Home తాజా వార్తలు ‘జిగేల్‌ రాణి’ గాయనికి పారితోషికం అందింది

‘జిగేల్‌ రాణి’ గాయనికి పారితోషికం అందింది

Director Sukumar helps Rs. 1 Lakh to Jigelu Rani singer

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ మూవీ ఎంత భారీ విజయం సాధించిందో తెలిసిందే. చాలా రోజుల తర్వాత టాలీవుడ్ లో శతదినోత్సవం జరుపుకున్న మూవీగా నిలిచింది. అలాగే కలెక్షన్లలోనూ నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తన ఖాతాలో వేసుకుంది. ఇక రంగ‌స్థ‌లం సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో, సంగీతం కూడా అంతే హిట్ అయింది. చంద్ర‌బోస్ లిరిక్స్, దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు చిత్రానికి ప్రాణంగా నిలిచాయి. అయితే ఈ చిత్రంలో ‘జిల్‌ జిల్‌ జిల్‌ జిగేల్‌రాణి…’ అనే పాట మాస్ ఆడియన్స్ ను ఓ ఊపు ఊపిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాట పాడిందేవరో తెలుసా? విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలోని బిఆర్టీ కాలనీకి చెందిన హరికథ కళాకారిణి గంటా వెంకటలక్ష్మి. ఓ చిన్న కిరాణ కొట్టుతో జీవనం సాగిస్తున్న ఆమెకు ‘జిగేల్‌రాణి’ పాట రూపంలో మంచి అవకాశం దక్కింది. పాట కూడా సూపర్ హిట్ అయింది.

కానీ, పాట పాడిన వెంకటలక్ష్మికి మాత్రం పారితోషికం అందలేదట. మాతా రికార్డింగ్‌ కంపెనీ యజమాని నాగభూషణం తనను పాట పాడేందుకు చెన్నై తీసుకువెళ్లారని, అక్కడే రెండు రోజులపాటు ఉండి పాట పాడినట్లు చెప్పుకొచ్చింది. అయితే పాడినందుకు తనకు ఎటువంటి పారితోషికం ఇవ్వలేదని వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. త‌న‌కి అన్యాయం జ‌రిగిందంటూ మీడియా ముందు ఆమె వాపోయింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సుక్కు వెంటనే స్పందించాడు. వెంకటలక్ష్మి బ్యాంకు అకౌంట్ లో తక్షణమే రూ. లక్ష ట్రాన్స్ ఫర్ చేశాడు. హరికథలే జీవ‌నాధారంగా బ్ర‌తుకున్న వెంకట‌ల‌క్ష్మీ బుర్రకథను ఓ రోజు యూట్యూబ్‌లో దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ చూశారు. దాంతో వెంకట‌ల‌క్ష్మీ  గొంతు ఈ పాటకు సరిగ్గా సరిపోతుందని భావించి ఆమెతోనే జిగేల్ రాణి పాట పాడించారు. అది కాస్తా సూపర్ హిట్ కావడం, పాట పాడిన వెంకట‌ల‌క్ష్మీ పేరు మార్మోగిపోవడం జరిగిపోయాయి.