Home తాజా వార్తలు వివాదాల స్వామి

వివాదాల స్వామి

పేచీల్లో పరిపూర్ణుడు
హైదరాబాద్‌లో గంగా, జమునా తెహజీబ్‌కు తూట్లు పొడిచే కార్యక్రమం
రాజకీయనేతలను అంటకాగే తత్వం
పతంజలి ఉత్పత్తుల తరహాలో ‘గో దర్బార్’ వ్యూహం

Dispute-Swani

హైదరాబాద్ : హిందు మత ఉద్ధారకుడిగా తెరపైకి వచ్చిన పరిపూర్ణానంద స్వామి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో ‘వివాదాల స్వామి’గా మారారు. రాజధాని హైదరాబాద్‌లో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ‘గంగా జమునా తహజీబ్’కు తూట్లు పొడుస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగే తీరులో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. ఎంతో మంది హిందు స్వాములు, మఠాధిపతులు, పీఠాధిపతు లు హైదరాబాద్‌లో ఉంటున్నా, వస్తూ పోతూ ఉన్నా వారితో లేని వివాదాలు కేవలం పరిపూర్ణానందతో మాత్రమే ఎందుకొస్తున్నాయన్నది ఎం తో మందిని కలచివేస్తున్న ప్రశ్న. తాజాగా చోటుచేసుకున్న కత్తి మహేశ్ ఉదంతం పరిపూర్ణానందకు మొదటిదేమీ కాదు. గతంలో కంచె ఐలయ్యపైనా విరుచుకుపడ్డారు. భారతదేశంలో నివసిం చే ఏ మతస్తుడైనా ‘భారత్ మాతా కీ జై’ అని నినదించాల్సిందే, ముస్లింలు మక్కాకు, క్రైస్తవులు జెరూసలేంకు వెళ్ళాలనుకుంటే రాయితీలు ఇచ్చే ప్రభుత్వాలు హిందువులు కాశీకి లేదా మరో ప్రాంతానికి వెళ్ళాలనుకుంటే ఎందుకు ఇవ్వడం లేదని రెచ్చగొట్టే ప్రసంగాలు ఎన్నో సందర్భాల్లో చేశారు. వివాదాలను సృష్టించడం ద్వారా పదిమంది నోళ్ళలో ఎత్తుగడల్లో భాగమే ఈ ఉద్దేశపూర్వక వివాదాలు అనే ఒక సాధారణ అభిప్రాయం నెలకొంది. స్వార్ధ ప్రయోజనాల కోసం పరోక్షం గా ‘హిందు’ ముద్రను వేసుకుని రాజకీయ పార్టీ నాయకుల ప్రోద్బలంతోనే పనిగట్టుకుని ఇలాం టి వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారనే అనుమానాలూ లేకపోలేదు. హిందూ మతానికి పరిపూర్ణానంద ఒక్కరే ప్రతినిధా లేక యావత్తు హిందువుల తరఫున పేటెంట్ పొందిన ప్రతినిధా అనేదీ ఇలాంటి కీలక ప్రశ్నల్లో ఒకటి. ఏ హిందు స్వామితో లేని సమస్య పరిపూర్ణానందతోనే ఎందుకొస్తోందన్నది కూడా కీలకంగా మారింది.
రాజకీయాలతో సంబంధాలు : పరిపూర్ణానంద ఎంత ‘హిందు’ జపం చేస్తున్నా రాజకీయ సం బంధాలూ బలంగానే ఉన్నాయి. ఆయన చేపట్టిన చాలా కార్యక్రమాల్లో బిజెపికి చెందిన నేతలు వేదికను పంచుకున్నారు. అనేక కార్యక్రమాల్లో ఉప్పల్ శాసనసభ్యుడు (బిజెపి) ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు. బిజెపి నేత రాంమాధవ్‌తో పలుమార్లు భేటీ అయ్యారు కూడా. గత నెల ఆరవ తేదీన బర్కత్‌పురలోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడే ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన శ్యాంజీని, బిజెపి శాసనసభ్యుడు డాక్టర్ లక్ష్మణ్‌తో సమావేశమయ్యారు. గత నెల 14న ఢిల్లీలోని సౌత్ అవెన్యూలో శ్యాంజీ, ఏబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాలకృష్ణల సహకారంతో రాంమాధవ్‌ను కలిసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. గతేడాది డిసెంబరులో ప్రభాకర్‌తో కలిసి హిందు చైతన్య ర్యాలీలో పాల్గొన్నారు. గత నెల 17వ తేదీన ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర కార్యాలయం నుంచి లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి హైదరాబాద్ పర్యటన సందర్భంగా పరిపూర్ణానందకు చెందిన టీవీ ఛానెల్ కార్యాలయాన్ని కూడా సందర్శించడం లాంటివన్నీ బిజెపి నేతలతో ఈ ఆయన రాజకీయ సంబంధాలకు బలం చేకూరుస్తున్నాయి.
వ్యాపార ప్రయోజనాలు : అమెరికాలో పర్యటించిన సందర్భంగా ‘హిందు ధర్మం’పై ప్రచారం చేయడంతో పాటు ‘గో దర్బార్’ ఉత్పత్తుల గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం మార్కెట్‌లో గుర్తింపు పొందిన ‘పతంజలి’ ఉత్పత్తుల తరహాలోనే పరిపూర్ణానంద కూడా ‘గో దర్బార్’ పేరుతో ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదలచేసి వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అమెరికాలోని అభిమానుల ఆర్థిక సహకారంతో వెయ్యి ఎకరాల్లో ‘గో దర్బార్’ మెగా ఉత్పత్తి యూనిట్‌ను పెట్టాలనుకుంటున్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. వెయ్యి కుటుంబాలను గుర్తించిన పరిపూర్ణానంద పూర్తి ‘ఆర్గానిక్’ ఉత్పత్తుల పేరుతో పతంజలి స్టోర్‌ల ద్వారా ఇప్పటికే విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఇక ఒక టీవీ ఛానెల్‌ను స్థాపించి వ్యాపార ప్రయోజనాలతో పాటు రాజకీయ భవిష్యత్తుకు కూడా వేదికగా చేసుకున్నారు. తెలంగాణలో తన స్థానాన్ని రాజకీయంగా పదిలం చేసుకునే ఉద్దేశంతో, ఒక హిందు రాజకీయ పార్టీతో దగ్గరి సంబంధాలు నెరపుతున్న పరిపూర్ణానందకు ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి ఉందని, అందుకే నగరంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారనే వాదనలూ ఇప్పుడు నగరంలో గుప్పుమంటున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు పరిపూర్ణానందకు ఇప్పుడు కొత్తేమీ కాదు. తెలంగాణలో వివిధ సందర్భాల్లో పర్యటించిన ప్రతీసారీ ఏదో ఒక వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. హిందువుల ఆరాధ్యదైవమైన రాముడిపై కత్తి మహేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే, ప్రతి విమర్శలు చేసి పరిపూర్ణానంద వివాదాల స్వామిగా వినుతికెక్కారు.
ఆయన చేసిన వివాదాస్ప వ్యాఖ్యల్లో మచ్చుకు కొన్ని :
* శాంతిదూతగా గుర్తింపు పొందిన మదర్ థెరిస్సాకు ‘భారతరత్న’ ఇవ్వడాన్ని తప్పుపడుతూ 2017 సెప్టెంబరులో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా ఆమె అసలు సంగతులను బైటపెడతానంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
* చార్మినార్‌ను ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంపై ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు
* తెలంగాణ ప్రభుత్వం మైనారిటీలకు ఇవ్వాలనుకున్న 12% రిజర్వేషన్లపై వ్యాఖ్యలు
* భారతగడ్డపై నివసించే ప్రతీ ఒక్కరూ ‘భారత్ మాతా కీ జై’ అని నినదించాల్సిందేననే వ్యాఖ్యలు
* మక్కా, జెరూసలేంకు వెళ్ళాలనుకునే మైనారిటీ మతస్తులకు ఆర్థికంగా అనేక రాయితీలు ఇస్తున్న ప్రభుత్వాలు హిందువులు కాశీకి వెళ్ళాలనుకుంటే ఎందుకు ఇవ్వవు అని రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు
* ‘ఇంట్లో ఉన్నప్పుడు కులంతో బతుకు… వీధిలోకి వస్తే ‘హిందువు’గా బతుకు’ అనే వ్యాఖ్యలు