Home తాజా వార్తలు కంఠంలో ప్రాణముండగా తెలంగాణను బానిస కానివ్వను

కంఠంలో ప్రాణముండగా తెలంగాణను బానిస కానివ్వను

Development of Telangana in four years

 

కంఠంలో ప్రాణముండగా తెలంగాణను బానిస కానివ్వను

దుఃఖం లేని ఆకు పచ్చ రాష్ట్రం నా లక్షం

కోటి ఎకరాలకు సాగునీరు నా యజ్ఞం
పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడాలి
ఇప్పుడిప్పుడే తెలంగాణ పూత పూస్తోంది
దయ్యాలపాలు కావొద్దు
నవ్వెటోళ్ళ ముందు జారిపడొద్దు
కాంగ్రెస్, టిడిపి కత్తులు దూసుకొస్తున్నాయి
రక్షణ కవచంగా ఉండాల్సింది ప్రజలే
కెసిఆర్ ఉంటే బాబు ఆటలు సాగవనే భయం

కృష్ణానదిలో నీళ్ళు లేవట& గోదావరి నీటిని పంచుకోవాలట
తెలంగాణ కాంగ్రెస్ దద్దమ్మలు నోరు మూసుకున్నరు
ప్రాజెక్టులు నిండాలి& పంటలు పండాలి
టిఆర్‌ఎస్ గెలిస్తే కాళేశ్వరం& కూటమి గెలిస్తే శనీశ్వరం- గజ్వేల్ సభలో కెసిఆర్ 

మన తెలంగాణ / గజ్వేల్, హైదరాబాద్: “త్యాగాల పునాదుల మీద ఉద్యమం చేసి నాలుగేళ్ళ కింద తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నం. నేను తెలంగాణను సాధించినప్పుడు మీరంతా సంబురపడ్డరు. నాలుగేళ్ళలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని చూసి దేశమే అబ్బురపడింది, ఢిల్లీ నేతలు ఆశ్చర్యపోయారు. అన్ని రాష్ట్రాలకంటే అభివృద్ధిలో, సంక్షేమంలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. ఈ ప్రయాణం ఇట్లనే కొనసాగాలి. దుఃఖం లేని తెలంగాణ నా ఆశ. ఆకుపచ్చ తెలంగాణ నా లక్షం. కోటి ఎకరాలకు సాగునీరు నా యజ్ఞం. పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడాలి. ఇప్పుడిప్పుడే తెలంగాణ మొగ్గ తొడిగి పూత పూస్తోంది. దాచిదాచి మన రాష్ట్రం దయ్యాలపాలు ఉండి ఎన్నికల్లో ఓటు వేయాలి. తెలంగాణ ప్రగతి చక్రం ఆగొద్దు” అని ముఖ్యమంత్రి కెసిఆర్ ఒకింత భావోద్వేగంతో గజ్వేల్ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా ఇప్పటికే 118 నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించిన ప్రసంగించిన కెసిఆర్ చివరిగా తాను పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం ప్రజలను ఉద్దేశించి బుధవారం మధ్యాహ్నం ప్రసంగించారు.

ప్రాణముండంగ తెలంగాణను బానిసను కానివ్వను
“చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించాను. కోమాలోకి పోతావని నిమ్స్ వైద్యులు చెప్పినా నేను వినలేదు. తెలంగాణ రాష్ట్ర సాధనే నా లక్షంగా ఆమరణ దీక్ష చేశాను. ఢిల్లీ పీఠం కదిలింది. తెలంగాణ ఏర్పడితే అంధకారం తప్పదని కొద్దిమంది శాపాలు పెట్టారు. వాటిని పటాపంచలు చేసి 24 గంటలూ కరెంటు సరఫరా చేసుకంటున్నాం. రాష్ట్రాన్ని వెలుగుల తెలంగాణగా తీర్చిదిద్దుకున్నాం. తెలంగాణ రాష్ట్రం చేజారిపోయిందన్న బాధ చంద్రబాబును వెంటాడుతోంది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని మళ్ళీ మన మీదకు దండయాత్రగా వచ్చాడు. తెలంగాణను ఇనుప మూతి గద్దలకు ఇస్తే ప్రమాదమే. బక్క కెసిఆర్‌ను కొట్టడం కాంగ్రెస్‌కు చేతనైతలేదు. అందుకే ఆంధ్రకు పోయి చంద్రబాబును భుజాల మీద మోసుకొచ్చింది. నా కంఠంలో ప్రాణముండగా తెలంగాణను బానిసను కానివ్వను. వలస శక్తులకు చోటివ్వొద్దు. చంద్రబాబుకు అధికారం ఇవ్వొద్దు” అని కెసిఆర్ వ్యాఖ్యానించారు.

గోదావరి నీళ్ళు పంచుకోవాలంట
“కృష్ణా నదిలో నీళ్ళు లేవంట. కోదాడ సభలో రాహుల్‌గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల సమక్షంలో చంద్రబాబు మాట్లాడుతున్నాడు. గోదావరి నీళ్ళను పంచుకుందామంటున్నాడు. కృష్ణా నీళ్ళలో తెలంగాణకు వాటా లేదా? చంద్రబా బు మాయమాటలు చెప్తూ ఉంటే సిగ్గు, శరం లేని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మౌనంగా ఉన్నారు. ఆనాడు సిఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వ ను, ఏం చేసుకుంటారో చేసుకోండని వ్యాఖ్యానిస్తే ఇదే కాంగ్రె స్ నేతలు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు కృష్ణా, గోదావరి నీళ్ళ గురించి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నా రు.

తెలంగాణ కాంగ్రెస్ నేతలు చంద్రబాబుకు భజన చేస్తున్నా రు. కాంగ్రెస్ నాయకుల అసమర్ధతను చంద్రబాబు వాడుకుంటున్నాడు. కెసిఆర్‌ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ నేతలకు చేతనైతలేదు. అధికారం పోయిందని కాంగ్రెస్ నాయకులు కడుపు మంటతో ఉన్నరు. తెలంగాణకు రక్షణ కవచంగా నిలవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రజలపైనే ఉంది. ప్రజల మద్దతు లేకపోతే నేనేమీ చేయలేదు. మీరు ఆశీర్వదించి దీవిస్తే దేశమే నివ్వెరపోయే అభివృద్ధి, సంక్షేమం సాధించుకుంటం. మన ప్రాజెక్టులు నిండాలి, మన పంటలు పండాలి. మన పిల్లలకు మనమే ఉద్యోగం కల్పించుకుంటాం. టిఆర్‌ఎస్ గెలిస్తే కాళేశ్వరం. లేదంటూ శనేశ్వరమే” అని కెసిఆర్ వ్యాఖ్యానించారు.

నాడు బూర్గుల… నేడు చంద్రబాబు
కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులమీద ముఖ్యమంత్రి కెసిఆర్ గజ్వేల్ సభలో ధ్వజమెత్తారు. సాగునీటి ప్రాజెక్టులకు నాటి నుంచి నేటి వరకు అడ్డుపడుతూనే ఉన్నారని, ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి ఫిర్యాదులు, లేఖలు రాసి, కోర్టుల్లో కేసులు వేసి చంద్రబాబు అడుగడుగునా ఆటంకం సృష్టిస్తున్నారని అన్నారు. తెలంగాణను నిండా ముంచింది కాంగ్రెస్ నాయకులేనని మండిపడ్డారు. తెలంగాణ మొత్తం కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వడం కోసం మన కృషి చేస్తూ ఉంటే దీనికి అడ్డం పడాలని, మనలను గోల్ మాల్ చేయాలని చంద్రబాబు భుజం మీద గొడ్డలి పెట్టుకొని తిరుగుతున్నాడని అన్నారు. ఈ కుటిల యత్నాలకు తెలంగాణ ఓటర్లు ఓటు రూపంలో ధీటైన సమాధానం చెప్పాలని కోరారు.

తెలంగాణ దుర్మార్గుల పాలు కాకుండా రాష్ట్రం ముందుకే పోవాలని పిలుపునిచ్చారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ నాయకులేనని, హైదరాబాద్ స్టేట్ పేరు మీద ఉన్న తెలంగాణను 1956లో బూర్గుల రామకృష్ణారావు ముంచేశారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాటి బూర్గుల రామకృష్ణారావును తలపించేలా కూటమి పేరుతో తెలంగాణపై పెత్తనం సాగిస్తున్నారని అన్నారు. అధికారం లేకపోతే కాంగ్రెసోళ్లు బతకలేరని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు దద్దమ్మల్లా ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబు, రాహుల్ గాంధీ కలిసి చేతులు కలుపుకుంటుంటే కాంగ్రెస్ నాయకులు గొర్రెల్లా తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు.

టిఆర్‌ఎస్ వస్తే కాళేశ్వరం.. కూటమి వస్తే శనేశ్వరమే
కృష్ణా బేసిన్‌లో నీళ్లు లేవని కోదాడ సభలో బాబు అంటుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మౌనంగా ఉన్నారని, సమైక్య పాలనలో సాగునీటి కోసం పడిన గోస ఇప్పుడిప్పుడే సర్దుకుంటూ ఉంటే మళ్ళీ చంద్రబాబు రూపంలో ముంచుకొస్తోందని, దీనిపై యావత్తు తెలంగాణ సమాజం ఆలోచించాలని కోరారు. కెసిఆర్, టిఆర్‌ఎస్ గెలిస్తే తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు, కోటిఎకరాలకు నీళ్లు వస్తాయని, పొరపాటున కూట మి, చంద్రబాబు గెలిస్తే శనేశ్వరం తప్పదని ప్రజలను అప్రమత్తం చేశారు. కాళేశ్వరం కావాలో లేక శనేశ్వరం కావాలో తెలంగాణ ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. తెలంగాణ సమాజం తెలివితో ఆలోచించాలని సూచించారు. మన గడ్డ మీద నిల్చుని (కోదాడ)కృష్ణాలో నీళ్లు లేవు, గోదావరి నీళ్లు పంచుకుందామని అంటున్నడంటే చంద్రబాబుకు ఎంత ధైర్యం? ఆయన ఏం కోరుకుంటున్నడు? తెలంగాణ కాంగ్రెస్ దద్దమ్మలు ఎందుకు గొర్రెల్లాగ తలూపుతున్నరు అని ప్రశ్నించారు.

కీలుబొమ్మ ప్రభుత్వమే చంద్రబాబు లక్షం
తెలంగాణలో కీలుబొమ్మ ప్రభుత్వం ఉండాలనేదే చంద్రబాబు లక్ష్యమని కెసిఆర్ వ్యాఖ్యానించారు. “తెలంగాణలో అధికారం టిఆర్‌ఎస్ పార్టీకి ఉండొద్దు, కెసిఆర్‌కు అసలే ఉండొద్దు అని చంద్రబాబు అనుకుంటున్నాడు. కెసిఆర్ ఉంటే ఆయన మాటలు, ఆటలు సాగవని భయపడుతున్నడు. అక్రమంగా సంపాదించిన సొమ్ములు తీసుకోని ఆంధ్రా నాయకులను, ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌ను తీసుకొచ్చి ఇక్కడ మోహరించిండు. విర్రవీగుతున్నాడు. దానికి కాంగ్రెస్ నాయకులు భజన పాడుతున్నారు. కెసిఆర్‌ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ నేతలకు చేతనైత లేదు. అందుకే ఆంధ్రాకెళ్లి చంద్రబాబును భుజాల మీద మోసుకొచ్చిండు. సాగునీటి ప్రాజెక్టులకు అడ్డుపడుతూ కేంద్రానికి లేఖలు రాసిండు చంద్రబాబు. అధికారం పోయిందన్న కసి, దౌర్భాగ్యంతో కుట్రలు చేస్తున్నాడు.

అధికారం పోయిందనే కడుపుమంటతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కాంగ్రెస్ నాయకుల అసమర్థతను చంద్రబాబు ఉపయోగించుకుంటున్నాడు” అని కెసిఆర్ వ్యాఖ్యానించారు. మీరు అవకాశం నాకు ఇస్తే తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణను బానిస కానివ్వనని భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల్లో కొట్లాడిల్సింది ప్రజలేనని, ఓటుతో చంద్రబాబును, కూటమిని దెబ్బకొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు ఇప్పుడు రక్షణ కవచంగా నిలవాల్సిన బాధ్యత ప్రజలదేనని, వారి మద్దతు లేకపోతే తానేమీ చేయలేనని, ఆశీర్వదించి దీవిస్తే దేశమే నివ్వెరపోయే అభివృద్ధి, సంక్షేమం చేసుకుందామని కెసిఆర్ అన్నారు.

దుఃఖం లేని తెలంగాణ నా లక్షం
దుఃఖం లేని తెలంగాణను చూడడమే తన లక్ష్యమని కెసిఆర్ స్పష్టంచేశారు. కష్టపడి, అనేక పోరాటాలు చేసి తెలంగాణను తెచ్చుకున్నామని, 58 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎంతో క్షోభ అనుభవించామని, త్యాగాల పునాదుల మీద 2014లో తెలంగాణను సాధించుకున్నామని, నాలుగేళ్ళుగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలందరికీ కళ్ళముందు కనిపిస్తున్న వాస్తవమని కెసిఆర్ వివరించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కెసిఆర్ పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలనుకుంటున్నారని, దుఖం లేని తెలంగాణను కోరుకుంటున్నారని, ఆకుపచ్చ తెలంగాణను సాధించాలనుకుంటున్నారని, కోటి ఎకరాలకు నీరు పారించేందుకు యజ్ఞం చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఈ యజ్ఞం ఆగొదని, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా నిలిచి గెలవాలని ప్రజలను కోరారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడిప్పుడే మొగ్గ తొడిగుతోందని, తాను పెట్టిన మొక్కలు పూత పూసి కాయ కాసే దశలో ఉన్నాయని, ప్రతీ ఒక్కరూ ఆలోచించి ఓటేయాలని కోరారు.

చావు అంచుల వరకూ వెళ్ళి…
చావునోట్లో తలపెట్టి తెలంగాణను సాధించానని, కోమాలోకి పోతావని వైద్యులు చెప్పినా తాను వినలేదని కెసిఆర్ గుర్తుచేశారు. తన కఠంలో ప్రాణముండగా తెలంగాణను బానిస కానివ్వనని స్పష్టంచేశారు. తెలంగాణలో అధికారం పోయిందన్న కసితో కాంగ్రెస్ ఉంటే, తెలంగాణ రాష్ట్రం చేజారిపోయిందన్న బాధ చంద్రబాబులో కనిపిస్తోందని ఆరోపించారు. తెలంగాణను ఈ ఇనుప మూతి గద్దలకు ఇస్తే ప్రమాదం పొంచి ఉంటుందని, తెలంగాణకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత మేధావులపై ఉందన్నారు. తెలంగాణ వస్తే చీకటి అవుతుందని శాపనార్థాలు పెట్టారని, చిమ్మచీకటి అవుతుందన్న తెలంగాణను వెలుగులమయం చేశామని కెసిఆర్ పేర్కొన్నారు.

తలసరి విద్యుత్ వినియోగంలో ఇప్పుడు తెలంగాణ నెం.1లో ఉందని అన్నారు. “నేను బతికున్నంత వరకు రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తా. ప్రతీ ఏడాది రూ. 12 నుంచి రూ.16 వేల కోట్ల అదనపు ఆదాయం వస్తోంది. మైనింగ్‌లో అక్రమాలను అరికట్టాం. ఈ నాలుగేళ్లలో ఇసుకపై రూ.2,057 కోట్ల ఆదాయం వచ్చింది. అభివృద్ధిలో గుజరాత్ మన దరిదాపుల్లో కూడా లేదు. సంపద పెంచాలి. పేదలకు పంచాలన్నదే మా ధ్యేయం” అని కెసిఆర్ స్పష్టంచేశారు. తెలంగాణలో ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు కుట్రలు చేశారని, తెలంగాణ నుంచి పంపించారనే కసితో ఉన్నారన్నారు. అధికారం నుంచి దూరం చేశారని కాంగ్రెస్ నేతలకు కడుపు మంటగా ఉందన్నారు. ఈ రెండు కత్తులూ దూసుకొస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

పేదల కన్నీరు లేని తెలంగాణే నా స్వప్నం
“చాలా కష్టపడి అనేక పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. 58 ఏళ్ల సుదీర్ఘ పోరాటం మనది. త్యాగాల పునాదులపై వచ్చిన తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందాలి. దుఃఖం లేని తెలంగాణ చూడాలన్నదే నా లక్ష్యం. కష్టపడి సాధించుకున్న తెలంగాణను దెయ్యాలపాలు చేయొద్దు. మన ప్రాజెక్టులు నిండాలి, పంటలు పండాలనేది నా ఆశయం. పేదల కంట కన్నీరు రాని తెలంగాణ నా స్వప్నం. దుఖంలేని తెలంగాణ నా ఆశ. ఆకుపచ్చ తెలంగాణ నా లక్ష్యం. కోటి ఎకరాలకు సాగునీరు కచ్చితంగా పారేలా నేను యజ్ఞం చేస్తున్నా. ఇది కొనసాగాలి. ఈ యజ్ఞం, ఈ ప్రయాణం ఆగొద్దు. తెలంగాణ గెలిచి నిలవాలి. నవ్వేటోళ్ల ముందు జారిపడొద్దు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎన్నికల్లో ఓటు వేయాలి. రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించి ప్రజలకు 24గంటల విద్యుత్ అందిస్తున్నాం. దేశంలో విద్యుత్ తలసరి వినియోగంలో మనమే ముందున్నాం. రూ.42 వేల కోట్ల మేర ఖర్చుపెట్టి సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటున్నాం” అని కెసిఆర్ అన్నారు.

బెత్తెడు ఖాళీ స్థలం కూడా ఉండొద్దు
ఆకుపచ్చ తెలంగాణే లక్షంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ప్రజలు కూడా వారి వంతు సహకారం ఇవ్వాలని కెసిఆర్ కోరారు. మిషన్ కాకతీయతో చెరువులన్నింటినీ చక్కదిద్దుకున్నామని, హరితహారంతో కోట్లాది మొక్కలు నాటుతున్నామని, ఇది ఇకపై కూడా కొనసాగాలని కోరారు. వివిధ నియోజకవర్గాల్లో పాల్గొనేందుకు తాను హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నప్పుడు చెరువులన్నీ నిండుగా కనిపించాయని, ఇకపైన బెత్తెడు స్థలం కూడా ఖాళీగా లేకుండా ఆకుపచ్చగా కనిపించాలని, అప్పుడే అది హరిత తెలంగాణ అవుతుందన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చినప్పుడు అంగుళం కూడా ఖాళీగా లేకుండా పచ్చగా ఉంటుందని, ఆ దృశ్యాన్ని తాను చూడాలనుకుంటున్నానని అన్నారు.

అభ్యర్థులందరికీ ఓటు అడిగినా…
టిఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తున్న 118 మంది అభ్యర్థులకు ఓటు వేసి ఒక్కొక్కరికి లక్ష ఓట్ల మెజారిటీ ఇవ్వాలని అభ్యర్థించిన ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కెసిఆర్ తనకు మాత్రం ఓటు వేయాలని గజ్వేల్ ప్రజలను కోరలేకపోయారు. బుధవారం మధ్యాహ్నం జరిగిన సభలో కెసిఆర్ తరఫున పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో ఓటువేసి గెలిపించిన ఈ నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రిని చేశారని, ఈసారి కూడా అదే తీరులో దీవించాలని కోరారు. రాష్ట్రమంతటా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అధినేతగా కెసిఆర్ కోరుతూ ఉంటే, ఆయన తరఫున తాను కోరుతున్నానని, గజ్వేల్ ప్రజలు అపూర్వ మెజారిటీతో కెసిఆర్‌ను దీవించాలని, అద్భుతమైన అభివృద్ధికి నాంది పలకాలని కోరారు. ప్రసంగాన్ని ముగిస్తున్న సమయంలో కెసిఆర్ ఆ విషయాన్ని ప్రస్తావించి, అందరి తరఫున ఓటు అడిగిన తాను తన ఓటును మాత్రం అడగడం లేదని, అప్పటికే తన తరఫున కేశవరావు కోరారని గుర్తుచేశారు.

దొంగ సర్వేలకు గోల్‌మాల్ కావద్దు
రాష్ట్రంలో కొందరు విడుదల చేస్తున్న దొంగ సర్వేలను చూసి గోల్ మాల్ కావొద్దని కెసిఆర్ ప్రజలకు సూచించారు. ఇప్పటికే 118 నియోజకవర్గాలను చుట్టి వచ్చానని, 119వ నియోజకవర్గమైన గజ్వేల్‌లో టిఆర్‌ఎస్ 100 సీట్లకు పైనే గెలవబోతోందని అన్నారు. గజ్వేల్‌లో గెలిచిన పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తదని, గజ్వేల్‌లో కెసిఆర్ గెలుస్తడని మీరే (ప్రజలు) చెబుతున్నందున ఇక మన గవర్నమెంట్ ఖాయమైపోయిందని వ్యాఖ్యానించారు. గజ్వేల్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసుకున్నామని, ఇకపైన గజ్వేల్‌లో ఇల్లులేని కుటుంబం ఉండకూడదనేది లక్షమని, దాన్ని పరిపూర్తిచేసే బాధ్యత తనదని అన్నారు. ప్రతి ఇంటికీ సబ్సిడీ మీద పాడి గేదేలు ఇచ్చుకుందామని, ఈ నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు నీళ్లు పారించే బాధ్యత తనదని, కూరగాయలు ఎక్కువగా పండిస్తాం కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెట్టుకుందామన్నారు. గజ్వేల్‌కు చాలా పరిశ్రమలు రాబోతున్నాయని, కాలుష్య రహిత పరిశ్రమలను తీసుకువస్తామని, మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించుకుందామన్నారు. వలస శక్తులకు చోటు ఇవ్వొద్దని, చంద్రబాబుకు అధికారం ఇవ్వొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Development of Telangana in four years

Telangana Latest News