Home కలం తెలుగు వినబడాలి, కనబడాలి

తెలుగు వినబడాలి, కనబడాలి

Devulapalliదేవులపల్లి ప్రభాకరరావు జగమెరిగిన పాత్రికేయులు. బహుగ్రంథకర్త. ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి పట్టభద్రుడు. గతంలో వీరు రాష్ట్ర ప్రభుత్వ సమాచార – పౌర సంబంధ శాఖలో, రాష్ట్ర ప్రభుత్వ కుటుంబ సంక్షేమ శాఖ మాస్ మీడియా విభాగంలో సంపాదకులు. ఈనాడు, ఆంధ్రభూమి, వార్త, ప్రజాతంత్ర తదితర పత్రికలలో అనేక సంవత్సరాలు, కాలమిస్టు, రచయిత. వీరు రాసిన ‘మహాకవి గురజాడ జీవితం- సాహిత్యం’ గ్రంథానికి యునెస్కో అవార్డు, జాతీయ సమైక్యతపై ‘నేను ఎవరు’ అనే పుస్తకానికి భారత ప్రభుత్వ అవార్డు, ‘అల్లూరి సీతారామ రాజు’ రేడియో నాటికకు జాతీయ అవార్డులను అందుకున్నారు. గాంధీ శకం, మన మహనీయు లు, చెప్పుకోదగ్గ మనుషులు, తెలంగాణ తేజోమూర్తులు, సమరం నుంచి స్వాతంత్య్రానికి, మహాకవి గురజాడ, సంపాదకీయాల సంకలనం, శ్రీకృష్ణ దేవరాయాంధ్రభాషానిలయం(నూటాపది సంవత్సరాల చైతన్య చరిత్ర), వ్యాసాలు, జ్ఞాపకాలు, పారిజాతాలు (కవితా సంకలనం) వీరి కలం నుండి వెలువడ్డాయి. గోలకొండ, విశాలాంధ్ర పత్రికలలో పలు రచనలు, కొన్ని ప్రత్యేక సంచికలకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. అనువాదాలు, ఉద్యమ రచనలనెన్నింటినో చేశారు. ‘పెన్షనర్ మూవ్‌మెంట్’ మాస పత్రికకు సంపాదక వర్గ సభ్యులుగా ఉన్నారు.
వీరి సాహితీ కృషికి మెచ్చి 2009లో పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కారం, 2012లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహిత్య పురస్కారాలనందించాయి. నిగర్వి, నిజాయితీ, నిరాడంబరత, వీరికి ముప్పేటగా అబ్బిన లక్షణాలు. తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన తర్వాత తొట్టతొలి అధికార భాషా సంఘం అధ్యక్షుల పదవి వీరిని వరించింది. మొదలు ఏప్రిల్ 2016లో నియామకమై, మరో రెండు సంవత్సరాలవరకు వీరి పదవిని కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సందర్భంగా మన తెలంగాణ ‘కలం’ పేజీ వీరిని ఆత్మీయంగా పలకరించింది. 

మన తెలంగాణ:- పాత్రికేయ వృత్తి నుండి వచ్చిన మీరు అధికార భాషా సంఘం మొదటి అధ్యక్షులుగా, మరో రెండేళ్లు పదవిలో కొనసాగ నున్నారు. అందుకు శుభాక్షాంక్షలు సార్.
దేవులపల్లి ప్రభాకరరావు:- ధన్యవాదా లండీ!
మ.తె:- గడిచిన సంవత్సర కాలంలో మీ పదవిలో మీరు సాధించిందేమిటి?
దే.ప్ర.రావు:- మీరు చూస్తూనే ఉన్నారుగా. రాష్ట్రంలో జిల్లాల స్వరూపాలు మారాయి. ప్రభు త్వ యంత్రాంగం బదిలీలు జరిగాయి. కొత్త కొత్త కార్యాలయాలు వచ్చాయి. కలెక్టర్లు వచ్చారు. ఇప్పుడిప్పుడే పాలనా యంత్రాంగం కుదుట పడు తున్నది. ఈ సమయంలో మేం వారిని తగు విధం గా సూచించలేకపోయాం. అయినా వ్యక్తి గతంగా నేను రాష్ట్రంలో అనేకచోట్ల అరవై దాకా సమావేశా ల్లో పాల్గొని తెలుగు అమలుకై మాట్లాడాను.
మ.తె.:- మీ దృష్టిలో తెలంగాణ రాష్ట్ర పాలనలో ఏయే స్థాయుల్లో తెలుగు భాష అమల వుతున్నది?
దే.ప్ర.రావు:- గ్రామ పంచాయితీ నుండి జిల్లా స్థాయి వరకు చాలా చోట్ల వివిధ కార్యాల యాల్లో తెలుగు భాష అమలవుతున్నది.
మ.తె:- రాష్ట్ర సచివాలయ స్థాయిలో తెలుగు ఎందుకు వెనుకబడుతున్నది?
దే.ప్ర.రావు:- సచివాలయ స్థాయిలో ప్రభు త్వ ఉత్తర్వులు ఆంగ్లంలోనే వస్తున్నవి. ఇంకా అధి కార యంత్రాంగానికి జి.ఒ.ల తయారీకి సరైన తెలుగు భాషా పదాలు అలవాటు కాలేదు. నిజాం రాష్ట్రంలో ఉర్దూ అధికార భాషగా ఉండేది. ఫర్మా నాలన్నీ ఉర్దూలోనే వచ్చేవి. నేటి తెలుగులో పరి పాలన పారిభాషిక పదకోశం వివిధ ప్రభుత్వ శాఖల కోసం తయారు చేస్తున్నాం. ఆ ప్రయత్నం లోనే ఉన్నాం.
మ.తె.:- న్యాయ వ్యవస్థలో తెలుగు వాడకం పై మీ అభిప్రాయం?
దే.ప్ర.రావు:- న్యాయ వవస్థలో కూడా కింది కోర్టుల్లో చాలా చోట్ల తెలుగు భాష అమల వుతున్నది. హైకోర్టు స్థాయిలో మాత్రం అది జరగడం లేదు. కారణం చట్టాలు తెలుగులో లేకపోవడమే.
మ.తె.:- అందుకు మీ ప్రయత్నాలేమైనా జరుగుతున్నాయా?
దే.ప్ర.రావు:- చట్టాలన్నీ తెలుగు చేయడానికి అనువాద శాఖ ఒకటుంది. దాని పని అది చేస్తుం ది. ఆ కారక్రమం మొదలు పూర్తి కావాలి.
మ.తె.:- రాష్ట్ర చట్ట సభల్లో తెలుగు అమల వుతున్నది. అందుకు మీరెలాస్పంది స్తున్నారు?
దే.ప్ర.రావు:– తెలుగు రాష్ట్రాల్లో రెండింటా ఆ వేదికలపై తెలుగు మాట్లాడుతున్నారు. అందుకు నాతోపాటు సామాన్య జనానీకం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నది. ఎందుకంటే మన సమస్యల్ని మన ప్రజా ప్రతినిధులు ఎలా మాట్లాడుతు న్నారనేది అందరికీ తెలుస్తున్నది. మంచిదేగదా!
మ.తె:- ప్రభుత్వం బోధనా భాషగా తెలుగు కు తగిన ప్రాధాన్యతఇవ్వక, ఇంగ్లీషును ఎక్కువగా ఆదరిస్తున్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల రాబోయే తరాలకు తెలుగు మృగ్యమయ్యే దశ వస్తుంది కదా!
దే.ప్ర.రావు:- అది నిజమే. కానీ జనంలో ఇంగ్లీషు నేర్చుకుంటేనే దేశ విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయనే అభిప్రాయం ఉంది కదా! ప్రజాభీష్టం మేరకు పాలకులు వైఖరి మార్చుకోవలసి వస్తుంది. అది ప్రభుత్వ పాలసీ. బోధనా భాషగా తెలుగు ఉంటేమట్టుకు భాషాభివృద్ధి చక్కగా జరుగుతుంది.
మ.తె.:- తెలుగు భాష అమలుకు మీకు సరిపడా యంత్రాంగం, ఆర్థిక వనరులు వగైరా వసతులున్నాయా?
దే.ప్ర.రావు:- ఒక్కటి మాత్రం నిజం. గౌరవ ముఖ్యమంత్రిగారు తెలుగు భాషాభిమాని. వారికి ప్రభుత్వంలోని అన్ని స్థాయుల్లోనూ తెలుగు అమలు పటిష్టంగా అమలు పరచాలనే దృఢ నిశ్చ యంతో ఉన్నారు. త్వరలోనే రాష్ట్ర స్థాయి కమిటీని వేస్తారు. ఇందులో ఒక మైనారిటీ సభ్యు డితో సహా నలుగురు సభ్యులుంటారు. అలాగే జిల్లా స్థాయిలోనూ కమిటీలుంటాయి. తప్ప కుండా అన్ని జిల్లాల్లో పర్యటిస్తాం. అంతటా తెలుగు కనబడటానికీ, వినబడటానికీ ప్రయత్ని స్తాం. మాకు ముఖ్యమంత్రిగారి ప్రోత్సాహం బాగా వుంది. గతంలో జరిగిన ప్రయత్నాల కన్నా ఎక్కువగా తెలుగు భాష అమలుకు గట్టిగానే కృషి చేస్తాం, చూడండి.
మ.తె.:- ముఖ్యంగా తెలంగాణలో ఉర్దూ పదజాలం, రెవెన్యూ లాంటి శాఖల్లో ఉదా॥ గిర్దావరు, పహాణీ వంటివి, అట్లాగే వివిధ సంద ర్భాల్లోనూ ఇంగ్లీషు మాటలు తెలుగులో చొరబడి పోయాయి. వాటినెట్లా పరిష్కరిస్తారు.
దే.రా.రావు:- దానిదేముందండీ! ప్రస్తుత పత్రికా భాషనే ప్రమాణంగా తీసుకుంటాం. మన ముఖ్యమంత్రి గారు అనర్ఘలంగా ప్రజల వాడుక భాషను మాట్లాడుతున్నారు. అన్ని శాఖల సమీక్షా సమావేశాల్లోనూ తెలుగులోనే సంభాషిస్తారు. ఆక్సుఫర్డ్ డిక్షనరీలో ప్రతి సంవత్సరం వివిధ భాషల పదాలను చేర్చుకొని భాషా పరిపుష్టం కావించుకుంటున్నారు కదా! కొన్ని ఇతర భాషల పదాలను మనం స్వీకరించకతప్పదు. ప్రజలకు అసౌకర్యం కలుగనంత వరకు ఆ పద్ధతినే అనుసరిద్దాం.
మ.తె. :- ప్రస్తుతం మీరు మీ ప్రస్థానంలో ఏ కార్యక్రమానికి ప్రాధాన్యత నిస్తున్నారు?
దే.ప్ర.రావు:- ప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించిన పదకోశాలు, గ్లాసరీలను సిద్ధపరు స్తున్నాం. తెలంగాణ వాడుక భాషకు ప్రాధాన్యత నిస్తున్నాం. ప్రజలకు చేరువయ్యేటట్లు భాషను కొంత ఆధునికీకరణ చేస్తున్నాం.
మ.తె.:- అధికార భాషా సంఘం పక్షాన ఏదైనా ‘పత్రిక’ తెచ్చే ఆలోచన ఉందా?
దే.ప్ర.రావు:- మంచి సూచనే. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మాస పత్రికనైనా తెచ్చే ప్రయత్నం చేస్తా. దాన్ని వివిధ ప్రభుత్వ శాఖలకు పంపించి తెలుగు అమలుకై ఎప్పటికప్పుడు సూచనలిస్తాం.