Home దునియా పేదల మూడో కన్ను

పేదల మూడో కన్ను

Dinesh Kumar man who helps poor peopleహర్యానాలోని ఝాజర్ జిల్లా గుబానా గ్రామానికి చెందిన దినేష్ కుమార్ గౌతమ్ ఢిల్లీలోని నజఫర్గ్‌లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్‌లో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేశారు. డిప్లొమా పూర్తవడంతో రాజస్థాన్‌లోని మెవత్ జిల్లాలో హిందీ దినపత్రికలో దినేష్‌కు ఉద్యోగం వచ్చింది. అయితే, ఆ ప్రాంతంలో చాలామంది పేద పిల్లలకు విద్య లేకపోవడం దినేష్‌ను కలిచివేసింది. అందుకు 1998లో మొదటి సారిగా అక్కడి గ్రామీణ ప్రాంతాల్లో న్యూ ఢిల్లీ ఎడ్యుకేషన్ సొసైటీ – ప్రీ మిడిల్ స్కూల్‌ను ప్రారంభించాడు.

పాఠశాల నిర్వహణకోసం జీతంలోనుంచి వెచ్చించేవారు. స్నేహితుల,దాతల నుండి కూడా సహకారం అందేది. బెంచీలు, కర్టెన్లు, కప్‌బోర్డ్లు, కంప్యూటర్‌లు ప్రజలు విరాళాల రూపంలో అందించారు. తన జీతంతో స్కూల్ బస్ కొనుగోలు చేశారు దినేష్,ఈ బస్సును దూరం నుంచి వచ్చే పిల్లల కోసం ఉపయోగించేవారు. అప్పటికి 187 మంది పిల్లలు పాఠశాలలో చేరారు. పిల్లలు పెరగడంతో టీచర్లను నియమించాడు. చివరికి ఆ స్కూల్ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందింది. కానీ, దురదృష్టవశాత్తూ దినేష్ కుటుంబం అహ్మదాబాద్ వెళ్లిపోవడంతో 2003లో ఆ పాఠశాలను మూసివేయాల్సి వచ్చింది.

తర్వాత, 2005 సంవత్సరంలో ఢిల్లీలోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో దినేష్ చేరాడు. పేద పిల్లలకు విద్య అందించాలనే ఆయనకున్న ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. అందుకు, ఉద్యోగం చేసుకుంటూనే, దృష్టి పౌండేషన్ అనే స్వచ్ఛంధ సంస్థను స్థాపించాడు. దృష్టి అతని కుమార్తె పేరు. హర్యానాలో జరిగే బాలికలపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఈ సంస్థకు ఆ పేరు పెట్టాల్సి వచ్చిందని దినేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం, దృష్టి ఫౌండేషన్ నిర్వహణలో రెండు పాఠశాలలు అహ్మదాబాద్, ఢిల్లీలో ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు చదువులో వెనుకబడిపోవడం వల్ల వారికి అదనపు గంటలు చదువు చెప్పేందు కు ఈ పాఠశాలలు తోడ్పాటు నందిస్తున్నాయి. ఈ పాఠశాలలు ఎలాంటి అద్దె లేకుండా నడుస్తున్నాయి. వాలంటీర్లు కూడా ఉద్యోగాలు చేసుకుంటూనే రోటేషన్ పద్ధతిలో పిల్లలకు చదువు చెబుతారు. ఎనిమిదవతరగతి చదువుతున్న పిల్లలు డాక్టర్ నందిని సింగ్ కథక్ నృత్యంలో శిక్షణ పొందారు.

దినేష్ తన జీతంలో ఎక్కువ భాగం స్వచ్ఛంద సంస్థకు కేటాయించేవారు. అంతేగాక, పిల్లలకు విద్యనే అంకాకుండా ఆరోగ్య విషయమై ఆలోచన చేశారు. అందుకు, దృష్టి సంస్థ ఆధ్వర్యాన ఉచిత దంత క్యాంప్‌లను గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖాండ్‌లో నిర్వహించారు. గుర్‌గావ్‌లో ఉచిత దంత చికిత్స వాలంటీర్ సహాయంతో ఆరోగ్య నిపుణులతో ట్రీట్‌మెంట్ క్లినిక్ ప్రారంభించాడు. ఇప్పుడు 15వేల పిల్లలు ద్రిష్ఠి ఫౌండేషన్‌లో ఉన్నారు. పేద పిల్లలకు మోబిశాల పేరిట సాంకేతిక విద్య బోధించాలని ఆలోచన చేస్తున్నాడు దినేష్. దినేష్‌తో పాటు మొత్తం 1000 మంది వాలంటీర్లు దృష్ఠి స్వచ్చంధ సంస్థలో పనిచేస్తున్నారు. 39ఏళ్ల వయసు ఉన్న దినేష్ హెల్త్‌కేర్ కంపెనీలో మార్కెటింగ్ హెడ్‌గా పనిచేస్తున్నారు. తన చిన్నతనంలో తన కుటుంబసభ్యులు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను గుర్తుచేస్తూ, ఇలాంటి పరిస్థితులు పేద విద్యార్థులకు దీర్ఘకాలంలో ఉండకూడదనే ఈ ఆశయంతో ఈ చిన్న అడుగు వేశాడు దినేష్.

-మోత్కూర్ రవికుమార్