Home ఎడిటోరియల్ ఎన్నికలలో ఎన్ని కళలో!?

ఎన్నికలలో ఎన్ని కళలో!?

Election-Campaign

‘అసమర్థ, అవినీతిగ్రస్త ప్రభుత్వాన్ని మించిన ముప్పు నాగరికతకు మరొకటి లేదు.‘ఆస్ట్రియన్ అమెరికన్ ఆర్థికవేత్త లుడ్విన్ వాన్ మైసెస్. సామాన్య జనుల జీవన సరళి, సంక్షేమస్థాయి నాగరికతతో ముడిపడి ఉంటాయి. అవినీతి, అసత్య చక్రవర్తులు, హంతకులు, మాటతప్పే వారు, పరదూషకులు, మతమూఢులు, ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యతిరేకులు సమర్థ, నైతిక ప్రభుత్వాలను నడుపుతారా? వాళ్ళు సిద్దాంత ప్రాతిపదికన గాక వ్యక్తిగత దూషణలతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మంచిపనులన్నీ తామే చేసినట్లు, చెడుపనులన్నీ ఎదుటివారు చేస్తున్నట్లు ప్రజలను ప్రలోభ పెడుతున్నారు. నిజం తెలియని ప్రజలు ఆ అసమర్థ, అవినీతి పాలకులనే ఎన్నుకుంటున్నారు.

ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల విజయం ఆత్మ, పరమాత్మ (అమిత్, మోదీ)లకు అత్యా వశ్యకం. అందుకు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. రాజ ధానికి 30 కి.మీ.ర్ల దూరంలో నున్న బారాబంకి ఎన్నికల ప్రచార సభలో 2017 ఫిబ్రవరి 16 న మోడీ చాలా ఆరోపణలు చేశారు. వాటిలో నిజానిజాలు పరిశీలిద్దాం. ‘అఖిలేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 50% ఉపాధ్యాయ పదవులను భర్తీ చేయలేదు. పేదపిల్లలు ఎక్కడ చదువుకుంటారు?’ – ప్రాథమిక పాఠశాలల్లో 23% ఉపాధ్యాయ పదవులే ఖాళీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 60 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలలో 9 లక్షల ప్రాథమిక ఉపాధ్యాయ పదవులు, లక్ష మాధ్యమిక ఉపాధ్యాయ పదవులు ఖాళీగా ఉన్నాయని సంబంధిత కేంద్రమంత్రి 2016 డిసెంబర్ 5న పార్లమెంటులో చెప్పారు. మొత్తం 17% ఖాళీలు. ప్రాథమిక ఉపాధ్యాయ ఖాళీలు జార్ఖండ్‌లో 38.4%, పంజాబ్‌లో 23.4%. మాధ్యమిక పాఠశాల ఉపాధ్యాయ ఖాళీలు ఝార్ఖండ్‌లో 71.7%, గుజరాత్‌లో 33.6%. ఇవి జాతీయ సగటు 17%కి చాలా ఎక్కువ. జార్ఖండ్, గుజరాత్‌ల్లో బిజెపి ప్రభుత్వాలు, పంజాబ్‌లో బిజెపి సంకీర్ణ ప్రభుత్వం ఉన్నాయి.

గుజరాత్ ‘స్వర్ణపాలన’ మోదీని ప్రధానిని చేసింది కూడా. ‘దళితు లపై అత్యధికంగా అత్యాచారాలు జరిగిన ప్రాంతమేదైనా ఉంటే అది ఉత్తరప్రదేశే.’ – ఇంతకు మించిన అబద్దం ఇంకొకటి లేదు. జాతీయ నేర నమోదు సంస్థ లెక్కల ప్రకారం దళితులపై నేరాల నిష్పత్తి (లక్ష జనాభాలో నేరాల సంఖ్య), రాజస్థాన్‌లో 57, ఆంధ్రప్రదేశ్‌లో 52, గోవాలో 51, మధ్యప్రదేశ్‌లో 37, ఛత్తీస్‌గఢ్ లో 31, గుజరాత్‌లో 26, ఉత్తరప్రదేశ్‌లో 20. ఈ జాబితాలోని ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి సంకీర్ణ ప్రభుత్వం, మిగిలిన రాష్ట్రాలలో తమ బిజెపి పాలన సుదీర్ఘకాలంగా ఉన్నది. ‘బిజెపి పాలిత రాష్ట్రాలలో ప్రధానమంత్రి పంటల బీమా పథకం ద్వారా 60-70% రైతులు ప్రయోజనం పొందారు. ఉత్తరప్రదేశ్‌లో కేవలం 3% మందికే ప్రయోజనం దక్కింది.’- పంటల బీమా ప్రయోజనం పొందిన రైతు ల శాతం మధ్యప్రదేశ్ లో 38.2, గుజరాత్ లో 26.1, ఉత్తరప్రదేశ్ లో 12.9. మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లో కేవలం నాల్గవవంతు బాధిత రైతులకే పంటల బీమా ప్రయోజనం లభించింది. అబద్దాల ను అలవోకగా, ధైర్యంగా బహిరంగ సభలో మోడీ ఎలా ప్రచారం చేశారో చూడండి. ఇవి కొన్నే. ఇంకా చాలా అబద్దాలను ఎన్నికల ప్రచార సభలలో చెప్పారు.

ఎన్నికల ప్రచారాలలో మోదీ చేసిన పటాటోప, టక్కుటమా రాలన్నీ పక్షపాత, అసత్య విమర్శలు. దేశంలో ప్రజలందరూ సమస్యలతో సతమతమవుతున్నారు. పెట్టుబడి దారీ ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించవు. అయితే అధికసంఖ్యాక మత స్థుల బాధలకు కారణం అల్పసంఖ్యాక మతస్థులకు సౌకర్యాలు కల్పించడమేనని మోడీ భావం. ఆయన కేకలన్నీ సందర్భోచితంగా మత బేధభావాలను రెచ్చగొట్టి మెజారిటి మతస్థుల ఓట్లు రాబట్టేం దుకే. రంజాన్, దీపావళి పండుగలకు విద్యుత్తు సరఫరాలు, కబరిస్థాన్ (ముస్లింల శ్మశానం), శ్మశానాల వ్యాఖ్యానాలు ఈ కోవలోనివే. నిజానికి యు.పి.లో 11 హిందుమతాలయాలలో 24 గంటల విద్యుత్తు నిచ్చామని సమాజవాది పార్టీ తెలిపింది. ప్రము ఖ పాత్రికేయులు రాజదీప్ సర్దేశాయ్ గణాంకాలతో ఈ విష యాన్ని ట్విట్టర్‌లో వివరించారు. దళితులు శతాబ్దాల తరబడి అణచివేత, వివక్షలకు గురవుతున్నారన్నది నిరూపిత చారిత్రక సత్యం.

70 ఏళ్ళ స్వతంత్రభారతంలో ఇంకా ముస్లింలు తీవ్ర కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారని, అత్యధికులు వెనుకబడి ఉన్నారని సచార్ కమిటీ సోదాహరణంగా నివేదించింది. అయినా వాళ్ళకే సుఖభోగాలు అందాయని రంకెలేయడంలో మోడీ అభిప్రాయ మేమి? ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం సౌకర్య్ ఆధిపత్యాన్ని, హిందు వివక్షతను బిజెపి అంతం చేస్తుందని చెప్పి 80 శాతమున్న హిందువుల ఓట్లకు ఎరవేయడమే మోడీ ఉద్దేశం. హిందువులంద రు సుఖంగా లేరు. హిందుమతంలోనే ఉన్నత కులస్తులు అల్పకులాలపై అమలు చేస్తున్న అణచివేత, వివక్షలే దీనికి కారణం. బిజెపి సిద్దాంతమదే. 2002 లో గుజరాత్‌లో ఈయన చేసిన నిర్వాకమిదే. 20% ముస్లింలున్న యు.పి.లో బిజెపి ఒక్క ముస్లింను కూడా ఎందుకు పోటీకి దింపలేదు? 2015 బీహార్ ఎన్నికలలో ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాలలో ఎన్నికలైన తర్వాత మోడీ బీహార్ నాయకులు ఆవుల దొంగలని, బిజెపి బీహార్‌లో ఓడితే పాకిస్థాన్‌లో పటాకులు పేలుస్తారని రెచ్చగొట్టారు. ఇప్పుడు యు.పి.లో కూడా ముస్లిం ఓటర్లున్న ప్రాంతాలలో ఎన్నికలైన తర్వాత అదేపని చేస్తున్నారు. బీహార్‌లో లాగానే యు.పి.లో కూడా బిజెపి ఓడి తీరుతుందని విశ్లేషకుల అంచనా.

ప్రధాని ప్రచార పద్దతిని తప్పుపట్టినవారిని కేంద్రమంత్రి ఉమాభారతి ఖండించారు. మైనారిటీలకు సంక్షేమ పథకాలు చేపట్ట వచ్చు కాని మెజారిటీల ఖర్చుతో కాదని మోడీ దురుద్దేశాన్ని ధృవీక రించారు. ఎస్.పి., బి.ఎస్.పి. నేతలు అవినీతిపరులని, ఎస్.పి., కాంగ్రెస్‌ల పొత్తు మోసగాళ్ళ సంకీర్ణమని కేంద్ర గృహమంత్రి రాజనాథ్ సింఘ్ అన్నారు. మాయావతితో కలిసి రాష్ట్రాన్ని పాలించినపుడు ఈ విషయం తెలియదా? అవినీతిపరులపై ఈయన చర్యలు చేపట్టవచ్చు కదా? బిజెపి పొత్తులన్నీ పవిత్ర మైనవా? ముంబయి కార్పొ రేషన్ ఎన్నికల ప్రచారంలో, ‘శివసేన నిజమైన హిందుత్వవాద సంస్థ కాదు.’ అని విశ్వ హిందు పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ అన్నారు. ఈ వ్యాఖ్యానంలో అంతర్లీనంగా ‘బిజెపి మాత్రమే హిందుత్వవాద సంస్థ’ అన్న నిజముంది .

ఇలా సాగవలసిందేనా?: ‘సమర్థ పాలన న్యాయవ్యవస్థపై భారాన్ని తగ్గిస్తుంది. ప్రభుత్వం ప్రస్తుతం న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తు న్నది.’ దేశాధ్యక్షుడు, అంతర్జాతీయ న్యాయ కోవిదులు, భారత ప్రధాన న్యాయముర్తి ఉన్న ఒక పుస్తకావిష్కరణ సభలో 2017 ఫిబ్రవరి 22 న దిల్లీ లో మోడీ ఇలా వ్యాఖ్యానించారు. తమకు అనుకూలం కాని 1200 చట్టాల రద్దు, న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని బలహీన పరచడం సమర్థపాలన, ప్రక్షాళన అవు తాయా? అదే సభలో నున్న ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్. ఖేహార్ ప్రభుత్వం కేసులను తగ్గించుకుంటే మంచిదని చురకేశారు. ప్రభుత్వం న్యాయాన్ని, చట్టాలను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగా న్ని గౌరవించాలని, అమలు చేయాలని ఆయన పరమార్థం. మేధా వులు, పౌరసంఘాలు, స్వచ్ఛంద నిఘాసంస్థలు, ప్రజా సంఘాలు, ప్రత్యామ్నాయ పక్షాలు మత ప్రచారకుల మాటలను, వాగ్దానా లను, ప్రచార సమాచారాలను విశ్లేషించాలి. నిజనిర్ధారణ కావించి వివిధ రూపాలలో ప్రచారం చేయాలి. శక్తివంతమైన స్వతంత్ర అభి ప్రాయాల పౌరసంఘాలు ఇప్పుడు భారతదేశంలో అవసరం.

-సంగిరెడ్డి హనుమంత రెడ్డి
ఒరెబ్రొ, స్వీడెన్