Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ఖాకీ వనంలో కీచులాటలు!

Police-image

హెచ్‌ఆర్‌సిని ఆశ్రయించిన అదనపు డిసిపి
ఇటీవల ఓ ఎస్‌ఐ అజ్ఞాతంలోకి… తిరిగి వెలుగులోకి…
పోలీసు కానిస్టేబుల్స్‌కు పదోన్నతిల్లోనూ వివక్ష

మన తెలంగాణ/ సిటీబ్యూరో : ఓ వైపు వత్తిడిలు… మరో వైపు ఆరోపణలు… వెరసి నగరంలోని పోలీసు అధికారుల తీరు. ఇటీవల నేరేడ్‌మెట్ పోలీసు స్టేషన్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ తనను ఉన్నతాధికారులు విపరీతమైన వత్తిడిలు చేస్తున్నారనో… వేధిస్తున్నారనో… కారణం వెల్లడించకుండానే అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు..? తిరిగి ఎలా వచ్చాడు..? అనేది ఇప్పటి వరకు బహిరంగ రహస్యం. ఇదిలా ఉండగానే తనకు బాధ్యతల్లో వివక్షను చూపిస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నారని, తన హక్కులకు భంగం కలిగిస్తున్నారని… ఓ అదనపు డిప్యూటీ కమిషనర్ మానవ హక్కుల సంస్థ(హెచ్‌ఆర్‌సి)ని ఆశ్రయించారు. దీంతో ఇప్పటి వరకు పోలీసు అధికారుల్లో ఉన్న అంతర్గ త విభేదాలు, వ్యవహారాలు ఒక్కొక్కటిగా బహిర్గతమైనట్టు నగరంలో ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. ఓ ఎస్‌ఐ పరోక్షంగా, ఓ అదనపు డిసిపి ప్రత్యక్షంగా ఉన్నతాధికారులపై ఆరోపణలు సంధించడంతో పోలీసు విభాగపు వ్యవహారాలపై నగరంలో జోరుగా ప్రచారం జరుగుతుంది. పోలీసు విభాగంలో గ్రూపులు, వర్గాల ఆధిపత్యపోరు, తమకు అనుకూలురుగా లేని వారిపై వివక్ష, వేధింపులు, అదనపు పనిభారం, బదిలీలు జరగడం సర్వసాధారణమనేది పోలీసుల అభిప్రాయం. అయితే, కొందరు సర్దుకుని విధులను నిర్వహిస్తారని, మరికొందరు పైస్థాయి నుంచి చెప్పించుకుని ప్రాధాన్యతను పెంచుకుంటారని, ఇంకొందరు తప్పదని కొనసాగుతుంటారని వెల్లడిస్తున్నారు.

బహిర్గతమైన వ్యవహారాలు : సెక్షన్ సరిగ్గా నమోదు చేయలేదని కుషాయిగూడలో ఓ ఎస్‌ఐపై చర్య. జవహార్‌నగర్‌లో ఆరోపణలను ఎదుర్కొంటున్న పోలీసు కానిస్టేబుల్స్‌ను మరోపోలీసు స్టేషన్‌కు అటాచ్ చేయడం. సరిగ్గా దర్యాప్తు చేయలేదని మరో ఎస్‌ఐపై విభాగపరంగా తాఖీదులు. భూ వివాదాల్లో తలదూర్చారంటూ, ఇలా ఒక్కొక్కరిపైనా చర్యలు. ఫలితంగా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయనే ప్రచారం పోలీసు కమిషనరేట్‌లో వినిపించింది. పోలీసులు భూ వివాదాలకు దూరంగా ఉంటారని, పోలీసు స్టేషన్‌కు వెళ్ళితే తగిన న్యాయం జరుగుతుందనే చర్చ ప్రజల్లో నాటుకుంటోంది. ఇటీవల అధికారులు చేస్తున్న ఆరోపణలు, వ్యవహరిస్తున్న తీరు ఆ విభాగంలో వివక్ష ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా తీవ్ర స్థాయిలోనే ఉన్నట్టు పరిస్థితులు వెల్లడిస్తున్నాయనేది పలువురు పేర్కొంటున్నారు.

బదిలీలు, పదోన్నతుల్లో వివక్ష : నగరంలోని ఒకే జోన్‌లో గత మూడేళ్ళుగా ఒకే డిసిపిని కొనసాగిస్తున్నారు. ఇతర జోన్‌లలోకి డిసిపిలు వస్తున్నారు. వెళ్తున్నారు. కానీ, ఆ డిసిపిని మాత్రం మార్చడం లేదు. దీని వెనుక పలు రకాలుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, డిసిపి విధి నిర్వహణలో ఆరోపణలు చోటుచేసుకోవడం గమనార్హం. గతంలో సిబిఆర్‌ఐ సెక్షన్‌లో ఒకే ఇన్‌స్పెక్టర్‌ను పదోన్నతి వచ్చే వరకు మూడేళ్ళ వరకు ఆక్కడనే కొనసాగించారు. ఇటీవల పదోన్నతి రావడంతో డిజిపి కార్యాలయానికి బదిలీ చేసినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. పోలీసు కానిస్టేబుల్స్‌కు కూడా పదోన్నతి విషయంలో వివక్ష చోటుచేసుకుంటుందని, కనీసం పదవీ విరమణ వరకు కూడా పదోన్నతి లేక కానిస్టేబుల్గ్‌నే నియామకం, పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి నెలకొన్నట్టు వారు వివరిస్తున్నారు. కనీసం అలవెన్స్‌లను మంజూరు చేయడంలోనూ కానిస్టేబుల్స్‌కు న్యాయం జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments