Home ఎడిటోరియల్ అమిత్ షా ఉద్దేశం నెరవేరిందా?

అమిత్ షా ఉద్దేశం నెరవేరిందా?

amith-shah

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గతంలోనూ తెలంగాణకు వచ్చారు. అప్పటికి, ఈనెల 22నుంచి మూడు రోజుల పాటు జరిపిన పర్యటనకు తేడా స్పష్టంగా కన్పిస్తున్నది. ఉద్దేశం అప్పుడూ ఇప్పుడూ ఒకటే. అది తెలంగాణలో పార్టీని బలోపేతం చేయటం. మరి తేడా ఏమిటి? ఇంతటి పట్టుదల ఆయన లోగడ చూపించలేదు. పర్యటన శైలి కూడా గతంకన్నా భిన్నంగా ఉంది. ఈ రెండు విషయాలు స్వయంగా తెలంగాణ బిజెపి నాయకులకు, ఇతరులకు కూడా అర్థమైనట్లు కనిపిస్తున్నది. ఇక ఉద్దేశం విషయానికి వస్తే, పార్టీని బలోపేతం చేయటం అనే మాటకు రెండు అర్థాలున్నాయి. ఇపుడున్న స్థాయికన్న గణనీయంగా పెరిగి, అధికార పక్షమైన టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా రెండవ స్థానా నికి ఎదగటమన్నది మొదటి అర్థం. 2019లోనే టిఆర్‌ఎస్‌కు బదులు మెజారిటీ పార్టీ కావటం రెండవ అర్థం. ఈ క్రమంలో, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ను వెనుకకు తోయటం.
తెలంగాణలో వాస్తవ పరిస్థితులు ఏమిటి? వాటిమధ్య తమ లక్షాలు నెరవేరే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? అనే ప్రశ్నలపై అమిత్ షా కు, బిజెపి రాష్ట్ర శాఖకు ఆశాభావాలు ఎట్లున్నా స్థూలమైన అంచనాలు ఉండే ఉంటాయి. కనుక, పార్టీ అధ్యక్షుని పర్యటనను ఆ నేపథ్యంలో చూడవలసి ఉంటుంది. అట్లా చూసినపుడు, ఆయన పర్యటనా శైలి, చేసిన ప్రసంగా లు, వ్యాఖ్యలూ, రానున్న రెండు సంవత్సరాలపాటు వారు తమ లక్ష సాధనకు గట్టి ప్రయత్నాలు చేయనున్నట్లు సూచిస్తున్నాయి. గత మూడేళ్లు గా అమిత్‌షా అపుడపుడు ఒకటి రెండు రోజుల పాటు వచ్చి ఇక్కడి తమ నాయకులకు కొన్ని సూచనలు చేయటం, లేదా వారిని ఢిల్లీలో కలవటం వంటివి చేస్తూ వచ్చారు. కాని స్థానిక నాయకులు మునపటివలెగాక హైదరాబాద్ బయట ప్రజలమధ్య పర్యటించాలని, సభ్యత్వం జోరుగా సాగాలని, బూత్ కమిటీలు వేయాలని, ప్రజల సమస్యలపై గట్టిగా ఉద్యమించాలని, గ్రూపు రాజకీయాలు మానుకోవాలని తను చెప్పిన మాటల ప్రభావం ఏమీ కన్పించలేదు.
కనుక ఈ పద్ధతి మారాలని పార్టీ జాతీయ నాయకత్వం ఇపుడు గట్టిగా నిర్ణయించుకున్నట్లు తోస్తున్నది. ఉత్తరాది పార్టీ దక్షిణాదికి వ్యాపించటం ఇంతవరకు అధీనంలోకి రాని రాష్ట్రాలలో బలసంపాదన, అందుకు అన్నింటికన్న తెలంగాణ అనుకూలమనే భావన, 2019లో ఉత్తరాదిన బలం కొంత తగ్గినా దానిని దక్షిణాదిన పూడ్చుకోవాలను కోవటం, అన్నీ కలసి వస్తే ఈసారి స్వంత ఆధిక్యతను మరింత పెంచు కుని స్థిరపడటం వంటి ఆలోచనలు ఇందుకు ప్రేరేపణ అవుతున్నాయను కోవాలి. ఈ తరహా ఆలోచనలు 2014 ఎన్నికల ఫలితాల నుంచి ఉన్నా, ఇటీవల ఉత్తరప్రదేశ్ అనూహ్య విజయం, కేరళలో ఓట్ల శాతం పెరుగుదల ఇందుకు కొత్త ఊపు నిచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిగత ప్రతిష్ట మధ్యలో కొంతకాలం మందగించగా, ఇపుడు తిరిగి ఎదురు లేకుండా ఉందనే నమ్మకం జాతీయ నాయకత్వానికి ఏర్పడింది. పోతే, 2019 ఎన్నికలకు సమయం వేగంగా సమీపిస్తున్నది. ఇటువంటి పరిస్థితులన్నింటి దృష్టా ఇక, తాము లక్షంగా పెట్టుకున్న ఇతర రాష్ట్రాల తోపాటు తెలంగాణలో పనివేగాన్ని పెంచాలని వారు నిర్ణయించుకున్నట్లు భావించాలి. ఈ వివిధ రాష్ట్రాలలో తన పర్యటనల కాలాన్ని పెంచు తున్నట్లు అమిత్‌షా ప్రకటించారు కూడా.
ఇక్కడ ఆయన మూడు రోజుల పర్యటనను ఈ నేపథ్యంలో చూడాలి. తెలంగాణలో బిజెపి పరిస్థితి యథాతథంగా ఏమిటో తెలిసిందే. జిల్లాలలో వారు గణనీయంగా క్షీణించారు. హైదరాబాద్‌లో ఉన్న బలం ఎంత మాత్రం చలనం లేనిది కాదని జిహెచ్‌ఎంసి ఎన్నికలలో అర్థమైంది. రాష్ట్ర శాఖ నాయకుల శక్తిసామర్థాలపై వారి కార్యకర్తలకే నమ్మకం లేదు. మతంతో ముడిపడిన అంశాలపై ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిం చటం మినహా ఇతర అంశాలేవీ వారికి కన్పించటం లేదు. ఇతర ప్రతిపక్షాలు లేవనెత్తే వాటినే తాము కూడా లాంఛనప్రాయంగా ముందుకు తెస్తున్నారు. పైగా వారికి స్వంత ఆలోచనలతో కూడిన ఊహాశక్తి, కష్టపడి ఐకమత్యంతో పనిచేయటం, ప్రజలవద్దకు నేరుగా వెళ్లటం అనే మూడు కీలకమైన లక్షణాలు లేకుండా పోయాయి. మరొకవైపు అధికార పక్షమైన టిఆర్‌ఎస్ చాలా బలంగా కన్పిస్తున్నది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఇటీవలి వారాల్లో హడావుడి చాలా చేస్తున్నది. వచ్చే ఎన్నికలలోనూ పోటీ ప్రధానంగా టిఆర్‌ఎస్-కాంగ్రెస్‌ల మధ్యనే అన్న సాధారణ అభిప్రాయం అంతటా ఏర్పడి ఉంది. బిజెపిని ప్రజలు పెద్దగా పట్టించు కోవటం లేదు. మోడీ ప్రభావం తెలంగాణలో చెప్పుకోదగినట్లు లేదు.
ఇటువంటి పరిస్థితులలో బిజెపి జాతీయ అధ్యక్షుని లక్షాలు ఏ విధంగా ఉండవచ్చు? 2019లో అధికారం తమదేననటం నమ్మదగ్గది కాదని ఇక్కడి బిజెపి నాయకులకు తెలిసినా, వారినీ, కార్యకర్తలనూ ఉత్సాహపరచటం అందులోని ఉద్దేశమనాలి. ఓట్లు, సీట్లు రీత్యా ఇపు డున్న వాటిని కాపాడుకోవటం సరేసరి కాగా, అంతకన్నా వీలైనంత ఎక్కువ పెంచుకోవటం ఒక్కటే అమిత్‌షా ఆశించగల లక్షం. అయితే, ఉన్న ఓట్లు, సీట్లను కాపాడుకోగలరా అన్నది మొదటి ప్రశ్న. అంతకన్నా పెంచుకోగలరా, పెంచుకుంటే ఏ మేరకు అన్నది రెండవ ప్రశ్న. ఇందుకు సమాధానాలను భవిష్యత్తు మాత్రమే ఇవ్వగలదు తప్ప ఇపుడు అంచనా వేయగలవి కావు. దానిని అట్లుంచితే యథాతథంగా ఉన్న పరిస్థితులను బట్టి కొంత చర్చ చేయవచ్చు.
పైన చెప్పుకున్నట్లు, జిల్లాలలో బలహీనపడటం, హైదరాబాద్ నగరం లో ప్రతిష్టంభన అనే పరిస్థితులమధ్య ఓట్లు, సీట్లు తగ్గే ప్రమాదాన్ని నివారించటం అమిత్ షా మొదటి లక్షం అయి ఉండాలి. ఎందుకంటే పరిస్థితులు ఇప్పటివలెనే కొనసాగి 2019లో అటువంటివి ఏమైనా జరిగి నట్లయితే తలకొట్టివేసినంత పని అవుతుంది. దక్షిణ భారతదేశంలో విస్తరణకు ప్రధాన ప్రవేశద్వారమని బిజెపి స్వయంగా ప్రకటించిన రాష్ట్రం లో అటువంటిది జరగటం అశనిపాతం వంటిది. అట్లా జరగకుండా ఉండేందుకు కేవలం రాష్ట్రశాఖ ప్రయత్నాలపై ఆధారపడటం వల్ల ప్రయోజనం ఉండదని అమిత్‌షాకు అర్థమై ఉంటుంది. అదేవిధంగా, ఎప్పటివలెనే కేవలం హైదరాబాద్‌కు పరిమితమై జిల్లాలలో పెరుగుదల లేకపోవటం ఆత్మహత్యా సదృశమవుతుంది. రెండుచోట్ల విస్తరణ వల్ల మాత్రమే లక్షం దిశగా పురోగమించటం వీలవుతుంది. ఇపుడున్న అయిదు సీట్లు ఇంకా రెండు మూడు పెరగాలన్నా, లేక పది కావాలన్నా అది తప్పనిసరి. అందుకే తన మొదటి సీరియస్ ప్రచారాన్ని అమిత్‌షా ఒక జిల్లాతో ఆరంభించారు. హైదరాబాద్‌కు పొరుగున గల ఆ జిల్లాతో తమకు చారిత్రక అనుబంధం ఉందంటూ చెప్పుకున్నారు. అదెట్లున్నా, బిజెపికి ఒకపుడు తగినంత బలం ఉండిన ప్రాంతాలలో అది ఒకటని తెలిసిందే. పనిలో పనిగా ఆయన తన కార్యశైలితో, ఇది సుమా పని చేయవలసిన తీరని రాష్ట్ర నాయకులకు ఆచరణాత్మకంగా చూపి కదిలించే ప్రయత్నం చేసారు. అనగా అదే శైలి వారికి ఇక గీటురాయి అవుతుందన్న మాట.
బలం ఇప్పటికన్న ఎంత పెరిగినా అది సాధించటమే అవుతుంది. ఒకవేళ కాంగ్రెస్‌ను మించగలిగితే ఇక చెప్పవలసింది లేదు. దేశం మొత్తం మీద బిజెపి బలపడుతూ కాంగ్రెస్ బలహీనపడుతూ, తెలంగాణ కాంగ్రెస్ కు పాతపునాది అయితే తగినంత ఉన్నా నాయకత్వాలు ఇంకా పెద్ద ఆశ లు కల్పించనపుడు, గట్టిగా పనిచేస్తే ఆ పార్టీని మించటం అసాధ్యం కాదని అమిత్‌షా భావించుతుండవచ్చు. కనుక స్థానిక నాయకత్వానికి, కార్యకర్త లకు ఇటువంటి ఆశలను చిగురింపచేసి, వారి కార్యశైలిని మార్చగలిగితే అమిత్ పర్యటన ఉద్దేశం ఆ పరిమితార్థంలో నెరవేరినట్లే. అది జరిగిందీ లేనిదీ రానున్న వారాలలో, అమిత్‌షా తిరిగి వచ్చేలోగా, తెలిసిపోతుంది.