Home సినిమా చిన్న సినిమాల విడుదలకు డిజిటల్ శాటిలైట్ ఛానల్

చిన్న సినిమాల విడుదలకు డిజిటల్ శాటిలైట్ ఛానల్

 Digital Satellite Channel for the release of short films
1990లో చిత్ర పరిశ్రమలోకి…సిద్ధిపేట జిల్లాలోని మిట్టపల్లి గ్రామం మా స్వస్థలం. 1985 నుండి 1994 వరకు 9 ఏళ్ల పాటు స్థానికంగా కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా పనిచేశాను. ఈ నేపథ్యంలో సినీ రంగంపై ఉన్న ఆసక్తితో 1990లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం జరిగింది.
శివాజీ రాజాతో మొదటి చిత్రం… సినీ రంగంలోకి ప్రవేశించిన తర్వాత నేను చేసిన మొదటి చిత్రం ‘అల్లరి పెళ్లాం’. ఆర్.కె.ఫిల్మ్ బ్యానర్‌పై 1990లో శివాజీ రాజా హీరోగా ఈ చిత్రాన్ని రూపొందించాను. ఇందులో శుభశ్రీ హీరోయిన్. ఈ చిత్రం తర్వాత ఎంతో ఉత్సాహంగా వరుసగా సినిమాలు చేశాను.
1990లో చిత్ర పరిశ్రమలోకి.. ఇప్పటివరకు 32 సినిమాలు నిర్మించాను. అందులో ఐదు సినిమాలకు దర్వకత్వం వహించడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్‌గా 110 సినిమాలను విడుదల చేశాను. నటనపై ఉన్న ఆసక్తితో 20 సినిమాల్లో నటించాను.
చిన్న నిర్మాతల కోసం నిరాహార దీక్షలు… తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల విడుదల అసాధ్యంగా మారుతోంది. ఈ నేపథ్యంలో 2008లో థియేటర్ల లీజ్ విధానానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాను. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అత్యధిక శాతం థియేటర్లు లీజ్ పేరిట నలుగురు వ్యక్తుల చేతిలో ఉండడం విచారకరం. పెద్ద సినిమాలకే ఈ థియేటర్లు కేటాయిస్తుండడంతో దాదాపు 1000 వరకు చిన్న సినిమాలు విడుదలకాకుండా ఉండిపోయాయి. దీంతో చిన్న నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం 2009లో మూడు రోజుల పాటు, 2014లో ఏడు రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది.
సినీ కార్మికుల సంక్షేమానికి… తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను 2012లో ప్రారంభించాను. ఛాంబర్ ఛైర్మన్‌గా సినీ రంగంలోని 24 క్రాఫ్ట్‌లోని సినీ కార్మికుల సంక్షేమానికి కృషిచేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మా ఛాంబర్‌కు సెన్సార్ ఆథరైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అనుమతినిచ్చింది. అప్పటి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయల సహకారంతో ఇది సాధ్యమైంది. ప్రస్తుతం తెలంగాణ ఛాంబర్‌లో 1000 మంది నిర్మాతలు, 400 మంది సాంకేతిక నిపుణులు, 100 మంది దర్శకులు సభ్యులుగా ఉన్నారు. ఛాంబర్‌లో సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా జరుగుతోంది.
ఉచిత భీమా, ఇళ్లు… 24 క్రాఫ్ట్‌లోని దాదాపు ఐదు వేల మందికి పైగా సాంకేతిక నిపుణులు, సినీ కార్మికులకు ఐదు లక్షల ఉచిత భీమా, హెల్త్ కార్డులను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ద్వారా ఇప్పించాం.
అదేవిధంగా సినీ కార్మికులకు 200లకు పైగా ఇళ్లను ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు 200 పైగా చిన్న సినిమాల విడుదలకు థియేటర్లను సమకూర్చి చిన్న నిర్మాతలను ఆదుకున్నాం.
డిజిటల్ శాటిలైట్ ఛానల్… చిన్న సినిమాల విడుదల కోసం ప్రత్యేకంగా ఓ డిజిటల్ శాటిలైట్ ఛానల్‌ను ప్రారంభించబోతున్నాం. ‘మీ’ ఛానల్ పేరిట వచ్చే నెల ప్రారంభమయ్యే ఈ సినిమా ఛానల్‌లో చిన్న నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేసుకోవచ్చు. రిలీజ్ రైట్స్ కొనుగోలుచేసి చిన్న సినిమాలను ఈ ఛానల్‌లో విడుదల చేస్తాం. చిన్న నిర్మాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.
అదేవిధంగా టిఎఫ్‌సిసి యూ ట్యూబ్ ఛానల్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. మూడు కోట్ల ఇరవై లక్షల మంది వ్యూవర్స్‌తో పాటు ఒక లక్షా ఎనిమిది వేల మంది సబ్‌స్రైబర్స్ ఈ ఛానల్‌కు ఉన్నారు.
లేడీ ఓరియెంటెడ్ చిత్రం… ప్రస్తుతం నా స్వీయ దర్శకత్వంలో ‘మహిళా కబడ్డి’ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. రచనా స్మిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి సంబంధించి ఐదు పాటల చిత్రీకరణ పూర్తయింది. గీతామాధురి, మంగ్లీ, మధుప్రియ, ఆదర్శిణి (చక్రి సోదరి) ఆలపించిన ఈ పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశలో ఉంది.