Home ఆఫ్ బీట్ అనుమతించిన లేఅవుట్లు మంచి భవిష్యత్తుకు మెట్లు

అనుమతించిన లేఅవుట్లు మంచి భవిష్యత్తుకు మెట్లు

lf

 ఔటర్ రింగ్ రోడ్డు ప్లాట్లకు డిమాండ్
ఓఆర్‌ఆర్ వైపు దృష్టిసారించిన నగర వాసులు
అనుమతులు ఉంటే సమస్యలు ఉండవు: కమిషనర్ చిరంజీవులు

ప్రస్తుతం నగర శివారులో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకున్నది. అందుకు నిదర్శనం హెచ్‌ఎండిఏకు ప్లానింగ్ విభాగానికి వస్తున్న ఆదాయమే. గత 2015లో ప్లానింగ్ విభాగం ద్వారా వచ్చిన ఆదాయం కేవలం రూ.215 కోట్లుగా ఉంటే 201718కు వచ్చేసరికి అది కాస్త రూ.845 కోట్లకు పెరిగింది. అంటే నగర శివారు ప్రాంతాల్లో రియల్ వ్యాపారం ఏమేరకు ప్రగతిలో ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఇప్పుడు శివారు ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసే వారిలో కొంత అయోమయం నెలకొన్నది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్‌కు చేరువగా ఇటు లోపల, అటు వెలుపల ఓ రెండు కిలోమీటర్ల వరకు ఉన్న లేఅవుట్లకు విపరీతమైన గిరాకీ ఉన్నది. నగరంలో నెలకొన్న ట్రాఫిక్, వాయు, శబ్ద కాలుష్యం, కొరవడిన పచ్చదనం, కనుమరుగవుతోన్న ప్రశాంతత ఇత్యాది కారణాలతో నగర వాసులు అపార్టుమెంట్ల సంస్కృతితో విసిగి శివారు ప్రాంతాలపై దృష్టి సారించారు. స్వంతంగా ఇల్లు నిర్మించుకుని హాయిగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే శివారు ప్రాంతాల్లో ఖాళీ ప్లాట్లకు విపరీతమైన గిరాకీ పెరుగుతున్నది. అయితే, ఇక్కడే కొనుగోలుదారులు కొంత సంశయానికి లోనవుతున్నారు. ప్లాట్లున్న లేఅవుట్ అక్రమలేఅవుటా… అనుమతులున్నాయా..? అనేది తేల్చుకోలేకపోతున్నారు. రియల్ వ్యాపారులు, మధ్యవర్తులు మాత్రం పలు విషయాలు చెప్పి కొనుగోలుదారులను నమ్మించి ఒప్పించి ఖరీదు చేయిస్తున్నారు. తీరా ప్లాటు కొనుగోలు చేశాక తెలుస్తుంది. ఇది అక్రమ లే అవుట్ అని. దీనిని దృష్టిలోపెట్టుకుని ‘మన తెలంగాణ’ మీ ముందుకు ఏది అక్రమ లేఅవుట్… ఏది సక్రమ లేఅవుట్ అనేది స్పష్టంగా తెలియపరుస్తున్నది.
ఇదీ అక్రమ లేఅవుట్
ప్రస్తుతం నగర శివారులో అధిక శాతం లే అవుట్లన్నీ అక్రమంగా వెలిసినవే. అంటే హెచ్‌ఎండిఎ నుండి ఏలాంటి అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్లను అక్రమ లే అవుట్లుగా పరిగణిస్తారు. ఇలా ఏర్పడిన లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ప్రస్తుతం, లేదా భవిష్యత్‌లో ఇళ్ళ నిర్మాణ అనుమతులు రావడం చాలా కష్టంతో కూడుకున్నది. దీంతో స్వంత ఇంటి కల సమస్యలతో నేరవేరుతుంది. అనుమతులు లేకుండా ఇంటిని నిర్మిస్తే కరెంటు కనెక్షన్, నీటి కనెక్షన్‌లు చాలా జఠిలంగా వస్తాయి. ఇంటి పన్ను కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ రకమైన ఇబ్బందులు లేకుండా ఉండాలంటే హెచ్‌ఎండిఎ అనుమతి ఉన్న లేఅవుట్లలో మాత్రమే ప్లాట్లు కొనుగోలు చేయాలి. నగర శివారులో లేఅవుట్‌ను ఏర్పాటు చేయాలంటే హెచ్‌ఎండిఎ నుండి అనుమతి తప్పనిసరి. అనుమతి ఉన్నదా లేదా.. అని తెలుసుకోవాలంటే రియల్ వ్యాపారులు చూపించే లేఅవుట్ల కాపీలపైన ఎల్‌పి నెంబర్, హెచ్‌ఎండిఎ లోగో లేదా అధికారిక ముద్ర ఉంటుంది. ఇవీ లేకుంటే బండగుర్తుగా చెప్పేది లేఅవుట్లలోని రోడ్లన్నీ కనీసం 30 అడుగుల వెడల్పుతోనే ఉంటాయి. 30 అడుగుల వెడల్పుకు తక్కువగా ఏ ఒక్క రోడ్డు ఉన్నా అది అక్రమ లేఅవుట్‌గా గుర్తించాలి. ప్రత్యేకంగా పార్కు స్థలం, సెప్టిక్ ట్యాంక్, విద్యుత్ స్తంభాలు ట్రాన్స్‌ఫార్మర్, వర్షపునీటి ఇంకుడుగుంతలు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి ఉంటాయి. వీటిల్లో ఏ ఒక్కటి లేకున్నా అక్రమంగా ఏర్పాటు చేసిన లేఅవుట్ అని భావించాల్సిందే. లేఅవుట్ ప్రారంభం లో ఇవన్నీ ఉండవు. కానీ, లేఅవుట్‌కు ప్రత్యేకంగా ఎల్‌పి నెంబర్ ఉంటుంది. రోడ్లు మాత్రం ఉంటాయి. వాటితోనే గుర్తించడం తేలిక.
గ్రామపంచాయితీ లేఅవుట్ కూడా అక్రమమే
హెచ్‌ఎండిఎ పరిధిలో లేఅవుట్లకు అనుమతులు మంజూరుచేసే అధికారం ఒక్క హెచ్‌ఎండిఎకు మాత్రమే ఉన్నది. గ్రామపంచాయితీలకు గానీ, మునిసిపాలిటీలకుగానీ లేదు. హెచ్‌ఎండిఎ అనుమతులు మంజూరు చేసిన లే అవుట్లను విడుదల చేసే అధికారం మాత్రమే స్థానిక సంస్థలకు ఉన్నది. కొందరు రియల్టర్‌లు గ్రామపంచాయితీ ముద్ర వేయించుకుని గ్రామపంచాయితీ నుండి అనుమతి తీసుకున్నామని స్పష్టం చేస్తుంటారు, వాదిస్తుంటారు. నమ్మిస్తుంటారు. కానీ, ఆ లేఅవుట్లుకూడా అక్రమంగా వెలిసినవే. గ్రామపంచాయితీలకు స్వతంత్రంగా లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేసే అధికారం లేదు. ఎకరంకైనా, 100 ఎకరాలకైనా హెచ్‌ఎండిఎ మాత్రమే నగర శివారులో లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేస్తుంది.
అనుమతులుంటేనే సదుపాయాలు
జీఓ 33 ప్రకారం నగర శివారులో లేఅవుట్లకు అనుమతులు మంజూరుచేసే అధికారం హెచ్‌ఎండిఎకు మాత్రమే ఉన్నది. హెచ్‌ఎండిఎ అనుమతులున్న లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయడం ద్వారా అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా భూ వివాదాలు ఉండవు. ఎఫ్‌టిఎల్ పరిధిలోనికి రావు. ప్రభుత్వ భూములు, మాస్టర్‌ప్లాన్ ప్రతిపాదిత రోడ్లు ప్లాట్ల మీదుగా వెళ్ళడం, నాలాలు, నీటి వనరుల్లో లేఅవుట్లు ఏర్పాటు చేయరు. భూవినియోగ కేటగిరి నివాసయోగ్యంలోనే ఉంటుంది. తద్వారా ఇంటి నిర్మాణ అనుమతులు, బ్యాంకుల రుణాలు, విద్యుత్, నల్లా కనెక్షన్లు సులభంగా మంజూరవుతాయి. రోడ్లు విశాలంగానూ ఉంటాయి. ఇంటిపన్ను కూడా అపరాధ రుసుంలు లేదా జరిమానాలు లేకుండా వస్తుంది.
ఎల్‌ఆర్‌ఎస్ ఉన్న ప్లాట్లు ఖరీదు చేయాలి
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి ప్లాట్లను, లేఅవుట్లను క్రమబద్దీకరించాలని నిర్ణయించి జిఓ 151ను గత 2015 నవంబర్‌లో విడుదల చేస్తూ లేఅవుట్ క్రమబద్దీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్)ను తీసుకువచ్చింది. ఆ జీఓ ప్రకారంగా ఎల్‌ఆర్‌ఎస్ చేసిన ప్లాట్లను కొనుగోలు చేయవచ్చును. ఎల్‌ఆర్‌ఎస్ ఉన్న ప్లాట్లకు అనుమతులున్న లేఅవుట్ ప్లాటుతో సమానం. అనుమతులున్న లేఅవుట్లలో ఏఏ వసతులు ఉంటాయో అవి ఎల్‌ఆర్‌ఎస్ ప్లాట్లకు కూడా వర్తిస్తాయి.
ఎల్‌ఆర్‌ఎస్ లేకుంటే 33 శాతం అదనం
అక్రమ లేఅవుట్లలో కొనుగోలుచేసిన ప్లాట్లలో ఇంటి నిర్మాణ అనుమతి తీసుకోవాలంటే అభివృద్ధి రుసుంలతో పాటుగా 33 శాతం అపరాధ రుసుం(ఎల్‌ఆర్‌ఎస్)లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు నాలా(నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్‌మెంట్ యాక్ట్) ప్రకారం ఆర్‌డిఓ జారీ చేసిన ధృవీకరణ పత్రాన్ని తీసుకురావాలి. అప్పుడే భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తారు. ఆ నిర్మాణ అనుమతులు కూడా హెచ్‌ఎండిఎ నుండి తీసుకోవాలి. గ్రామపంచాయితీలు ఇవ్వరాదు. ఒకవేళ ఇచ్చినా అది చట్టబద్దం కాదని హెచ్‌ఎండిఎ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అక్రమ లేఅవుట్లలోని ప్లాటులో మాస్టర్ ప్లాన్ ప్రతిపాదిత రోడ్డు వెళ్లినా, భూ వినియోగ కేటగిరి నివాస యోగ్యంలో లేకున్నా, నీటి వనరుల ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉండినా, ప్రభుత్వ భూములు ఆనుకుని ఉన్నా భవన నిర్మాణ అనుమతులు హెచ్‌ఎండిఎ మంజూరు చేయదు. ఎల్‌ఆర్‌ఎస్ ఉన్న ప్లాట్లకు మాత్రమే గ్రామపంచాయితీలు ఇంటి నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి.
ఈ ప్లాట్లకు అనుమతులు అసలేరావు
2015 అక్టోబర్ 28 తర్వాత నగర శివారులోని అక్రమలే అవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లకు లింక్ డాక్యుమెంట్ లేకుండా పట్టాపాస్ పుస్తకముంటే భవన నిర్మాణ అనుమతులు అసలే రావు. ఇటీవల నగర శివారు ప్రాంతంలో అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసేవారు ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. పట్టా పాస్ పుస్తకంతో ఉన్న వ్యవసాయ భూముల్లో వెలిసిన అనుమతుల్లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే ఇంటి నిర్మాణ అనుమతులు రావు. అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసేవారు ఆయా ప్లాట్లకు లింక్ డాక్యుమెంట్ 2015 అక్టోబర్‌కు ముందుగా రిజిస్ట్రేషన్ అయిన వాటికే నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తారనేది మరవరాదు.

అనుమతులు ఉంటే సమస్యలు ఉండవు

నగర శివారులో ఎచ్‌ఎండిఎ అనుమతులు ఉన్న లేఅవుట్లలోనే ప్లాట్లను కొనుగోలు చేయాలి. అథారిటీ అనుమతులుంటే ఎలాంటి సమస్యలుండవు. ధరలు ఎక్కువ తక్కువ అనేది గమనించకుండా కేవలం అనుమతులున్న లేఅవుట్‌లోనే ప్లాట్లు తీసుకోవాలి. నిశ్చింతగా ఉండాలి.  ధరలు తక్కువని భావిస్తే సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడినా, అపరాధ రుసుంలు చెల్లించేందుకు సిద్దమైనా… ఆ ప్లాట్లకు అనుమతులు రావు. అందుకే కొందరు తక్కువ ధరకు ప్లాట్లు విక్రయిస్తుంటారు. ప్లాటు కొనుగోలు చేయకముందే అన్ని రకాలుగా అనుమతులున్నాయా..? లేవా..? ఏదేని నీటి వనరులకు చేరువగా ఉన్నాయా..? విచారణ చేసుకోవాలి. భవిష్యత్‌లో నియమనిబంధనలు మరింత కఠినంగా రానున్నాయి.

మంచె మహేశ్వర్
మన తెలంగాణ/ సిటీ బ్యూరో