Home రంగారెడ్డి మా డబ్బులు.. మాకివ్వండి

మా డబ్బులు.. మాకివ్వండి

Depositors Ask Thier Deposit Money In Grameen Bank

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మేము కాయ కష్టం చేసి డిపాజిట్ చేసుకున్న డబ్బులు మాకివ్వండి…బ్యాంకు సిబ్బంది అవినీతి, ఉన్నతాధికారుల నిర్లక్షం మూలంగా డబ్బులు మాయమైతే మాకేమిటి అంటూ మొయిషాబాద్ మండలం అజీజ్‌నగర్ గ్రామ పరిధిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎదుట ఖాతాదారులు అందోళనకు దిగారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సుమారు 150 మంది ఖాతాల నుంచి డబ్బులు మాయమైనట్లు జనవరిలో బయట పడింది. ఖాతాదారులు అందోళన చెందవద్దని జూలైలో అందరికి డబ్బులు ఇస్తామని బ్యాంకు అధికారులు హామీ ఇవ్వడంతో ఇప్పటివరకు ఖాతాదారులు వేచి చూసిన డబ్బులు ఇవ్వకపోవడంతో అగ్రహంతో బ్యాంకు వద్దకు చేరుకుని తమ డబ్బులు ఇచ్చే వరకు బ్యాంకులో లావాదేవీలు జరపనివ్వమని గేటుకు తాళం వేసి బైఠాయించారు. ఖాతాదారులు అందోళన చేస్తున్న విషయం తెలిసిన మొయినాబాద్ జడ్పిటిసి చంద్రలింగంగౌడ్, అజీజ్‌నగర్ ఎంపిటిసి మాణిక్ రెడ్డి, అమ్డాపూర్ ఎంపిటిసి రాంరెడ్డిలతో పాటు పలువురు రాజకీయ నాయకులు బ్యాంకు వద్దకు చేరుకుని ఖాతాదారులకు సంఘీభావంగా బైఠాయించారు. బ్యాంకు ఎదుట ఖాతాదారులు బైఠాయించిన విషయం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో విజిలెన్స్ అధికారులు వచ్చి ఆగస్టు 31 వరకు ఖాతాదారులకు డబ్బులు చెల్లిస్తామని బ్యాంకు ముందు నోటిసులు అతికించిన ఖాతాదారులు మాత్రం శాంతించడం లేదు. మంగళవారం ఉన్నతాధికారులు వచ్చి అందరి ముందు హామీ ఇవ్వాలని అంతవరకు బ్యాంకు లావాదేవీలను అడ్డుకుంటామని వారు తెలిపారు.