ్యమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జిఎస్‌టిలో 5, 12, 18, 28 శాతం ఇలా నాలుగు పన్ను శ్లాబులున్నాయి. హైదరాబాద్‌లో 21వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం శనివారం నుంచి ఆరంభమైంది.
దీనికి ముందు ఆర్థిక కార్యదర్శి హస్‌ముఖ్ అధియా సైతం ఇదే రీతిలో సిఎస్‌టిని సులభతరం చేయాలన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘ఒకవేళ 5 శాతం పన్ను శ్లాబ్‌ను తీసేస్తే…అప్పుడు ఈ శ్లాబ్‌లోని వస్తువులు పై శ్లాబ్‌లోకి వెళతాయి. అయితే ఇది సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఈ శ్లాబ్‌లో ఉన్న వస్తువులన్నీ సామాన్యులకు కావలసిన నిత్యావసర వస్తువులు. శ్లాబులను తగ్గించే అవకాశం ఉన్నట్లయితే ఆ పని చేయాల్సి ఉంది’ అని అధియా చెప్పారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ కూడా ఇదే వైఖరిని కనబరిచారు. జిఎస్‌టి పన్ను పథకంలోకి పెట్రోలియం, విద్యుత్‌లను తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ నెల మొదట్లో జరిగిన 23వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో 178 వస్తువులను 28 శాతం శ్లాబ్ నుంచి 18 శాతం శ్లాబ్‌లోకి తీసుకొచ్చారు. ఇక సేవల రంగంలో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటిసి)లో పెద్ద మార్పు తెచ్చారు. స్టార్ హోటళ్లను తప్పించి అన్ని రెస్టారెంట్లపై ఐటిసిని తీసేశారు. ఏది ఏమైనప్పటికీ ఎసి, ఎసియేతర స్టాండ్ ఎలోన్ రెస్టారెంట్లకు మాత్రం 5 శాతం ఐటిసి ఉంటుంది. ఇక ఆహార పార్సల్స్‌కు( టేక్‌వెస్) ఐటిసి లేకుండా 5 శాతం జిఎస్‌టి పడుతుంది.

Comments

comments