Home Default శంకర్ స్ట్రయిట్ బాలీవుడ్ మూవీ

శంకర్ స్ట్రయిట్ బాలీవుడ్ మూవీ

 

సౌత్ సినిమాల స్థాయిని అమాంతంగా పెంచిన దర్శకుల్లో శంకర్ ఒకరు. ఆయన బాలీవుడ్ సినిమాలను కూడా తలదన్నేలా పలు చిత్రాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘2.0’ చిత్రం ఏకంగా 550 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. ఈ చిత్రం సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్, విదేశాల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో పక్షిరాజు పాత్రకు మొదట అక్షయ్‌కుమార్‌కు బదులుగా పలువురు స్టార్స్‌ను పరిశీలించారు. ఈ క్రమంలోనే హృతిక్ రోషన్‌తో శంకర్ చర్చలు కూడా జరిపారు. అయితే హృతిక్ ‘2.0’ చిత్రంపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో ఈ పాత్రను అక్షయ్‌కుమార్‌తో చేయించారు. సినిమా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో హృతిక్ రోషన్ స్పందిస్తూ… సినిమా చాలా బాగుంది, ఇలాంటి సినిమాలు, పాత్రలను చేసేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్టుగా చెప్పారు. దీంతో పాటు అతను స్వయంగా శంకర్‌తో మాట్లాడి ఓ సినిమా చేద్దామని అన్నారట. దీనికి శంకర్ కూడా ఓకే చెప్పారని తెలిసింది. ప్రస్తుతం ‘భారతీయుడు’ సీక్వెల్ ‘ఇండియన్ 2’ చిత్రాన్ని చేస్తున్న శంకర్ వచ్చే ఏడాది హృతిక్ రోషన్‌తో సినిమాను మొదలుపెట్టబోతున్నారు. ‘2.0’ చిత్రాన్ని మించిన బడ్జెట్‌తో, అంతకు మించిన టెక్నికల్ ఎలిమెంట్స్‌తో హృతిక్‌తో మూవీ ఉంటుందని తన సన్నిహితులకు శంకర్ చెప్పారట. హృతిక్ మూవీతో శంకర్ స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా చేయబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.

Director Shankar next movie with Hrithik Roshan