Home కలం జీవన బీభత్స కళాత్మక సృష్టికర్త

జీవన బీభత్స కళాత్మక సృష్టికర్త

PP

మునెమ్మ నవలపై పెద్ద చర్చనే సాగింది. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. కానీ, దాన్ని సరిగా అర్థం చేసుకున్నవారు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. సృజనాత్మక వాస్తవికతను గుర్తించలేని విమర్శకులు దానిపై విమర్శ పెట్టారు. వాస్తవికతను ప్రతిబింబించడమంటే కళాసౌందర్యాన్ని తోసిరాజనే ఓ తప్పుడు ఆలోచన తెలుగులో చాలా మందికి ఉంది. అందుకే, తెలుగులో కళాత్మక సౌందర్యం కొరవడిన రచనలే ఎక్కువ. అందువల్లనే ఆయన మునెమ్మ నవలను కొంతమంది పాఠకులు సరిగా అర్థం చేసుకోలేకపోయారు.

“నన్ను నేను అభివ్యక్తి పర్చుకోవడానికి రాస్తాను. నాలో ఓ శూన్యం వుంది. ఏకాంతం వుంది. దాన్ని భర్తీ చేసుకోవడానికి ఏదో చేయాలన్పిస్తుంది. దీన్ని సైకాలజీలో ఇంటెన్సివ్ డ్రయివ్ అంటారు. దీన్ని తృప్తి పరుచుకోవడానికే నా రచనా వ్యాసంగమంతా” అని డాక్టర్ కేశవరెడ్డి ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పారు. సమాజాన్ని ఉద్ధరించడానికి రచనలు చేస్తున్నాననేంత అహం కేశవరెడ్డికి లేదు. అందుకే ఆయన ఉత్తమ రచయితగా మనగలిగారు.
నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లిలో ఒక వైద్యశాలలో ఆయన పని చేశారు. పుట్టింది ఎక్కడో చిత్తూరు జిల్లాలో. మధురాంతకం రాజారాంను ఎక్కువగా ఇష్టపడే కేశవరెడ్డి సమకాలీన తెలుగు రచయితలెవరూ అందుకోలేని ఎత్తుకు ఎదిగారు. ఆయన సృజనాత్మకత అటువంటిది. ఆయన రాసినవి కొద్ది రచనలే. కానీ, ఒక్కో నవల లేదా నవలిక ఒక్కో కావ్యం. ’బానిసలు- భగవానువాచ’, ’స్మశానం దున్నేరు’, ’అతడు అడవిని జయించాడు’, ’రాముడుండాడు రాజ్జివుండాది’, ’సిటీ బ్యూటిఫుల్’, ’ఇన్ క్రెడిబుల్ గాడెస్’, ’చివరి గుడిసె’, ’మూగవాని పిల్లనగ్రోవి’ ఆయన రచనలు. మెడికోల జీవితాల గురించి రాసిన ’సిటీ బ్యూటీఫుల్’ నవలను కాస్తో కూస్తో సాహిత్య పరిచయం వున్న వైద్య విద్యార్థులు ఇప్పటికీ పరవశంతో చదువుకుంటారు.
’బానిసలు-భగవానువాచ’, ది రోడ్ వంటి రచనలు కేశవ రెడ్డికి మాత్రమే సాధ్యమవుతాయి. ఉత్కంఠ భరితంగా సాగే ఈ రచనలు పాఠకులను తమ వెంట తీసికెళ్లి హృదయంలో అలజడి రేపుతాయి. సాహిత్యం చేయాల్సిన పని అంతకు మించి ఏమీ ఉండదు, బయటకు సాధు జంతువుగా కనిపించే మనిషి లోపల ఎటువంటి హంతకుడో ’ది రోడ్’ కథ చెప్తుంది. మనస్సరోవరంలో అల్లకల్లోలం రేగి మనల్ని ప్రక్షాళన చేస్తుంది.
కేశవరెడ్డి రాసిన ”అతడు అడవిని జయించాడు అనే ఈ 60 పేజీల నవలిక మన హృదయంలో, నెత్తురులో, మేధస్సులో ఏకకాలంలో మహా విస్ఫోటనమై పేలుతుంది”. ”ఏమి నేర్చుకున్నాడు మనిషి? అతడు అడవిని జయించాడు లాంటి రసమయ రచనలను రచించడం” అని సంజీవ్‌దేవ్ అన్నారంటే ఈ నవల విశిష్టత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ”సముద్రంలోకి, అడవుల్లోకి దాని బీభత్సం లోకి నౌక లేదా పడవ జారుకున్నట్లే మనం యిందులోకి తెలియ కుండా ముసలి వాని వెనుక, అతను వెతికే పందుల వెంట జారి పోతాం. అసలు పందుల కథ చదవడానికి ఎవరికి ఇష్టం వుంటుంది? మీ ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండా మిమ్మల్ని ముక్కుతాడు వేసి అడవుల్లోకి మీరంగీక రించని, మీకు నచ్చని తావుల వెంట మీకు ఏ విధంగానూ యిష్టం లేని పందుల వెంట మిమ్మల్ని రచయిత హిప్నటైజ్ చేసి తీసుకువెళ్లడం ఆశ్చర్యం కదా!” అని ఈ నవల గురించి పురాణం సుబ్రహ్మణ్య శర్మ అన్నారు.
అతడు అడవిని జయించాడు అనే నవల హెమింగ్వే ’ఓల్డ్ మాన్ అండ్ సీ’ అనే నవలకు అనుసరణ అని అన్నారు కొంత మంది. ఈ రెండు నవలలకు పోలికలున్నాయి. అయితే, ఓల్డ్ మాన్ సీ ప్రభావం అతడు అడవిని జయించాడు నవల మీద వుంది. ఈ కారణంగా అతడు అడవిని జయించాడు నవలకు వచ్చిన నష్టమేమీ లేదు. ఈ నవల సర్వ స్వతంత్ర రచనగానే విరాజిల్లుతుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే- అంటే నేను హెమింగ్వేను చాలా సమర్థంగా అనుసరించానన్నట్లే కదా, హెమింగ్వేను అనుసరించి విజయం సాధించడం చిన్న విషయమేమీ కాదు’ అని కేశవరెడ్డి ఒకానొక సందర్భంలో అన్నారు.
’ఇన్‌క్రెడిబుల్ గాడెస్’ దళితుల గురించి రాసిన నవల. ఎక్కడికి వెళ్లినా, ఏ వూరు వెళ్లినా బాధలూ అవే, అణచివేత రూపమూ అదే అని చెప్పిన నవల. క్షుద్ర దేవతలుంటారని ఈ నవల చెబుతుంది.’చివరి గుడిసె’, ’మూగవాని పిల్లనగ్రోవి’ చదివి అనందించాల్సిందే కానీ వర్ణించడం సాధ్యం కాదు. మూగవాని పిల్లనగ్రోవి ఒక రసమయ కావ్యం. దీన్ని మించిన రచన బహుశా తెలుగులో లేదేమో.
ఆయన రాసిన మునెమ్మ నవలపై పెద్ద చర్చనే సాగింది. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. కానీ, దాన్ని సరిగా అర్థం చేసుకున్నవారు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. సృజనాత్మక వాస్తవికతను గుర్తించలేని విమర్శకులు దానిపై విమర్శ పెట్టారు. వాస్తవికతను ప్రతిబింబించడమంటే కళాసౌందర్యాన్ని తోసిరాజనే ఓ తప్పుడు ఆలోచన తెలుగులో చాలా మందికి ఉంది. అందుకే, తెలుగులో కళాత్మక సౌందర్యం కొరవడిన రచనలే ఎక్కువ. అందువల్లనే ఆయన మునెమ్మ నవలను కొంతమంది పాఠకులు సరిగా అర్థం చేసుకోలేకపోయారు.
ఎంతో కాలంగా నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో వుంటూ కూడా కేశవరెడ్డి తన ఊరి యాసను, బాసను మర్చిపోలేదు. ఆయన నవలలకు ఇతివృత్తాలన్నీ అక్కడివే. తన చిన్ననాటి సంఘటనలను నెమరేసుకుంటూ బాల్యంలోకి వెళ్లి పోయి ఆయన తన రచనలు చేసి ఉంటారు. ఇంతటి సృజనాత్మక రచయిత తెలుగులో మరొకరు వుండకపోవచ్చు. ఆయన నవలలు పాఠకులను డిస్టర్బ్ చేస్తాయి.
మనలోకి మనం తొంగి చూసుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తాయి. పాఠకులను తన రచన వెంట నడిపించే ఏ మత్తు మందో ఆయన తన రచనలకు పోసి ఉంటారు.
కేశవరెడ్డి రచనలను చదవడం ప్రారంభిస్తే, వదలడం మన వల్ల కాదు. ‘సామాజిక నీతి‘ని ఆయన రచనలు కళాత్మకంగా ప్రదర్శిస్తాయి. చెప్పాలంటే ఆయన రచనలు బీభత్స రస ప్రధానమైనవి. చదువుతున్నంత సేపు లలిత లలితంగా మనల్ని వేలు పట్టుకుని నడిపించుకుని వెళ్లి, చివరకు ఓ సమాజంలోని బీభత్సాన్ని అనుభూతి చెందేలా చేస్తారు కేశవరెడ్డి.

(నేడు కేశవరెడ్డి వర్థంతి)

-కాసుల ప్రతాపరెడ్డి  , 9848956375