Home తాజా వార్తలు నాని నమ్మకం చూసి భయమేసింది

నాని నమ్మకం చూసి భయమేసింది

Nani and Gowtam Tinnanuriనాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘జెర్సీ’. తాజాగా విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ “నిజానికి ముందుగా నేను స్పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా చేయాలని అనుకోలేదు. హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో కామెంటేటర్ హర్షభోగ్లే… సచిన్ టెండూల్కర్ ఎంత గొప్పవాడో చెప్పారు. సచిన్ అంత గొప్ప ఆటగాళ్లు చాలా మంది ఉన్నా కూడా అటిట్యూడ్ కారణంగానే సచిన్ గొప్పవాడయ్యాడని హర్ష చెప్పారు. నాకు సచిన్ టెండూల్కర్ గొప్పతనం కన్నా…ఆయనలా టాలెంట్ ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు కదా అనే పాయింట్ బాగా నచ్చింది. సాధారణంగా మనం సక్సెస్ అయినవాళ్లను గుర్తుపెట్టుకుంటాం. కానీ అంతే కష్టపడి వేర్వేరు కారణాలతో లక్షాన్ని చేరుకోని వాళ్లు చాలా మంది ఉంటారు. వాళ్ల కథ చెప్పాలనుకొని ‘జెర్సీ’ కథను తయారు చేసుకున్నాను.

నా తొలి చిత్రం ‘మళ్లీ రావా’ కంటే ముందు నుండే నా దగ్గరున్న స్టోరీ ఇది. ఇక సినిమాకు ఇంత మంచి స్పందన వస్తుందని అనుకోలేదు. ఈ సినిమా పట్ల నాని నమ్మకం చూసి చాలా సందర్భాల్లో భయమేసింది. కానీ అందరి అంచనాలను అందుకునేవిధంగా సినిమా రూపుదిద్దుకుంది. నాని, విశ్వాంత్ తప్ప ఈ సినిమాలోని మిగతా వారందరూ క్రికెటర్సే. క్రికెటర్స్ అందరికీ నటనలో కొన్ని రోజులు శిక్షణ ఇచ్చాం. ఇక క్రికెట్ సన్నివేశాలను షూట్ చేయడం చాలా కష్టమైంది. సాధారణ సన్నివేశం అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా తీయవచ్చు. అదే క్రికెట్‌లో ఒక నిమిషం ఎపిసోడ్‌ను ఒకటిన్నర రోజు షూట్ చేసిన సందర్భం కూడా ఉంది. ఇక ముందు కథ రాసుకున్న తర్వాతే దానికి తగ్గ హీరోలను కలిసి కథ చెబుతాను. ప్రస్తుతం నా దగ్గర కొన్ని కథలున్నాయి. అయితే వెంటనే నెక్స్ సినిమాను ప్రారంభించను. కాస్త గ్యాప్ తీసుకొని సినిమా చేస్తాను”అని అన్నారు.

Director Gowtam Tinnanuri talk about Jersey Movie