Home జాతీయ వార్తలు నోట్ల రద్దు ఓ పెద్ద కుంభకోణం

నోట్ల రద్దు ఓ పెద్ద కుంభకోణం

ఎవరి ప్రయోజనం కోసం ఇంతటి గాయం చేశారు? , ప్రధాని సమాధానం చెప్పాలి, మీడియా సమావేశలో రాహుల్ డిమాండ్

Rahul-Gandhi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తనకు సన్నిహితులైన కొంతమంది మహా సంపన్నులకు లబ్ధి చేకూర్చడం కోసమే పెద్ద నోట్లను రద్దు చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇదంతా ఓ పెద్ద కుంభకోణమని ఆయన అన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో గురువారం రాహుల్ విలేఖరులతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం, నకిలీ కరెన్సీ, ఉగ్రవాదులకు నిధులు వంటి సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ప్రధాని మోడీ చెప్పారని, అయితే ఇవేవీ నిజం కాలేదని, రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) సమర్పించిన నివేదికే దీనికి నిదర్శనమని రాహుల్ అన్నారు. నిరుద్యోగ సమస్య , వృద్ధి రేటు తక్కువగా ఉండడంలాంటి తీవ్రమైన సమస్యలు వేధిస్తున్న సమయంలో నోట్ల రద్దుకు నిర్ణయం తీసుకుని సామాన్యుడిని ఎందుకు దెబ్బతీయాల్సి వచ్చిందో ప్రధాని దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

రద్దయిన కరెన్సీలో 99 శాతం తిరిగి బ్యాంకుల్లోకి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంకు బుధవారం విడుదల చేసిన ఒక నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. మొత్త సొమ్మంతా బ్యాంకులకు తిరిగి వచ్చేసిందని, దీనికి ప్రధాని సమాధానం చెప్పాలని రాహుల్ అన్నారు. దేశానికి, దుకాణదారులకు, యువతకు ఇంతటి బలమైన గాయాన్ని ఎందుకు చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. నోట్ల రద్దు తప్పు కాదని, అయితే సామాన్యుల నుంచి డబ్బులు లాక్కొని తనకు సన్నిహితులయిన కొంతమంది బడా పెట్టుబడిదారుల జేబులు నింపేందుకే ఆ పని చేశారని ఆయన అన్నారు.70 ఏళ్లలో సాధించలేనిది తాను సాధించానని ప్రధాని చెప్పుకోవడం సరయినదేనని, అందుకు నోట్ల రద్దే నిదర్శనమని రాహుల్ వ్యంగ్యంగా అన్నారు. నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ధ్వంసయిందని, నిరుద్యోగం పెరిగిపోయిందని కూడా ఆయన అంటూ దీనికి ప్రధాని ఈ దేశ యువతకు సమాధానం చెప్పాలన్నారు.

రూ.520 కోట్ల విమానానికి రూ.1600 కోట్లా?

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై కూడా రాహుల్ ప్రధాని మోడీపై ధ్వజమెత్తుతూ, రూ.520 కోట్లు ఖరీదు చేసే విమానాన్ని రూ.1600 కోట్లు పెట్టి ఎందుకు కొన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘రూ.520 కోట్ల విమానాన్ని రూ.1600 కోట్లకు ఎందుకు కొన్నారు? ఎవరికి లబ్ధి చేకూర్చడానికి మీరు ప్రయత్నిస్తున్నారు?’ అని ప్రశ్నించారు. తనపై దాఖలయిన పరువు నష్టం కేసులకు భయపడ్డం లేదని కూడా ఆయన అన్నారు. కాగా అంతకు ముందు వందలాది మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీ వీధుల్లో రాఫెల్ ఒప్పందానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన జరిపారు. వారు ప్రధాని నివాసం వద్దకు వెళ్లడానికి ప్రయత్నించగా భద్రతా సిబ్బంది వారిని అడ్డుకొని వెనక్కి పంపించేశారు.

రాహుల్‌తో కుమారస్వామి భేటీ

మంత్రివర్గం విస్తరణపై చర్చ
వందరోజులు పూర్తి చేసుకున్న
జెడి(ఎస్)కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం

న్యూఢిల్లీ: కర్నాటకలో కాంగ్రెస్‌జెడి(ఎస్) సంకీర్ణ ప్రభుత్వం గురువారంతోవందరోజులు విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. తన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బలంగా ఉందని రాహుల్‌తో సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడిన కుమార స్వామి చెప్పారు. కాగా మంత్రివర్గ విస్తరణపై తాను రాహుల్ గాంధీతో చర్చించినట్లు కూడా ఆయన చెప్పారు. కేవలం మర్యాదపూర్వకంగానే తాను రాహుల్‌ను కలిసినట్లు కుమారస్వామి చెప్పినప్పటికీ మంత్రివర్గ విస్తరణపై సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వంలో జెడి(ఎస్)కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం భద్రంగా ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి చెప్పారు. రాహుల్‌తో జరిగిన సమావేశంలో తాను సిద్ధరామయ్య ఇటీవలి ప్రకటనలపై చర్చించలేదని కూడా ఆయన స్పష్ట చేశారు. తాను మరో సారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టవచ్చనే అర్థం వచ్చేలా సిద్ధరామయ్య ఇటీవల చేసిన ప్రకటనలతో కర్నాటకలో జెడి(ఎస్) కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఎంతో కాలం అధికారంలో కొనసాగకపోవచ్చంటూ ఊహాగానాలు రావడం తెలిసిందే. తన ప్రభుత్వాన్ని కూలదేయడం కోసం కుట్ర .రుగుతోందంటూ ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యానించడం తెలిసిందే. తన వ్యాఖ్యలపై సిద్ధరామయ్య ఇప్పటికే వివరణ కూడా ఇచ్చారు. అయితే సిద్ధరామయ్య పార్టీలో ఒక సీనియర్ నాయకుడని, ఆయన ముఖ్యమంత్రి కావాలనుకోవడంలో తప్పేమీ లేదని కుమారస్వామి అన్నారు. మంత్రివర్గ విస్తరణపైన, అలాగే వివిధ కార్పొరేషన్లు, బోర్డులకు చైర్మన్లను నియమించడంపై కూడా తాను రాహుల్‌తో చర్చించినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా కుమారస్వామి చెప్పారు.