Home తాజా వార్తలు నిజామాబాద్ ఎన్నికలు చరిత్రాత్మకం

నిజామాబాద్ ఎన్నికలు చరిత్రాత్మకం

Sudeep Jainమనతెలంగాణ/నిజామాబాద్‌ ప్రతినిధి: నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నిక ఒక చరిత్రకు నాంది కానున్నదని కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సుధీప్‌జైన్ తెలిపారు. బుధవారం ఆయన ఇతర కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారులతో కలిసి హెలిక్యాప్టర్ ద్వారా నిజామాబాద్‌లో పర్యటించారు. ఇవియంల చెకింగ్ నిర్వహిస్తున్న శ్రీవిజయలక్ష్మి గార్డెన్ పంక్షన్‌హాల్‌లో ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ రామ్మోహన్‌రావు, ఇతర అధికారులతో కలిసి కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. అనంతరం ప్రగతిభవన్ సమావేశ మందిరంలో ఎన్‌ఎల్‌ఎంటి నిష్ణాతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవియంల ద్వారా ఇంతవరకు దేశంలో కేవలం ఎం.2 ఇవియం ద్వారా మాత్రమే నాలుగు బ్యాలెట్ యూనిట్లతో ఎన్నికలు నిర్వహించామన్నారు.

ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎం3 ఇవియంలతో ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12 బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేసి ఎన్నిక నిర్వహిస్తున్నామన్నారు. ఇది ఎంతో ఛాలెంజ్‌తో కూడుకున్నదని, అతి తక్కువ సమయంలో దీన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచంలో ఇంత వరకు ఎం3 ఎన్నికలు నిర్వహించలేదని ఇంత పెద్ద ఎత్తున 12 బ్యాలెట్ యూనిట్స్‌తో ఎన్నిక నిర్వహించడం ఒక చరిత్రకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వేదిక అవుతుందని ఆయన తెలిపారు. ఇది మనందరికి ఒక ఛాలెంజ్‌గా అని, ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ప్రణాళికబద్దంగా, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక కంట్రోల్ యూనిట్, ఒక వివిప్యాట్, 12 బ్యాలెట్‌యూనిట్స్ ఉపయోగిస్తామన్నారు. అంటే 12 బ్యాలెట్ యూనిట్స్‌లో ఒక బ్యాలెట్ యూనిట్ సమస్య వస్తే దాని స్థానంలో మరో బ్యాలెట్ యూనిట్ అమర్చాలని దీని అవసరమైన సాంకేతికత చర్యలు తీసుకోవాలన్నారు.

నిజామాబాద్‌లో 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవియంలను సిద్ధం చేస్తున్నామని జగిత్యాలలో మరో రెండు నియోజకవర్గాలకు ఇవియంలను సిద్ధం చేయడంతో పాటు సాంకేతిక నిపుణులను అందిస్తున్నామన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం. రామ్మోహన్ రావు వచ్చిన అధికారులకు ఏర్పాట్లపై అన్ని విషయాలను వివరించారు. ఫంక్షన్ హాల్‌లో నిర్వహిస్తున్న ఇవియంల తనిఖీ ప్రక్రియ ఏర్పాట్లపై వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారుల సూచనల మేరకు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చర్యలు తీసుకుంటున్నామని ఆ దృష్టితో అధికారులను సన్నద్ధం చేశామని ఇవియంలను మొదటి స్థాయి చెకింగ్ చేస్తున్నామని, ఎన్నికల విధులు విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ఆయన వెంట అదనపు సిఈఓ బుద్ద ప్రకాష్, ఎన్నికల సాధారణ పరిశీలకులు గౌరవ్ దాలియా, ప్రత్యేక అధికారి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్‌బొజ్జా, సిపి కార్తీకేయ, సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, బిఎల్‌ఈసిఐఎల్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Deputy Election Commissioner Sudeep Jain on Nizamabad Lok Sabha Polls