Home మహబూబ్‌నగర్ అభివృద్ధికి ఆమడదూరంలో..పాలమూరు పర్యాటకం

అభివృద్ధికి ఆమడదూరంలో..పాలమూరు పర్యాటకం

Palamuru-Tourismపాలమూరు: సుందర ప్రకృతి రమణీయ దృశ్యాలు, చారిత్రక కట్టడాలు, నిర్మాణాలకు నిలయంగా ఉంటోన్న పాలమూరు జిల్లా పర్యాటకం నేడు ఆదరణకు నోచుకోలేక మరుగున పడేస్థితికి చేరుకుంది. సంస్థానాల ఖిల్లాగా ఉన్న పాలమూరు జిల్లా పర్యాటకులు ఆశించిన మేర ఆకర్శించలేకపోతోందని పలువురు జిల్లా కవులు, మేధావులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 85కిలోమీటర్ల మేర ఆవరించి ఉన్న ప్రకృతి రమణీయ సుందర వనం నల్లమల, జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న భవానిసాగర్, అతిచేరువలో ఉన్న పిల్లలమర్రి, జిల్లా ప్రాజెక్టులలో కోయిల్‌కొండ, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, సరళాసాగర్, కృష్ణా నదీతీరంలో వెలసిన బీచుపల్లి, సోమశిల, ఉత్తుంగ తుంగ్రభధ్ర తీరంలో దేశంలోనే ఐదో శక్తిపీఠంగా వెలసిన జోగుళాంబ, బాలబ్రహేశ్వరస్వామి ఆలయాలు, ఇక చారిత్రక కట్టడాల విషయానికొస్తే గద్వాల, కొల్లాపూర్, వనపర్తి, ఆత్మకూర్ సంస్థానాలతో ఇంకా ఎన్నో అపురూప ప్రాంతాలు జిల్లాలో పర్యాటకుల్ని అమితంగా ఆకర్శిస్తాయి. కానీ నేడివి అభివృద్ధికి నోచుకోలేక ఎక్కడవేసిన గొంగళి అక్కడే చందంగా మారాయని పలువురు జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గడచిన పాతికేళ్ల క్రితం జిల్లా కేంద్రానికి అతిచేరువలో ఉన్న పిల్లలమర్రిని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సదుద్ధేశ్యంతో జిల్లా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నప్పటికి ఆచరణలో కొంత అలసత్వం కారణంగా పిల్లలమర్రిలో నేడు వసతులు మృగ్యమై పర్యాటకులకు విసుగును కల్గిస్తున్నాయి. వన్యప్రాణులు, సరసృరూపాలు, చేపల పెంపకం (అక్వేరియం), హరితవనాలు, ఉద్యాన వనాలు, అందమైన పూలమొక్కలు విరివిగా కాకుండా అక్కడక్కడా మాత్రమే దర్శనమిస్తున్నాయని పర్యాటకులు పేర్కొంటున్నారు. జింకలు, అడవిదుప్పులు, నీటి ఏనుగుల దర్శనం అసలే లేదు. వారాంతపు సెలవులో తమ పిల్లాపాపలతో కొంత ఉపశమనం పొందేందుకు, సేద తీరేందుకు ఇక్కడికి వచ్చే మధ్య తరగతి కుటుంబీకులు, విద్యార్థులకు సదుపాయాల లేమి కొంత బాధను కల్గిస్తోందని చెబుతున్నారు.

ప్రకృతికి అద్దంపట్టేలా ఉండే భవాని సాగర్‌ను అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదనే ఆరోపణలు లేకపోలేదు. ఇక దేశంలోనే తొలి సైఫన్ సిస్టమ్ రూపుదిద్దుకున్న సరళాసాగర్ గురించి ఎవ్వరికి పట్టదనే విమర్శలు వినవస్తున్నాయి. ప్రియదర్శిని జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు పర్యాటకులకు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరమెంతైనా ఉంది. జాతీయ రహదారికానుకుని ఉన్న బీచుపల్లి కృష్ణా నది వద్ద పర్యాటకులు, యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు ఖచ్చితంగా చేయాల్సిన అవసరముంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉండి దేశంలోనే ఐదో శక్తిపీఠంగా ఉంటోన్న జోగుళాంబ, బాల బ్రహేశ్వరాలయంలో యాత్రికులు, పర్యాటకులకు సదుపాయాల కొరత తీర్చాల్సిన అవసరముందని ప లువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక కట్టడాల పూర్వవైభవాల్ని ప్రతిబింబించేలా వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆయా ఆ లయాల్లో అక్కడక్కడా బోర్డుల ద్వారా యాత్రికులు, ప ర్యాటకులకు వివరించాల్సిన అవసరం కూడా ఎ ంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సంబంధిత జిల్లా అధికారులు ఇప్పటికైనా జిల్లా పర్యాటకంపై తగిన శ్రద్ధచూపి మన జిల్లా చరిత్రను పదిమందికి తెలపాలని జిల్లా ప్రజలు, కవులు, మేధావులు కోరుతున్నారు.