Home తాజా వార్తలు జూ పార్కుల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక

జూ పార్కుల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక

పార్కుల్లో పూర్తిస్థాయిలో సిసి కెమెరాల ఏర్పాటు
ఆధునిక వసతుల కల్పన…. జంతు మార్పిడికి శ్రీకారం

Zoo Park

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలోని జంతు ప్రదర్శన శాలల అభివృద్ధి ప్రభుత్వం అవసరమైన కార్యచరణ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అటవీశాఖ ఉన్నతాధికారులకు తగిన ఆదేశాలను సైతం జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని జూపార్కు ల అభివృద్థితో పాటు ఆధునిక వసతుల కల్పనపై అటవీశాఖ దృష్టి సారించింది. నేపథ్యంలో ప్రభుత్వ కార్యాచరణను అమలు చేసేందుకు అధికా ర యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. కొంతకాలం కిందట నగరంలో జూస్, పార్క్ ఆథారిటి ఆఫ్ తెలంగాణ పాలకవర్గ సమావేశం జరిగింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని అప్పటి అటవీశాఖ మంత్రి జోగు రామన్న సూచించారు. దీంతో అటవీశాఖ ఉన్నతాధికారులు జూపార్కుల అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టిని సారించారు. రాష్ట్రంలో రెండు జూపార్కులతో పాటు ఏడు జింకల పార్కులు ఉన్నాయి. హైదరాబాద్ మహానగరంలోని జూపార్కు 380 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతుండగా వరంగల్‌లోని జూపార్కు కేవలం 50 ఎకరాల విస్తరించింది. వీటితో పాటు నగరంలోని వనస్థలిపుం, రంగారెడ్డి జిల్లా చిల్కూరు, మేడ్చెల్ జిల్లాలోని శామీర్‌పేట, ఖమ్మం కిన్నెరసాని, మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రి, మహబూబ్‌నగర్, కరీంనగర్లలో జింకల పార్కులున్నాయి. ఇవి కేవలం ఒకే రకం జంతువులకే సంబంధించిన పార్కులుగా మిగిలాయి. దీంతో ఆయా పార్కులన్ని జింకలకే పరిమితమైన్నాయి.

పార్కులలో సిసి కెమెరాల ఏర్పాటు…

Zoo park

రాష్ట్రంలోని జూ పార్కులలో జంతువుల సంరక్షణ, ఇతరుల ప్రవేశాలు, దోపిడి, దొంగతనాలను ఆరికట్టేందుకు సిసి కెమెరాలను ఏర్పాటు అటవీ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు వరంగల్ జూపార్కులలో కొంత వరకు సిసి కెమెరాలున్నా పూర్తిస్థాయిలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జంతువుల సంరక్షణతో పాటు వాటి పోషణ కోసం జూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయాలను తెలుసుకోవడంతో పాటు వాటి ఆరోగ్య పరిస్థితులను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడూ పరిశీలించేందుకు వీలుగా సిసి కెమెరాలను ఎన్‌క్లోజర్ల చుట్టూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టింది.

జూలలోని జంతువులతో పాటు ఇతర రకాల పక్షులు, ఇతరత్రాభద్రత రీత్యా పహారీ గోడలు చుట్టూ కూడా సిసి కెమెరాల ఏర్పాటు చేసేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని జూ పార్కులో వైర్‌లెస్ సిసి కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. వైర్ల వల్ల జూ పార్కులో పలు రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనే ఉద్ధేశ్యంతో అధికారులు వైర్‌లెస్ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వైర్‌లెస్ కెమెరాల ఏర్పాటులో భాగంగా టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద ప్రయోగాత్మకం గా ఒక కెమెరాలను ఏర్పాటు చేశారు. దీని పని విధానాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించి పార్కులో మొత్తం ఇదే తరహా కెమెరాలను ఏర్పాటు చేయా లని అధికారులు నిర్ణయించారు. వరంగల్ జూ పార్కులోనూ ఈ తరహా పార్కులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఆధునిక వసతుల కల్పన…

Zoo park

పార్కులకు వచ్చే సందర్శకులకు అన్ని రకాల వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రధానంగా జూ పార్కు ల్లో సకల వసతులుండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో అటవీశాఖ ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో ప్రధానంగా మౌలిక వసతుల కల్పనతో పాటు ఆధునిక హంగులను కూడిన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా మంచినీళ్ళ వసతి, మరుగుదోడ్ల సౌకర్యంతో పాటు వసతి కోసం కూడా ఏర్పాట్లు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే జూ పార్కులో పర్యాటకుల అవసరాల రీత్యా బ్యాటరీ వాహనాలు, ఆధునిక వసతులను కల్పించారు. ఇటీవల నగర శివారులో ఏర్పాటు చేసి బొటానికల్ గార్డెన్ తరహాలో జూ పార్కులను ఏర్పాటు చేసేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

జంతు మార్పిడికి సన్నాహాలు….

Zoo park

జూ పార్కులకు అవసరమైన జంతువుల మార్పిడికి చర్యలు చేపట్టనున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అరుదైన జంతువులతో పాటు మన జూలలో లేని జంతువుల కొనుగోలుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధానం ఇప్పటికే కొనసాగుతున్నా… మరిన్ని జంతువుల కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ భావిస్తోంది. ఇందులో ప్రధానంగా జూ పార్కులో జిరాఫిని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కలకత్తా నుంచి జత జిరాఫీని నగరానికి చేరుకోనుంది. దీంతో పాటు మిజోరాం నుంచి పంది తోక కలిగిన కోతిని తీసుకువస్తున్నట్లు అధికారులు వివరించారు. అదేవిధంగా కాన్పూర్ నుంచి ఒక జత అరుదైన జింకలను కొనుగోలు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు మరో రాష్ట్రం నుంచి వేరైటిగా ఉండే అరుదైన కోతులను కూడా తెప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ జూ కోసం కొనుగోలు చేసేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది.