Home రంగారెడ్డి మాయ లేళ్లు కావు మనసైన జింకలు

మాయ లేళ్లు కావు మనసైన జింకలు

deerనవాబుల పరిపాలనలో మాన్‌సూర్ అలీఖాన్ హయాంలో వేట కోసం ఈ ప్రదేశాన్నంతా వాడుకునే వారట. అటవీ శాఖ వారు 1975లో ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుని, వన్య సంరక్షణ, హరిణి(జింక), మయూర సంతానోత్పత్తి కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఆనాటి నుండి నేటి వరకు కొన్ని వేల జింకలు, దుప్పి, నెమళ్ళ సంఖ్యను పెంపొందించి సంవత్సరానికి సుమారు రెండు వందలకు పైగా శ్రీశైలం, అచ్చంపేట, మన్ననూరు, అదిలాబాద్, చిన్నారం తదితర అటవీ ప్రాంతాలకు తరలిస్తున్నారు. సుమారు 10,486 ఎకరాల విస్థీర్ణంలో ఏర్పాటైన ఈ పార్కు సరిహద్దు గ్రామాలైన తట్టి అన్నారం, మర్రిపల్లి, కుత్బుల్లాపూర్, కుంట్లూర్, మన్సూరాబాద్, వనస్థలిపురం శివారుల్లో ఎప్పడూ అటవీశాఖ అధికారులు మఫ్టీలో గస్తీ కాస్తారు, గ్రామ ప్రజలలో కూడా కొందరు స్వచ్ఛందంగా వాలెంటీర్లు గా వ్యవహరిస్తారు.
ప్రస్తుతం 550 కి పైగా కృష్ణ జింకలు, బ్లాక్‌బక్స్, మరో 500 వకరు దుప్పులు, అడవి పందులు, సుమారు నాలుగు వందల వరకు నెమళ్ళు ఇక్కడే సేద తీరుతున్నాయి. వీటి కోసం ఎన్నో రకాల ఏర్పాట్లను చేసింది అటవీ శాఖ. చిరుధాన్యాలతో పోషక పదార్థాన్ని తయారు చేసి వాటికి ఆహారంతో పాటు పోషక విలువలను కూడా అందిస్తోంది. ఈ సాధు జీవాలు సేద తీరేందుకు పలు చోట్ల చల్లటి తడిక గోడల గుడారాలను నిర్మించారు. అవి విరివిగా సంచరించే ప్రదేశాలలో కుంటలను నిర్మించారు. ఎప్పటికప్పుడు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తారు. అక్కడక్కడ చెట్లకు ఉప్పు మూటలు కట్టి ఉంచుతారు ఎందుకంటే వీటికి నాలుక దురదలు కాని పూత కాని ఏర్పడినా లాలాజలం తక్కువగా ఉన్నా ఈ ఉప్పు మూటలను అవి నాలుకతో చప్పరిస్తాయి. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో చిరు ధాన్యాలతో తయారైన తవుడు వంటి పదార్థాన్ని అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తొట్లలో నింపుతారు. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి అక్కడే పండించిన లేత పచ్చి గడ్డి, చొప్ప గడ్డి మోపులను వాటికి అనువు గా అందిస్తారు. మరలా రాత్రి ఆహారాన్ని సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల ప్రాంతానికి చేరవేస్తారు. రోజు నాలుగు సార్లు నీటి ట్యాంకర్లతో నీటి కుండీలను నింపుతారు. ఇక్కడ నివసంచే వణ్యప్రాణులు అటవీ శాఖ వారి పర్యవేక్షణలో సురక్షిత జీవనం సాగిస్తున్నాయి. జూ పార్కుల్లో వన్యప్రాణులను ఎంత బాగా చూసినా వాటికి కొన్ని హద్దులు ఉంటాయి. వాటికి నిర్మించిన ఆవాసాలలోనే అవి నివసించాలి, వాటికి ఆహార నియమాలు, సమయపాలన తప్పనిసరి. పైగా అక్కడ సాధుజీవాల తో పాటు క్రురమృగాలు కూడా నివాసం ఉంటాయి. అందువల్ల కంచెలు వేసి వాటికి ప్రత్యేక రక్షణ కల్పించడం జరుగుతుంది. ఇక్కడ జింకలకు నెమళ్ళకు హద్దులు లేవు, నియమాలు లేవు, సమయ పాలన, సరిహద్దులు ఉండవు ఉన్నదల్లా ఒక్క స్వేచ్ఛ మాత్రమే వాటికి నచ్చినపుడు తింటాయి, నచ్చిన చోట ఉంటాయి. స్వేచ్ఛా విహంగాలైన ఈ జీవాలు ఒక్కోసారి ప్రహరీ గోడలు దాటి జనారణ్యంలోకి ఎగిరి పోతుంటాయి. అలా దారి తప్పిన వాటిని చాలా వరకు మఫ్టీలో ఉన్న అధికారులు, వాలంటీర్లు వెనక్కు తీసుకువస్తారు.
అటవీశాఖ వారికి సమాచారం అందేలోపు ఎవరైనా జంతువులను పట్టి బంధించాలని ప్రయత్నించినా, చంపాలని ప్రయత్నించినా కఠిన శిక్ష తప్పదు. కొన్ని సందర్భాలలో మాకు సమాచారం అందేలోపు ఈ మూగ జీవాలను పట్టుకునే ప్రయత్నాలు చేయకండి.తెలియని వారు వాటి పై చేయి వేస్తే అవి ప్రాణరక్షణ కోసం మీ పై దాడి చేస్తాయి. అందువల్ల వాటికి, మీకు కూడా ముప్పు సంభవించవచ్చు. కొందరికి నెమళ్ళను. జింకలను, దుప్పి, అడవి పందులను పట్టే ఒడుపు నేర్పు ఉంటాయి, అలాంటి వారు ఈ మూగ జీవాలకోసం కాపుకాస్తారు. ఉచ్చులు పాతిపెట్టడం, గోతులు తవ్వి ఆకులతో కప్పి వలలు పరవడం ఇలా చాలా పన్నాగాలు
వేస్తారు, అలాంటి వారిపై నిఘా యంత్రాంగం ఎప్పుడూ ఒక కన్ను వేసే ఉంటుంది.
గత రెండు సంవత్సరాలలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని తొమ్మిది మందికి పైగా అదుపులోకి తీసుకున్నాము.
ఇక్కడి జింకలను, నెమళ్ళను ఇతర ప్రాణులను అపహరించి ఆహారంగా తిన్నట్టు తెలిసినా వారం తరువాత కూడా వారి రక్త పరీక్షల ద్వారా కనిపెట్టవచ్చు. అలా రుజువైన వారికి న్యాయస్థానం విధించే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది.
నేషనల్ జింకల పార్కుగా పిలువబడే వన్యప్రాణి సంతానోత్పత్తి కేంద్రం పర్యాటకులకు ఉల్లాసం, చిన్నారులకు వైజ్ఞానికి విషయబోధిని గా ఉపకరిస్తోంది. నిరంతర సిసి కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది.
జంతువులకు గాయాలు తగిలినా, అస్వస్థత కు గురైనా తక్షణ చికిత్చ అందిస్తారు. ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పర్యాటకులు సందర్శించవచ్చు.
పర్యాటకులు అటవీ శాఖ వారి బస్సులోనే ప్రయాణించాలి, సొంత వాహనాలు నిషేధం. తినుబండారాలను వన్యప్రాణులకు వేయరాదు, ప్లాస్టిక్ కవర్లు లోనికి అనుమతించరు. జంతువులను చూసి ఆనందించాలే తప్ప వాటి స్వేచ్ఛకు భంగం వాటిల్లేలా ప్రవర్తించకూడదు, మార్గమధ్యంలో బస్సు దిగడం అరవడం వంటివి చేయకూడదు, అలా చేస్తే మూగ జీవాలు భీతిల్లిపోతాయి. వన్యప్రాణుల పట్ల ప్రేమ, వాత్సల్యం చూపండి అంతే కాని దురాలోచనతో మన జాతి సంపదను నాశనం చేసే చర్యలు చేపట్టకండి.
అది మన జాతికే కాదు మనకు కూడా అవమానకరం అని అన్నారు హరిణ వనస్థలి సంరక్షులు.