Home జాతీయ వార్తలు రోహింగ్యాల అంశంపై లోక్‌సభలో చర్చ

రోహింగ్యాల అంశంపై లోక్‌సభలో చర్చ

Delhi : Discussion On Illegal Rohingya Muslim Immigrants in Loksabha

ఢిల్లీ : రోహింగ్యాల అంశంపై మంగళవారం లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. ఏ రాష్ట్రంలో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారో లెక్క చెప్పాలని అన్ని రాష్ట్రాలను కోరినట్టు రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. రోహింగ్యాల అక్రమ వలసలను అడ్డుకునేందుకు అస్సాం రైఫిల్స్ పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రోహింగ్యా డిపోర్టు గురించి విదేశాంగ శాఖతో చర్చలు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. రోహింగ్యాలు భారత్‌లో స్థిరపడేందుకు ఎటువంటి అవకాశం లేదని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సభ్యుల దృష్టికి తెచ్చారు. భూటాన్, మయన్మార్ బోర్డర్ వద్ద ఫెన్సింగ్ లేదని, అక్రమ వలసలను అడ్డుకునేందుకు భద్రతాబలగాలు చర్యలు తీసుకుంటున్నాని ఆయన వెల్లడించారు. రోహింగ్యా శరణార్థులకు ఓటు హక్కు ఉందని శివసేన ఎంపి అరవింద్ సావంత్ ఆరోపించారు. దేశంలో కొందరు అక్రమంగా ఉంటున్నారని, అయితే ఇప్పటి వరకు ఎంతమందిని డిపోర్టు చేశారో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. మానవత్వానికి ప్రతీకగా నిలిచే భారత్‌లో రోహింగ్యాలను డిపోర్టు చేయడం దురదృష్టకరమని తృణమూల్ కాంగ్రెస్ ఎంపి సుగతా బోస్ అన్నారు. బంగ్లాదేశ్‌లో తొమ్మిది లక్షల మంది రోహింగ్యాలు ఆశ్రయం పొందుతున్నారని ,భారత్‌లో కేవలం 40వేల మంది మాత్రమే ఉన్నారని అన్నారు.

Discussion On Illegal Rohingya Muslim Immigrants in Loksabha