Home ఎడిటోరియల్ వృద్ధి రేటును దెబ్బ తీసిన నోట్ల రద్దు

వృద్ధి రేటును దెబ్బ తీసిన నోట్ల రద్దు

GDP-Cartoon2016-17 ఆఖరి త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.) రేటు 7 శాతం ఉందని ఏడాది సగటు స్థూల జాతీయోత్పత్తి రేటు. 7.1 శాతం ఉందని కేంద్ర గణాంక కార్యాలయం (సి.ఎస్.ఓ.) 2017 ఫిబ్రవరిలో వెల్లడించింది. ఆ సందర్భంగా పెద్ద నోట్ల రద్దును విమర్శించిన వారిని ‘హార్వర్డ్ నుంచి వచ్చిన వారు‘ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. పెద్ద నోట్ల రద్దువల్ల జి.డి.పి. రెండు శాతం తగ్గే అవకాశం ఉందని మాజీ ప్రధానమంత్రి, ప్రసిద్ధ ఆర్థికశాస్త వేత్త మన్మోహన్ సింఘ్ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యాలను, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల అసంఘటిత రంగం మీద ప్రతికూల ప్రభావం పడుతుందని నోబెల్ బహుమతి గ్రహీత, ఆర్థిక శాస్త్ర నిపుణుడు అమర్త్య సేన్ చేసిన విమర్శను అనేక బహిరంగ సభలలో మోదీ ఎగతాళి చేశారు. ‘వారి అసత్యాల బండారం బయటపడింది‘ అని మోదీ అప్పుడు దుయ్యబట్టారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం మూడవ త్రైమాసిక ఫలితాల మీద ఎంత ఉందో ఇంకా తెలియలేదు అని ప్రభుత్వ గణాంక నిపుణులు చెప్పినా మోదీ ఈ విమర్శలు ఎక్కుపెట్టారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలోని మూడవ, నాల్గవ త్రైమాసికాలలో ఆర్థికాభివృద్ధి తగ్గిందని మే 31వ తేదీన సి.ఎస్.ఓ. తెలియజేసింది. ఈ వాస్తవాలు పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉందని రుజువు చేయడమే కాక మోదీ ‘అసత్యాలను‘ కూడా బయట పెట్టాయి.
2015-16 మూడవ త్రైమాసికంలో 6.7 శాతం ఉన్న వృద్ధి రేటుతో పోలిస్తే 2016-17 మూడవ త్రైమాసిక కాలంలో వృద్ధి రేటు 0.6 శాతం దిగజారింది. నాల్గవ త్రైమాసికంలో అయితే 8.7 శాతం ఉన్న వృద్ధి రేటు ఏకంగా 3.1 శాతం తగ్గి 5.6 శాతానికే పరిమితం అయింది. ఆర్థిక వ్యవస్థ 5.3 శాతం రేటుతో ఉన్న 2013-14 తో పోలిస్తే నాల్గవ త్రైమాసికంలో ఈ తగ్గుదల చాలా ఆందోళనకరమైందే. నిజానికి ఈ 5.3 శాతం వృద్ధి రేటు అన్నది సవరించిన అంచనా కాదు. 2013-14 లో పారిశ్రామిక ఉత్పత్తి, ఠోకు ధరల సూచీని దృష్టిలో ఉంచుకుని చూస్తే వృద్ధి రేటు కచ్చితంగా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే కొత్త పద్ధతిలో వృద్ధి రేటును అంచనా వేయడం ఆరేళ్ల కింద 2011-12 లో మొదలైంది. ఆర్థిక సంవత్సరాలను బట్టి స్థూల విలువ చేర్చిన వృద్ధి రేటు గమనించినా 6.6 శాతం వృద్ధి రేటు 1.3 శాతం తగ్గింది. 2012-13 తర్వాత ఇంత తక్కువ వృద్ధి రేటు ఎన్నడూ నమోదు కాలేదు. తాజా సంవత్సరానికి జి.డి.పి. వృద్ధి రేటు 7.1 శాతం ఉంది. ఇది ఎక్కువ ఉండడానికి కారణం ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 12.8 శాతం పెరుగుదల నమోదైంది. పాత జాతీయాదాయ సూత్రం ప్రకారం లెక్క కడితే ఇంత వృద్ధి రేటు ఉండదు.
సి.ఎస్.ఓ. విడుదల చేసిన గణాంకాలను బట్టి సమకూరిన స్థూల నికర పెట్టుబడి ప్రకారం నికర పెట్టుబడులు తగ్గాయి. 2016-17లో సమకూరిన స్థూల నికర పెట్టుబడి జి.డి.పి. శాతంతో పోలిస్తే అంతకు ముందు సంవత్సరం 30.9 శాతం ఉన్నది 29.5 శాతానికి పడిపోయింది. నాల్గవ త్రైమాసికంలో సమకూరిన స్థూల నికర పెట్టుబడి అంతకు ముందు సంవత్సరంలో 28.5 శాతం ఉంటే అది 25.5 శాతానికి తగ్గింది. సమకూరిన స్థూల నికర పెట్టుబడి తగ్గడం అంటే ఉత్పత్తి, ఉపాధి, మధ్యకాలికంగా ఆదాయాలు తగ్గడమే.
వ్యవసాయం, ప్రజా పరిపాలనలో తప్ప అన్ని పారిశ్రామిక విభాగాలలో నాల్గవ త్రైమాసికంలో వృద్ధి రేటు గణనీయంగా తగ్గింది. ఈ రెండు రంగాలను మినహాయిస్తే మిగతా ఆరు రంగాలలో సగటు వృద్ధి రేటు 3.8 శాతం మాత్రమే నమోదైంది. 2015-16 లో అదే త్రైమాసికంలో ఈ వృద్ధి రేటు 10.7 శాతం ఉండేది. ఏ యేటికి ఆయేడు తగ్గుదలను లెక్క వేస్తే దాదాపు 7 శాతం తగ్గింది. నికరంగా చెప్పాలంటే స్థూల జాతీయోత్పత్తి రూ. 1, 35,600 కోట్ల మేర తగ్గింది. ఈ తగ్గుదల నిర్మాణ రంగంలో తీవ్రంగా ఉంది. ఈ రంగంలో వృద్ధి రేటు 3.7 శాతం తగ్గింది. ఇది 2015-16 నాల్గవ త్రైమాసికంలో 6 శాతం ఉండేది. ఈ రంగంలోనే అవ్యవస్థీకృతం రంగ కార్మికులు ఎక్కువగా పని చేస్తారు. వస్తూత్పత్తి, వాణిజ్యం, హోటళ్లు, రవాణా, ఆర్థిక, స్థిరాస్తి, వృత్తిపరమైన సేవలు మొదలైన రంగాలలో కూడా వృద్ధి రేటు మందగించింది. ఈ సకల రంగాలలోనూ అవ్యవస్థీకృత కార్మికులు ఎక్కువే. ఈ రంగాలు వారికి ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి.
గత రెండు త్రైమాసికాల నుంచి వృద్ధి రేటు తగ్గడం పెద్ద నోట్ల రద్దు వల్ల తాత్కాలిక ప్రభావం కావచ్చునని మధ్యకాలికంగా ఈ ప్రభావం ఉండదని వాదించవచ్చు. భారత ఆర్థిక వ్యవస్థ చాలా వరకు లాంఛనప్రాయమైంది కానందువల్ల సి.ఎస్.ఓ. అనుసరించే అంచనాల ప్రక్రియ, జి.డి.పి. వృద్ధి రేటును కొలవడానికి అనుసరించే పద్ధతిలో తేడాలు ఉండవచ్చు. అవ్యవస్థీకృత రంగంలో సమకూరిన స్థూల నికర పెట్టుబడిలో అవ్యవస్థీకృత రంగంలో వస్తూత్పత్తి, సేవా రంగాల పాత్ర అంచనా వేయడానికి 2011-12లో కార్మికుల పాత్ర చేర్చారు. సమకూరిన స్థూల నికర పెట్టుబడిని అంచనా వేయడానికి కొన్ని సూచికలను చేర్చారు. కార్మికుల పాత్ర ను అంచనా వేయాలంటే దాని మోతాదు ఎంతో తేలాలి.
ఒక్కో కార్మికుడు చేర్చిన విలువ ఎంతో లెక్క కట్టాలి. ఈ సమాచారం ఆధారంగా తీసుకునే సంవత్సరానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాతి సంవత్సరాల సమాచారం తెలుసుకునే అవకాశమే లేదు. అందువల్ల పెద్ద నోట్ల రద్దు ప్రభావం అవ్యవస్థీకృత రంగంలో ఉద్యోగాలపై ఎంత ఉందో, లేదా ఆ రంగాలలో కార్మికుల, సంస్థల ఆదాయం ఎంతో, స్థూల ఆర్థిక స్థాయిలో టోకు ధరల సూచిలో స్థూల సూచికలు తెలిస్తేనే సమకూరిన స్థూల నికర పెట్టుబడి ఎంతో అంచనా వేయొచ్చు. అయితే క్షేత్ర స్థాయిలో అవ్యవస్థీకృత రంగం కుదేలైనట్టు, ఉపాధి అవకాశాలు, ఆదాయాలు తగ్గినట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయి. స్వయం ఉపాధి కల్పించుకున్న వారి, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఆదాయాలు కూడా తగ్గాయి.
2011-12 అంచనాల ప్రకారం 48 కోట్ల 40 లక్షల కార్మికులు ఉన్నారనుకుంటే అందులో వ్యవస్థీకృత రంగంలో ఉన్న వారు కేవలం మూడు కోట్ల మందే. అంటే 93 శాతం అవ్యవస్థీకృత తంగంలోనె పని చేస్తున్నారు. ఆ రకంగా తగ్గిన వినియోగం, అవ్యవస్థీకృత రంగంలో పని చేసే వారి, పరిశ్రమల పొదుపు మొత్తాలు తగ్గడం వల్ల కచ్చితంగా మధ్యకాలిక పరిణామాలు ఉంటాయి. పెద్ద నోట్ల రద్దు వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు విపరీతమైన నష్టం కలిగింది. ఆ రంగాల మీద ఆధారపడ్డ వారి మీద కూడా ఈ ప్రభావం ఉంది. అభివృద్ధికి సంబంధించిన మోదీ ప్రభుత్వ లెక్కలు, నినాదాలు బూటకమని తేలుతోంది.

(ఇ.పి.డబ్ల్యు. 2017 జూన్ 3 సంచిక సౌజన్యంతో)