Home ఎడిటోరియల్ భిక్షాటనలో మానవ హక్కులు

భిక్షాటనలో మానవ హక్కులు

Delhi High Court has ruled the historic verdict

ఆగష్టు 8వ తేదీన ఢిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది. బ్రిటీషు కాలం నాటి ఒక చట్టాన్ని రద్దు చేసింది. బాంబే ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ 1959 (బాంబే భిక్షాటన నిరోధక చట్టం, ఇది దేశరాజధాని ఢిల్లీకి కూడా వర్తిస్తుంది), సంబంధిత సెక్షన్లన్నింటినీ రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంది. అనేక సంవత్సరాల క్రితం హర్షమందర్, కర్నికా సాహ్ని దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై కోర్టు ఈ తీర్పు చెప్పింది. రాజ్యాంగంలోని 14-22 అధికరణలకు ఈ చట్టం విరుద్ధం కాబట్టి చట్టాన్ని రద్దు చేయాలని దాఖలైన వ్యాజ్యం ఇది.

భిక్షాటన నేరం కాదని తేల్చి చెప్పడం ద్వారా కోర్టు పేదరికం అన్నది మానవహక్కులకు సంబంధించిందని స్పష్టం చేసింది. భిక్షాటనను నేరంగా చెప్పడం అంటే జీవించే, ఉపాధి పొందే హక్కులను, పేదవాళ్ళ సామాజిక హోదాను కాదనడమేనని, చట్టబద్ధ్ద పాలన ఉన్న దేశంలో ఇలా ప్రాథమిక హక్కును హరించడం సహించలేమని తెలియజేసింది.

భిక్షాటన అనేది ఈ చట్టం ప్రకారం “బహిరంగ ప్రదేశాల్లో పాటలు పాడడం, నాట్యం చేయడం, భవిష్యత్తు చెప్పడం, ఏదన్నా వస్తువును అమ్మకానికి పెట్టడం వంటి పనులు చేసినా చేయకపోయినా బిచ్చం అడగడం, తీసుకోవడం”. ఇండియన్ పీనల్ కోడ్ కాని, ఈ చట్టం కాని బిచ్చమెత్తడం అంటే ఏమిటో వివరించలేదు. అలాగే బహిరంగ ప్రదేశాలేవో చెప్పలేదు. ఇందులో అయోమయం ఉంది. ఈ చట్టాన్ని అమలు చేస్తున్నప్పుడు దుర్వినియోగమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా భిక్షాటన బలవంతం వల్ల చేస్తున్నారా లేక తామే చేస్తున్నారా అన్న తేడా కూడా ఇందులో ఏదీ లేదు.

కోర్టు మాటల ప్రకారం భారత రాజ్యాంగ చట్రంలో ప్రతి వ్యక్తికి గౌరవంగా జీవించే హక్కు ఉంది. రాజ్యం భిక్షాటనను నేరంగా ప్రకటించవచ్చా? ఈ ప్రశ్నకు కోర్టు స్పష్టంగా అలా చేయకూడదని జవాబిచ్చింది. అంతేకాదు, స్వచ్ఛందంగా బిచ్చమెత్తడం, బలవంతంగా భిక్షాటన చేయడం ఈ రెండింటి మధ్య తేడా చూపించలేదని కూడా గుర్తు చేసింది. రాజ్యాంగంలోని అధికరణ 14కు విరుద్ధమని చెప్పింది.

“ఈ చట్టం ప్రకారం రాజ్యం భిక్షాటన చేయని వారిని కూడా నిర్బంధించవచ్చు. వాళ్ళు రోజు కూలీలు కావచ్చు, వారికి పోషించవలసిన కుటుంబాలు ఉండవచ్చు. వారు నిర్బంధానికి గురవ్వడం వల్ల ఆ కుటుంబాల్లో పోషించేవారు ఎవరూ ఉండరు. మొత్తం కుటుంబం పేదరికానికి, దారిద్య్రానికి గురవుతుంది. ఇది సంక్షేమరాజ్యం ఉద్దేశం, లక్ష్యం ఎన్నటికి కాదు. పైగా దీన్ని సామాజిక ప్రయోజనాల చట్టం అని చెబుతున్నారు.” అంటూ వ్యాఖ్యానించింది.

భారత ప్రభుత్వం తరఫున వాదించిన స్టాండింగ్ కౌన్సిల్ తన కౌంటర్ అఫిడవిట్ లో “. కాని పేదరికం వల్ల బిచ్చమెత్తుతున్నారా లేక కావాలని చేస్తున్నారా లేక బలవంతంగా ఎవరైనా చేయిస్తున్నారా అన్నది తెలుసుకోడానికి అరెస్టు చేయవలసి ఉంటుంది. నిర్బంధంలోకి తీసుకున్న తర్వాతే, విచారణ తర్వాతే ఎవరైనా ఎందుకు భిక్షాటన చేస్తున్నారో కారణాలు తెలుస్తాయి” అని వాదించారు. కోర్టు ఈ వాదనను అంగీకరించలేదు, అనుమానంతో వ్యక్తిని నిర్బంధించి, ఆ తర్వాత భిక్షాటన చేయడం లేదని వదిలేసే క్రమంలో ఎలాంటి చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా వ్యక్తుల స్వేచ్ఛను హరించడాన్ని ఒప్పుకోలేమని తేల్చి చెప్పింది.

భిక్షాటన వాస్తవం గురించి కోర్టు చెప్పిన మాటలు గమనార్హమైనవి. “ఎవరైనా వీధుల్లో కావాలని బిచ్చమెత్తడం జరగదు. వారికి అవసరం ఉంది కాబట్టి ఆ పని చేస్తారు. బతకడానికి వారి చివరి ఆసరా భిక్షాటన. మరో మార్గమేదీ వారికి ఉండదు. ప్రతి ఒక్కరికి సామాజిక భద్రత కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాని అందరికీ ప్రభుత్వం సామాజిక భద్రత కల్పించలేదనడానికి నిదర్శనం భిక్షగాళ్ళు” అని ఖరాఖండిగా చెప్పింది. భిక్షాటనను నేరమనడం వల్ల అసలు సమస్య పరిష్కారం కాదని కూడా చెప్పింది.

“భిక్షాటనను తొలగించాలని మనం కోరుతున్నట్లయితే, బిచ్చగాళ్ళు కనిపించకుండా చేసే ఈ కృత్రిమ ప్రయత్నాలు కాదు చేయవలసింది. వాళ్ళను నేరస్థులుగా ప్రకటించడం వల్ల సమస్య మూలాన్ని గుర్తించకుండా బిచ్చగాళ్ళు కనిపించకుండా చేయడమే జరుగుతుంది. మూలకారణం పేదరికం. దానికి అనేక కారణాలున్నాయి. విద్యార్జనకు అవకాశాలు లేకపోవడం, సామాజిక రక్షణ లేకపోవడం, కులం, జాతిపరమైన వివక్ష, భూమి లేకపోవడం, శారీరకమైన, మానసికమైన లోపాలు, ఒంటరితనం వంటి కారణాలున్నాయి.“ అని చెప్పింది.

బలవంతంగా భిక్షాటన చేయించడం వంటి వ్యవహారాలను నిరోధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే, దానికి సంబంధించి స్పష్టమైన వాస్తవాల గురించి ఆలోచించి, అర్థవంతమైన ప్రణాళికతో ముందుకు రావాలని సూచించింది. రాజ్యాంగ హక్కులను మరిచిపోరాదని చెప్పింది.

ఇది న్యాయస్ధానాల వైఖరిలో మార్పును సూచిస్తుంది. భిక్షాటన చట్టాలను ప్రాథమిక హక్కుల కోణంలో చూడడమన్నది ఇంతవరకు జరగలేదు. బిచ్చగాళ్ళను తప్పుపట్టడమే ఇంతవరకు జరుగుతూ వచ్చింది. ఫుట్ పాతులపై పడుకునే వారిని పబ్లిక్ న్యూసెన్సుగా చెప్పడం (ఓల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మునిసిపల్ కార్పొరేషన్), మురికివాడల ప్రజలను బహిరంగస్థలాల్లో అక్రమంగా ప్రవేశించిన వారనడం (లాయర్స్ కో ఆపరేటివ్ గ్రూప్ హౌసింగ్ సొసైటి వర్సెస్ ఇండియన్ యూనియన్), గూడులేని వారిని జేబుదొంగలనడం (అల్మిత్రా పాటిల్ వర్సెస్ ఇండియన్ యూనియన్), అరాచకవాదులనడం (హేంరాజ్ వర్సెస్ కమీషనర్ ఆఫ్ పోలీస్) జరిగాయి.

భిక్షాటన నిరోధక చట్టాల వెనుక హేతువు బహిరంగ స్థలాల్లో ప్రజలకు భద్రత. అంటే అపరిశుభ్రంగా ఉన్న బిచ్చగాళ్ళు ఎదురవ్వకుండా చూడడం. ప్రజారోగ్యం, ప్రజల భద్రత తదితర విషయాలను చెప్పిన ఆదేశిక సూత్రాలను అమలు చేయడం సాకుగా ఈ చట్టాలు వచ్చాయి. అందువల్లనే కేవలం బిచ్చమెత్తుకునే నిరుపేద ఒంటరి బిచ్చగాళ్ళు మాత్రమే లక్ష్యమవుతుంటారు. కాని వీధుల్లో రోడ్లపై సామాజిక, ధార్మిక కార్యకలాపాల కోసం బలవంతంగా వసూళ్ళు చేసే గుంపులు లక్ష్యంగా ఉండవు.

ఈ నేపథ్యంలో భారతసమాజంలోని సహనం, అందరినీ కలుపుకోవడం అనే విలువలకు ఢిల్లీ హైకోర్టు తీర్పు అద్దం పట్టింది. సమానత్వం, స్వేచ్ఛ, గౌరవం అనే ముఖ్యమైన విలువలను ప్రస్తావించింది.

                                                                                                                                       – అషీష్ గోయల్  (ది వైర్)