Home ఎడిటోరియల్ హరి x హరి = హరివంశ్

హరి x హరి = హరివంశ్

Deputy chairman position vacant the retirement on July 1

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో పాలక ఎన్‌డిఎ ఆధిక్యత నిరూపించుకుంది. ఉమ్మడి ప్రతిపక్షం సంఖ్యాబలంకన్నా ఎన్‌డిఎ బలగం తక్కువైనప్పటికీ కొన్ని ప్రతిపక్ష పార్టీల సహకారంతో ఎన్‌డిఎ అభ్యర్థి హరివంశ్ (జెడియు), ప్రతిపక్ష అభ్యర్థి బికె హరిప్రసాద్ (కాంగ్రెస్)పై విజయం సాధించారు. హరివంశ్‌కు 125 ఓట్లు, హరిప్రసాద్‌కు 105 ఓట్లు లభించగా, ఇరువురు ఓటింగ్‌లో పాల్గొనలేదు. 11 మంది గైరుహాజరైనారు. పిజెకురియన్ జులై 1న రిటైర్ కావటంతో ఖాళీ అయిన డిప్యూటీ ఛైర్మన్ స్థానానికి గురువారం ఎన్నిక జరిగింది. తమ కూటమి అభ్యర్థిని నిర్ణయించటంలో బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తమ పార్టీ సభ్యుని అభ్యర్థిగా నిర్ణయిస్తే గెలుపుకు అవసరమైన ఓట్లను ప్రతిపక్షంలోని కొన్ని పక్షాల నుంచి పొందటం సాధ్యం కాదు కాబట్టి జెడియు అభ్యర్థికి అవకాశమిచ్చింది. దీనివల్ల మిత్రభేదం పాటిస్తున్న శివసేనను దారిలోకి తెచ్చుకోవటం, అకాలీదళ్ క్లెయింను నిరాకరించటం సాధ్యమైంది. అంతేగాక బీహార్‌లో జెడియుతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పటీకీ, వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సీట్ల పంపిణీ విషయమై అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను బుజ్జగించటం సాధ్యమైంది.

ఎన్‌డిఎ అభ్యర్థి బిజెపి సభ్యుడు కానందున ప్రతిపక్షం నుంచి బిజూజనతాదళ్ (9), టిఆర్‌ఎస్ (6) ఓట్లు పొందటం సులభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో మాట్లాడినట్లు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా నవీన్ పట్నాయక్‌తో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో నేరుగా మాట్లాడి తమ అభ్యర్థికి తోడ్పాటు అర్థించినట్లు చెప్పబడుతున్నది. అవిశ్వాస తీర్మానం సందర్భంలోనే ప్రధాని మోడీ, నవీన్ పట్నాయక్‌తో మాట్లాడి అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో బిజెడి తోడ్పాటు కోరినట్లు, డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్థి బిజెపియేతరుడైతే తాము బలపరిచే అవకాశముంటుందని పట్నాయక్ స్పష్టం చేసినట్లు చెప్పబడుతున్నది. డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్ ఉన్నత విద్యావంతుడు, దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవమున్న పాత్రికేయుడు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన హరివంశ్ జయ ప్రకాశ్ నారాయణ్‌కు, మాజీ ప్రధాని చంద్రశేఖర్‌కు సన్నిహితుడు, బీహార్ నుంచి జెడియు అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికైనారు.

ఉమ్మడి అభ్యర్థిని పోటీ చేయించేందుకు పలుప్రతిపక్షాలు మూడుసార్లు సమావేశమయ్యాయి. ఎన్‌సిపి సభ్యుడు వందన చవాన్ అభ్యర్థిత్వంపై ఏకీభావం కుదిరే సమయానికి, బిజెడి ఎన్‌డిఎ అభ్యర్థిని బలపరుస్తుందని తెలియటంతో ఎన్‌సిపి తమ అభ్యర్థిని ఉపసంహరించుకుంది. మిగతా పక్షలేవీ ముందుకు రాకపోవడంతో కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెట్టాల్సి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు ముగ్గురు, పిడిపి సభ్యులిద్దరు గైరుహాజరైనట్లు తెలుస్తున్నది. అలాగే తమ ప్రియతమ నాయకుడు కరుణానిధి మరణంతో డిఎంకె సభ్యులు నలుగురూ సభకు హాజరుకాలేకపోయారు.

ప్రతిపక్ష ఐక్యతను బిజెపి విచ్ఛిన్నం చేసిందని, వచ్చే లోక్‌సభ ఎన్నికలపై దీని ప్రభావముంటుందని భావించటానికి వీల్లేదు. సమస్యలను బట్టి సభలో కార్యాచరణ సమన్వయం, వెలుపల రాజకీయ పొందికలు వేర్వేరు అంశాలు. బిజెపికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటులో ప్రతిపక్షాలన్నీ ఏకత్రాటిపై లేవు. ప్రతిపక్షాల్లో, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల విషయంలో తమ రాష్ట్రంలోని రాజకీయ మోహరింపులను బట్టి బిజెపి, కాంగ్రెస్ రెండింటినీ వ్యతిరేకించే పార్టీలున్నాయి; ఏదోక పార్టీతో కలిసి పోటీ చేసే పార్టీలున్నాయి. అందువల్ల బిజెపికి వ్యతిరేకంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టటమో లేక బిజెపి, కాంగ్రెస్ రెండింటికీ వ్యతిరేకంగా మరో కూటమి అనే అభిప్రాయాలు ఆచరణ సాధ్యం కానివి. అందువల్లనే రాష్ట్ర నిర్దుష్ట ప్రతిపక్ష ఐక్యత అనే భావన స్థిరపడుతున్నది. ఎన్నికల ఫలితాలను బట్టి ఆధిక్య కూటమిలో చేరే లేదా బలపరిచే పార్టీలుంటాయి. కాబట్టి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో ఎన్‌డిఎ ఆధిక్యత పొందటానికీ, సార్వత్రిక ఎన్నికలకు సంబంధం లేదు.

అభినందనల సందర్భంలో సర్వపక్షాలు ఆకాంక్షించినట్లు, ప్రభుత్వ పక్షంపట్ల, ప్రతిపక్షాలపట్ల సమదృష్టితో సభా కార్యక్రమాలను విజయవంతంగా నడపటంలో డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సఫలమై, ఆ ఉన్నత స్థానానికి వన్నె తెస్తారని ఆశించుదాం.