Home జాతీయ వార్తలు ఎల్‌జి-కేజ్రీ భేటీలో వివాదాలు భగ్గు

ఎల్‌జి-కేజ్రీ భేటీలో వివాదాలు భగ్గు

Delhi-LG

సేవా విభాగాల అధికారాలపై రగడ

న్యూఢిల్లీ : ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్‌కు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్య విభేదాలు మరింత భగ్గుమన్నాయి. రాజీ యత్నాల భేటీ రసాభాసగా మారింది. సేవల విభాగంపై తమవే అధికారాలని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ శుక్రవారం స్పష్టం చేశారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. ఇటీవలే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఆయన వైఖరి విరుద్ధంగా ఉందని కేజ్రీవాల్ విమర్శించారు. భారత చరిత్రలో తొలిసారిగా కేంద్రం బహిరంగంగా అత్యున్నత న్యాయస్థానం తీర్పును ఉల్లఘించిందని తెలిపారు. కేంద్రం వెన్నుదన్నుతోనే లెఫ్టినెంట్ గవర్నర్ రాజీకి రాకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

అయితే రాజ్యాంగయుతంగానే తాము వ్యవహరిస్తున్నామని లెఫ్టినెంట్ గవర్నర్ తమ వివరణ ఇచ్చుకున్నారు. 2015 హోం మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌లో సేవల విభాగాలు ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ పరిధిలోకి రావని నిర్ధేశించారని తెలిపారు. ఇది ఇప్పటికీ చెల్లుబాటులో ఉందని తేల్చిచెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం సేవలపై అధికారాలు తమకు అప్పగించాలని కోరుతోంది. అయితే ఈ వాదన సరికాదని లెఫ్టినెంట్ గవర్నర్ తేల్చిచెప్పడంతో వివాదం కొలిక్కిరాకుండా ఉంది. రాజ్యాంగంలోని 239, 239 ఎఎ అధికరణల ప్రకారం ఈ విధులకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయని లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు. కేజ్రీవాల్‌కు పంపించిన లేఖలో బైజాల్ వీటిని ఉటంకించారు. 2015లోనే ఈ ఉత్తర్వుల గురించి హోం మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ వెలువరించిందని తెలిపారు. ఈ నోటిఫికేషన్‌ను 2016 ఆగస్టు 4వ తేదీనాటి తీర్పులో ఢిల్లీ హైకోర్టు సమర్థించిందని గుర్తు చేశారు. ఇప్పటి తీర్పులో కూడా సుప్రీంకోర్టు ఈ నోటిఫికేషన్‌లోని అంశాలకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసిందని వివరించారు.
కేజ్రీ, ఎల్‌జి అరగంట భేటీ
సుప్రీంకోర్టు తీర్పు తరువాత తొలిసారిగా సిఎం కేజ్రీవాల్ శుక్రవారం లెఫ్టినెంట్ గవర్నర్‌తో దాదాపు అరగంట సేపు సమావేశం అయ్యారు. తీర్పులోని కీలక అంశాలను ప్రస్తావించారు. అందులోని అంశాలకు లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. అయితే ఆయన తమ మాటలను పెడచెవిని పెట్టారని, ఈ ధోరణి దేశంలో అరాచకానికి దారితీస్తుందని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. సేవల విభాగాలపై ప్రజా ప్రభుత్వ ఆధిపత్యాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించకపోవడం దేనికి సంకేతం అని విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ ప్రశ్నించారు. లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో తొమ్మిదిరోజుల నిరసన దీక్ష తరువాత తొలిసారిగా కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిశారు. ఇది సయోధ్యకు దారితీస్తుందని అంతా భావించారు. అయితే ఫలితం దక్కలేదు.

పోలీసు , భూ వ్యవహారాలు, ప్రజా వ్యవస్థ తప్ప మిగిలిన అంశాలపై ఢిల్లీ ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని, ఢిల్లీపై లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలు పరిమితమే అని, ఏ నిర్ణయం అయినా ఎన్నికైన ప్రభుత్వ సలహా సంప్రదింపుల తరువాతనే తీసుకోవల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయితే సుప్రీం తీర్పును కూడా ఖాతరు చేయకుండా తీర్పునకు వేరే భాష్యాలు చెపుతూ లెఫ్టినెంట్ గవర్నర్ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని కేజ్రీవాల్ విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు తరువాత కొద్ది గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్ ప్రభుత్వం విధాన నిర్ణయాల అమలును వేగవంతం చేసింది. ప్రత్యేకించి ఉన్నతాధికారుల బదిలీలు, నియామకాలకు సంబంధించి కొత్త పద్ధతిని తీసుకువచ్చింది. దీని మేరకు వీటికి ముఖ్యమంత్రికే సంపూర్ణ అధికారం ఉంటుంది. అయితే దీనికి ప్రతిగా సేవల విభా గం వారు సిఎం నిర్ణయాలను అమలు చేయకుండా ఉన్నారు. హోం మంత్రిత్వశాఖ జారీ చేసిన అప్పటి ఉత్తర్వుల మేరకు సేవల విభాగం ఇప్పటికీ లెప్టినెంట్ గవర్నర్ పరిధిలోనే ఉందని తెలియచేశారు. దీనిని సిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.