Home సినిమా సిట్ విచారణకు హాజరైన పూరీ

సిట్ విచారణకు హాజరైన పూరీ

PURI

హైదరాబాద్ : డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా సిట్ అధికారుల ఎదుట ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ బుధవారం హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో 12 మంది సినీ ప్రముఖులకు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పూరీ బుధవారం సిట్ అధికారుల ఎదుట హాజరై తన వివరణ ఇచ్చారు. పూరీతో పాటు తమ్ముడు సాయింశంకర్, కొడుకు ఆకాష్ పూరీ, ఆయన తరుపు న్యాయవాదులు ఉన్నారు. సిట్ అధికారులు అకున్ సబర్వాల్, చంద్రవదన్ తదితరులు పూరీని విచారించారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌ను విచారించిన ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ కూడా విచారణలో పాల్గొన్నారు.

పూరీ ఇచ్చే సమాధానాల తీరును పరిశీలించేందుకు విచారణ గదిలో ఓ మనసిక వైద్యుడు కూడా ఉన్నట్టు సమాచారం. పూరీ విచారణ నేపథ్యంలో ఆబ్కారీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రగ్స్ కేసులో 12 మంది సినీ ప్రముఖులకు రోజుకొకరి చొప్పున విచారించనున్నారు. ఈ విచారణ ఆగస్టు 2వ తేదీ వరకు కొనసాగనుంది. ఈనెల 20న చార్మీ, 21న ముమైత్‌ఖాన్, 22న సుబ్బరాజు, 23న శ్యాం.కె.నాయుడు, 24న రవితేజ, 25న ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, 26న హీరో నవదీప్, 27న హీరో తరుణ్, 28న హీరోలు తనీష్, నందు సిట్ ఎదుట హాజరుకానున్నారు.

Director Puri Jagannath attended before SIT in Drug Case