Home హైదరాబాద్ విష వాయువులతో ఉక్కిరి బిక్కిరి

విష వాయువులతో ఉక్కిరి బిక్కిరి

Devender nagar colony in pollution cases

కాలుష్య కోరల్లో దేవేందర్‌నగర్ కాలనీ
ఘాటైన వాయువులు పీల్చి రోగాల పాలవుతున్న కాలనీవాసులు
రసాయన వ్యర్థ్ధాలతో భూగర్భ జలాలు విషతుల్యం
చూసీచూడనట్లు వ్యవహరిస్తోన్న కాలుష్య నియంత్రణ మండలి

మన తెలంగాణ/సిటీబ్యూరో: పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం రామంతాపూర్ దేవేందర్‌నగర్ కాలనీవాసులను ఉక్కిరిబిక్కిరి చే స్తోంది. చుట్టు పక్కల ఉన్న పరిశ్రమల నుంచి విడుదలవుతున్న జల, వాయు కాలుష్యంతో ఇక్కడి ప్రజ లు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఘా టైన వాయువులను పీల్చి ఇక్కడి ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. పరిశ్రమల నుంచి వస్తున్న రసాయన వ్యర్థాలతో భూగర్భ జలాలు ప్రమాదకర స్థ్ధాయిలో కలుషితమవుతున్నాయి. దేవేందర్‌నగర్ కాలనీ ఫేస్-1,2,3 కలిపి దాదాపు 8 వందల కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కాలనీని అనుకుని కెమికల్, ఫార్మా, గ్యాస్, పాల ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి. అలాగే కాలనీ పక్కనే జీహెచ్‌ఎంసీకి సంబంధించిన చెత్త డంపింగ్‌యార్డ్ ఉంది.

ఈ పరిశ్రమల నుంచి రాత్రి వేళల్లో ఘాటైన వాసనలతో కూడిన పొగలు విడుదల చేస్తున్నారు. ఈ వాయువులతో కాలనీప్రజలు నానా అవస్ధలు పడుతున్నారు. ఈ ఘాటైన వాయువులతో కాలనీలో విషజ్వరాలు ప్రభలుతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు తలనొప్పి, వాంతులు,విరోచనాలతో బాధపడుతున్నారు. పలువురు చర్మవ్యాధులు, జట్టుఊడిపోవడం, కాళ్లవాపులు తదితర రుగ్మతల బారినపడుతున్నారు. అదే విధంగా పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలతో భూగర్భజలాలు విషతుల్యమవుతున్నాయి. పారిశ్రామిక రసాయన వ్యర్ధాలు కారణంగా ఇక్కడి బోర్లలో నలుపు, పచ్చ రంగుతో నీళ్లు వస్తున్నాయి. ఈ నీటిని ప్రజలు కనీసఅవసరాలకు వాడుకోలేని పరిస్ధితి నెలకుంది. ఈ పరిశ్రమల వెదజల్లే కాలుష్యంతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు.

పరిశ్రమలకు అనుమతులు ఇచ్చిన అధికారులు మాత్రం చేతులు దులుపేసుకుంటున్నారు. కనీసం నిఘా లేకపోవడంతో పరిశ్రమ యజమాన్యాలు ఆడింది ఆటగా పాడిందే పాటగా కొనసాగుతుంది. అయితే పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో ప్రజలు సతమతమవుతున్న తరుణంలో జీహెచ్‌ంఎసీ ఆధ్వర్యంలో కాలనీని అనుకుని చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడి ప్రజల కష్టాలు మరింతగా పెరిగిపోయాయి. డింపింగ్‌యార్డ్‌లోని చెత్తచెదారం, వ్యర్ధాల నుంచి వెలువడుతున్న ముక్కపుటలదిరే దుర్వాసలతో ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత వర్షకాలం పరిస్ధితి దారుణంగా ఉంది. వర్షంపడినప్పుడు చెత్త తడిసిపోయి మరింత దుర్వాసన వెదజెల్లుతూ దోమలు విజృభిస్తున్నాయి. కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలను ఇక్కడి నుంచి తరలించాలని, ఆయా యజమాన్యలపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లిన ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా సంబంధిత శాఖ తగిన చర్యలు తీసుకుని రసాయన పరిశ్రమలను ఇక్కడి నుంచి తరలించి కాలుష్యం బారినుంచి తమను రక్షించాలని జహంగీర్‌బీ, జీనత్‌బేగం, దేవరకొండ కిశోర్, కృష్ణమూర్తి, చంద్రకళ, యాదగిరి కాలనీవాసులు కోరుతున్నారు.

వాయు, జల కాలుష్యంతో రోగాల పాలవుతున్నాం (-కిశోర్, దేవేందర్‌నగర్‌కాలనీ ఫేస్-2 , అధ్యక్షుడు)
పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పడరాని పాట్లు పడుతున్నాం. వాయు, జల కాలుష్యంతో రోగాల పాలవుతున్నాం. కాలుష్యం వలన విషజ్వరాలు ప్రబలుతున్నాయి. పిల్లలు తలనొప్పి, వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. రసాయన వ్యర్థాల కారణంగా ఇక్కడి బోర్లలో నలుపు రంగుతో నీళ్లు వస్తున్నాయి. ఈ విషయమై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లిన పట్టించుకోవడంలేదు.

కాలుష్య పరిశ్రమలను తరలించండి (జీనత్‌బేగం, దేవేందర్‌నగర్‌కాలనీ ఫేస్-2 ప్రధాన కార్యదర్శి.)
రసాయన పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం కాలనీవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఘాటైన వాయువుల కారణంగా ఇళ్లలో ఉండలేకపోతున్నాం. జల, వాయు కాలుష్యంతో రోగాలు పట్టి పీడిస్తున్నాయి. చిన్న పిల్లల పరిస్ధితి మరి దారుణంగా ఉంది. ఇక్కడున్న పరిశ్రమలతో భూ గర్భజలాలు కలుషితమవుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి పరిశ్రమల యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి, రసాయన పరిశ్రమలను ఇక్కడి నుంచి తరలించాలి.

-ఫిర్యాదులు అందాయి (-వెంకన్న, ఈఈ ,తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రంగారెడ్డి జిల్లా-)
కాలుష్యానికి సంబంధించి దేవేందర్‌నగర్ కాలనీవాసుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు దేవేందర్‌నగర్‌కాలనీ సందర్శించి అక్కడి పరిస్ధితులపై ఆరా తీశాం. పరిశ్రమల నుంచి ఎలాంటి కాలుష్యం వెలువడం లేదు. కాలనీ పక్కనే ఉన్న జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డ్ కారణంగా దుర్వాసన వెలువడుతున్నాయి. వర్షకాలం సమస్య మరింత తీవ్రమైంది. చెత్త నుంచి వెలువడుతున్న దుర్వాసన వలన అక్కడి ప్రజలు ఆనారోగ్యానికి గురవుతున్నారు. ఈ విషయపై జీహెచ్‌ఎంసీ అధికారులతో చర్చించాం.