Home జాతీయ వార్తలు 3వేల కోట్ల ఆయుధ సంపత్తికి రక్షణ శాఖ ఆమోదం

3వేల కోట్ల ఆయుధ సంపత్తికి రక్షణ శాఖ ఆమోదం

 

న్యూఢిల్లీ: సైన్యానికి మూడు వేల కోట్ల విలువైన ఆయుధాల‌ను స‌మకూర్చుకునేందుకు శనివారం కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపింది.అత్యాధునిక ర‌క్ష‌ణ ఆయుధాల్లో బ్ర‌హ్మోస్ మిస్సైళ్ల‌తో పాటు యుద్ధ ట్యాంక్ అర్జున్ కోసం ఆర్మౌర్డ్ రిక‌వ‌రీ వెహికిల్స్‌(ఎఆర్‌వి) వాహనాలు ఏర్పాటు చేసుకునేందుకు రక్షణ శాఖ అంగీకారం తెలిపినట్లు ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు.

కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో ఆయుధ సమీకరణపై జ‌రిగిన డిఫెన్స్ అక్విజిష‌న్ కౌన్సిల్‌(డిఎసి) స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. బిలియన్‌ డాలర్లతో ర‌ష్యా నిర్మిస్తున్న రెండు భార‌తీయ రహస్య యుద్ధ నేవీ షిప్‌ల‌కు బ్ర‌హ్మోస్ మిస్సైళ్ల‌ను వాడ‌నున్నారు. బ్ర‌హ్మోస్ మిస్సైల్‌ను దేశీయంగా త‌యారు చేశారు. ప్రస్తుతానికి నౌకలలో బ్రహ్మోస్‌ను ఆయుధంగా ఉపయోగించుకునేందుకు వాటి సమీకరణ చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. అర్జున్‌ యుద్ధ ట్యాంకుల కోసం సమీకరించే ఆర్మౌర్డ్‌ రికవరీ వాహనాలను డీఆర్‌డీఓ డిజైన్‌ చేసి అభివృద్ధి చేసింది. వీటిని భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ తయారు చేస్తుంది.