Home కరీంనగర్ రైల్వే స్టేషన్‌లో ప్రసవం…

రైల్వే స్టేషన్‌లో ప్రసవం…

FINAL1కరీంనగర్: జిల్లాలోని రామగుండంలో ఆదివారం ఓ గర్భిణి రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో పురిటి నొప్పులు వచ్చాయి. ఇది గమనించిన రైల్వే ఉద్యోగిని స్టేషన్‌లో కాన్పు చేయించారు. వివరాల్లోకి వెళితే… రాజస్థాన్‌కు చెందిన సుర్మా దేవి భర్త ప్రకాష్‌తో కలిసి చెన్నై నుంచి జోధ్‌పూర్‌కు వెళ్తోంది. ఈ క్రమంలో రైలు పెద్దపల్లి స్టేషన్ దాటగానే సుర్మాకు నొప్పులు వచ్చాయి. దీంతో కంట్రోల్‌రూమ్‌కు సమాచారమివ్వగా రైల్వే ఉన్నతాధికారులు రామగుండంలో హాల్ట్ లేకున్నా రైలును కాసేపు ఆపారు. అనంతరం సుర్మాదేవిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా నొప్పులు ఎక్కువ కావడంతో రైల్వే పోలీసులు స్టేషన్‌లోనే కాన్పు చేయడానికి ఏర్పాట్లు చేశారు. రైల్వే ఉద్యోగిని రేవతి సుర్మాకు పురుడు పోయడానికి సాయం చేసింది. దీంతో సుర్మాదేవి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత 108కు కాల్‌చేయడంతో సిబ్బంది వచ్చి తల్లీబిడ్డలకు ప్రాథమిక చికిత్స చేసి గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగానే ఉన్నట్లు సమాచారం.