Home అంతర్జాతీయ వార్తలు డెమొక్రాట్లకు ట్రంప్ గుబులు

డెమొక్రాట్లకు ట్రంప్ గుబులు

Donald-Trumpవాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో  పరిణామాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. రిపబ్లికన్ పార్టీలో డోనాల్డ్ ట్రంప్‌కు సానుకూల పవనాలు వీస్తుండడాన్ని చూసి ఆయన ప్రత్యర్థి పార్టీ  డెమొక్రాట్లు భయపడిపోతున్నారు. త్వరగా హిల్లరీ క్లింటన్‌కు నామినేషన్ ఇచ్చే పరిస్థితులు వచ్చేస్తే ట్రంప్‌పై గురిపెట్టి ప్రచారం చేయవచ్చునని పార్టీలోని హిల్లరీ మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు. ఇది జరగాలంటే డెమొక్రాటిక్ బరి నుంచి బెర్నీ శాండర్స్ తప్పుకోవాలని  పార్టీలోని పలువురు సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే శాండర్స్ వర్గీయులు అందుకు ససేమిరా అంగీకరించబోమని చెప్తున్నారు. అభిప్రాయ సేకరణ ఫలితాలను బట్టి చూసినపుడు డొనాల్ ట్రంప్‌ను ఓడించాలంటే హిల్లరీ కన్నా శాండర్స్ ఉత్తముడని కుండబద్ధలు కొడుతున్నారు. బెర్నీ శాండర్స్ ఇంకా ఎక్కువ కాలం ఎన్నికల బరిలో ఉండటం వల్ల హిల్లరీ విజయావకాశాలు దెబ్బతింటాయని డెమొక్రాటిక్ చట్ట సభ సభ్యులు భయపడుతున్నారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ రిపబ్లికన్ పార్టీలో డొనాల్ ట్రంప్ ప్రత్యర్థులంతా ఆయనకు మార్గం సుగమం చేయడాన్ని ప్రస్తావిస్తున్నారు. పోల్స్‌లో శాండర్స్ కన్నా హిల్లరీకి 30 లక్షల ఓట్ల ఆధిక్యం కనిపిస్తోందని చెబుతున్నారు. అయితే శాండర్స్ వర్గీయుల వాదన మరోలా ఉంది. తాజా సర్వేల్లో ట్రంప్‌తో పోటీకి బెర్నీ శాండర్సే అత్యుత్తముడని వెల్లడవుతోందని అంటున్నారు.