Home లైఫ్ స్టైల్ మన ఆరోగ్యం మన చేతిలోనే..

మన ఆరోగ్యం మన చేతిలోనే..

Distance of the ailments with Aquaponix cultivation

ఆక్వాఫోనిక్స్ సేద్యంతో అనారోగ్యాలు దూరం

చాలామంది పట్టణ ప్రజలు.. రూఫ్ గార్డెనింగ్ చెయ్యడం చాలా ఖర్చుతో కూడుకున్నదిగా భావిస్తారు.. కాని ఇంటి పైకప్పు మీద కేవలం ప్లాస్టిక్ బకెట్స్ ను ఉపయోగించి.. తక్కువ ఖర్చుతో ఒక చిన్న కుటుంబానికి సరిపడా అన్ని రకాల కూరగాయలు పెంచుతూ .. డబ్బును ఆదా చేస్తున్నారు మన హైదరాబాద్ సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో సరస్వతి నగర్‌కి చెందిన రవిచంద్ర. బ్యాంక్ ఉద్యోగి. నిత్యం ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటున్న రవిచంద్ర గార్డెనింగ్ ద్వారా ఉపశమనం పొందుతున్నారు. సేంద్రియ పద్ధతిలో కూరగాయలను పండించి వాటితో ఆరోగ్యాన్నీ మెరుగుపరుచుకుంటున్నాడు.. మధుమేహం, థైరాయిడ్ వంటి వ్యాధులను సైతం ఈ సేంద్రియ కూరగాయలను వాడకం ద్వారా తగ్గించుకుంటున్నాడు. చిన్నతనం నుండి వ్యవసాయ కుంటుంబంలో పుట్టి పెరగటంతో ఎలాంటి కూరగాయలు తింటే ఆరోగ్యంగా ఉండవచ్చో తెలుసుకుని భార్య విజయలక్ష్మి, అత్తయ్యల సహకారంతో ఈ కూరగాయలను పండిస్తున్న రవిచంద్రతో
మనతెలంగాణ ‘సకుటుంబం’ కాసేపు…

ఈ రూఫ్ గార్డెనింగ్‌ని ఎప్పుడు స్థాపించారు ….
నేను ఈ గార్డెనింగ్‌ని స్థాపించి నాలుగు సంత్సరాలు అవుతోంది. ఇప్పటి వరకు టెర్రస్‌పైన మొక్కలను పెంచే పద్ధతులను చాలా చూసి ఉంటారు కానీ నేను తయారు చేసిన డ్రిప్ సిస్టమ్ పద్ధతిలో ఎవరూ చేయటంలేదు.

టెర్రస్‌పై మొక్కలను నాటడం ద్వారా బిల్డింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవా?
టెర్రస్‌పై మొక్కలు నాటడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. వాటి నుంచి తరువాత కాలంలో బిల్డింగ్ పైభాగం కూడా నాణ్యత తగ్గిపోయి గోడలనుంచి నీరు కారుతుంది. కానీ నేను డ్రిప్ సిస్టమ్‌ని వాడుతాను. ఇలా వాడటం వల్ల ఒక్క చుక్కనీరు కూడా బిల్డింగ్‌పై పడదు. దాంతో నీరు వృధా అయ్యే పరిస్థితులు కూడా ఉండవు. చాలా తక్కువ నీటితో ఈ పద్ధతిలో చెట్లు పెంచుతుంటాను. ఇంక ఇంటిపైన భవిష్యత్తులో ఇంకో అంతస్థు కట్టుకోవాలనుకుంటే ఈ మొక్కల్లో ఒక్కటి కూడా పాడవకుండా అలాగే పై అంతస్థుపైకి తీసుకెళ్లవచ్చు.

డ్రిప్ సిస్టమ్‌ని ఎలా తయారు చేసుకోవాలి.. ఎంత ఖర్చు వస్తుంది…..
దీని కోసం బకిట్‌లు, డ్రమ్‌లను ఉపయోగించాను. డ్రిప్ సిస్టమ్‌కి ఈ బకిట్‌ల గురించి హైదరాబాద్‌లో కనీసం రెండు నెలల పాటు తిరిగాను. చిన్న షాపు నుంచి పెద్ద పెద్ద మాల్స్‌కి వెళ్లాను. కాని నాకు ఎక్కడా కూడా సరైన బకిట్‌లు దొరకలేదు. ఒక రోజు ఒక ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు అక్కడ పెరుగు బకిట్‌లను చూసాను. వారిని వెంటనే కలిసి 30 రూపాయల చొప్పున కొన్నాను. ఈ పెరుగు బకిట్‌లను ఎందుకు ఎంచుకున్నాను అంటే సెకండ్ హ్యాండ్ బకిట్‌లో ఉండే ల్యాక్టో బ్యాక్టీరీయా వల్ల మొక్కలకు కొన్ని ఫంగస్ లాంటివి రాకుండా చూస్తాయి. వీటి కింద భాగంలో ఒక చిన్న రంధ్రం చేసి దానికి ఒక పైపు బిగించాలి. అప్పుడు ఆ బకిట్‌లో కింద భాగంనుంచి వచ్చే నీరు మొత్తం కింద ఇంకో పైపులోకి వచ్చేలా అమర్చాలి. అలా వచ్చిన మొత్తం నీరు ఫిల్టర్ అయి కింద సంపులోకి వచ్చి మళ్లీ ఫిల్టర్ అయి పై ట్యాంక్‌లోకి వెళ్తాయి. ఈ ఫిల్టర్ విధానం మొత్తం మూడు పద్ధతుల్లో ఫిల్టర్ ఉంటుంది. అవి ఒకటి సోమ్ ఫిల్టర్ తరువాత యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్. ఇంక మూడవది బయోమిడియా ఫిల్టర్‌తో కింద ఉన్న సంపులోకి స్వచ్ఛమైన నీరు వస్తుంది. ఈ డ్రిప్ సిస్టమ్‌కి 30,000 వరకు ఖర్చు అవుతుంది.

ఎన్ని రకాలైనా కూరగాయలను పండిస్తుంటారు…..
నేను ఇక్కడ చాలా రకాలైనా పంటలను పండిస్తుంటాను. కేవలం కూరగాయలనే కాకుండా చేపలను కూడా పెంచుతుంటాను. ఇంకా విదేశీ పండ్లను కూడా పండిస్తుంటాను. పూల మొక్కలు ఇంక ఇతర రకాలైన వాటిని పెంచుతాం. ఈ కూరగాయలను మేము మాత్రమే కాకుండా మా ఇంటి చుట్టుపక్కల వారికి కూడా ఇస్తుంటాం. మా కూరగాయలకు ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు. మేము కనీసం నాలుగు సంవత్సరాల నుంచి మార్కెట్‌కి వెళ్లడం మానేశాం. ఎందుకంటే ఇప్పుడు మా టెర్రస్సే మాకు పెద్ద మార్కెట్‌లా అయ్యింది. కనీసం సంవత్సరానికి 70 కిలోల వరకు చేపలను పెంచుతుంటాం..

ఇందులో ఎలాంటి ఎరువులు వాడుతుంటారు ……
ఇందులో నేను మట్టి కొద్దిగా కూడా వాడలేదు. కొబ్బరి పొట్టు, వర్మి కంపోస్ట్, ఆవు పేడ, వేప చెక్క వాడుతాను. ఇది బరువు తక్కువగా ఉంటుంది. దీని ద్వారా నీరు చెట్టు కింద భాగంలోకి వెళ్లి చుక్కలు చుక్కలుగా కిందకి పడిపోతుంటాయి. మట్టి బరువు ఎక్కువ ఉంటుంది. మట్టి వేస్తే కలుపు, ఫంగల్స్ వంటివి వచ్చే అవకాశం ఉంటుందని వాడలేదు. ఇంటిపై భాగంలో 1000 లీటర్ల సామర్ధం గల ఒక పెద్ద ట్యాంక్‌లో చేపలను కూడా పెంచుతాం. వాటి నుంచి వచ్చిన నీరు ఎరువుల మాదిరిగా అవి మిగతా అన్ని మొక్కలకి సప్లై అవుతాయి.

థైరాయిడ్, మధుమేహం తగ్గిపోయాయి
నేను భారతీయ స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేసే వాడిని. నాకు అప్పుడు ఆరోగ్యం కూడా బాగుండేది కాదు. థైరాయిడ్, అధిక బరువు, మధుమేహం లాంటి సమస్యలు ఉండేవి. ఒక రోజు ఆఫీస్ పనిపై నేను ఒక సమావేశానికి బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. ఆ మీటింగ్ నా జీవితాన్నే మార్చేసింది. అక్కడ ఒక ఎన్‌ఆర్‌ఐ పరిచయం అయ్యాడు. తనకు నా ఆరోగ్య పరిస్థితిని చెప్పడంతో తాను నాకు ఒక విషయం చెప్పాడు. భారతదేశంలో చాలా వరకు రసాయనాలు ఉపయోగించి తయారు చేసిన కూరగాయలను తింటున్నారు. మనం తింటున్న ఆహారంలో ఉండే విటమిన్లు తక్కువగా ఉండటమే కారణం అని చెప్పాడు. అలా నేను తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత వెంటనే ఈ రూఫ్ గార్డెన్‌ను పెట్టాను. దాంతో ప్రతిరోజు నేను మా కూరగాయలతో చేసిన ఆహారాన్నే తింటున్నాను. . ఇప్పుడు నాకు థైరాయిడ్, మధుమేహం తగ్గిపోయాయి. 102 కిలోలు ఉన్న నేను ఇప్పుడు 70 కేజీలు ఉన్నాను. దీనికి ముఖ్య కారణం మార్కెట్లో లభించే రసాయనాలు వేసి పండించే కూరగాయలు, ఇతర కల్తీగా ఉన్న పదార్థాలు వాడకపోవడమే.

నీటి కొరత ఏమైనా ఉంటుందా…. ఎన్ని లీటర్ల నీరు వాడుతుంటారు….
ప్రస్తుతం నీటి సమస్య చాలా ఉంది. అందులో హైదరాబాద్‌లో మరీ ఎక్కువైపోయింది. ఇందుకోసం నేను డ్రిప్ సిస్టమ్ ద్వారా నీటి వినియోగం తక్కువ అయ్యేలా చేసాను. మామూలుగా అయితే రోజుకి నా దగ్గర ఉన్న 150 కుండీలకు నీరు కావాలంటే కనీసం 300 లీటర్ల నీరు కావాలి. నెలకి 9—000 లీటర్ల నీరు కావాల్సి ఉంటుంది. కానీ నేను పండించే ఈ విధానంతో కేవలం 700 లీటర్లతో పంటను పండిస్తున్నాను. ఎందుకంటే నేను తయారు చేసిన ఫిల్టర్ విధానంతో నీరు ఎక్కువగా ఖర్చుకాదు.

పర్యావరణ పరిరక్షణ కోసం ….
ప్రసుత్తం ఇప్పుడున్న సమయంలో భారతదేశంలో పొల్యుషన్ ఎంత ఎక్కువగా ఉందో చెప్పనవసరం లేదు. ఈ మధ్యనే మనం చూసినట్లయితే ఢిల్లీలో కాలుష్యం వల్ల ఎంత ఇబ్బందులు ఎదురయ్యాయో టీవిలో చూశాం. దీనికి ముఖ్యకారణం మనం ప్రకృతిని ప్రేమించకపోవడం. మన హైదరాబాద్‌లో కూడా రోజురోజుకీ వాతావరణ కాలుష్యం మరీ ఎక్కువైపోతోంది. ఇంక ప్లాస్టిక్ వాడకం కూడా చాలానే పెరిగింది. హైదరాబాద్‌లోని టెర్రస్‌ల విస్తీర్ణం మొత్తం దాదాపు 40,000 నుంచి 75,000 వేల ఎకరాలు ఖాళీగా ఉంటుందని అంచనా. ఇటువంటి గార్డెన్‌లు పెడితే ఇందులో కనీసం 50 శాతం వరకు మనం కాలుష్యాన్నిదూరం చేసుకోవచ్చు.

రైతులకు అవగాహన లేకపోవడం …….
తెలంగాణ ప్రభుత్వం హార్టీకల్చర్ డిపార్ట్‌మెంట్ (ఉద్యానవన శాఖ) కమిషనర్ వెంకటరామ్ రెడ్డి గారు వచ్చి నేను పండిస్తున్న ఈ గార్డెన్‌ని చూశారు. ప్రస్తుతం నేను ప్రభుత్వంతో కలిసి కొన్ని గ్రామాల్లో, హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో, జిల్లాల్లో కూడా అవగాహనా కార్యక్రమాలు చేస్తుటాం. ఎందుకంటే ఎంతమొత్తంలో ఎరువులు, రసాయనాలు వాడాలో వారికి చెపుతాము. అలా చెప్పడం ద్వారా మనం ఇప్పుడు తినే ఆహారంలో రసాయనాల శాతం కొంత తగ్గి అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని నా అభిప్రాయం. ఇప్పుడు చాలా వరకు 20 నుంచి 30 వరకు గల మధ్య వయసు వారికే మధుమేహం వచ్చేస్తోంది. దీనికి ముఖ్యకారణం మనం తినే కూరగాయల్లో కల్తీ ఉండటం. ఇప్పటి వరకు చాలా మందికి దీనికి సంబంధించిన కార్యక్రమాలను పూర్తిగా వివరించాము. ఎంత ఖర్చు అవుతుంది, ఎలా చేయాలనేది చెబుతుంటాం.

ఈ టెర్రస్‌లపై మొక్కలు పెంచే విధానం ఎప్పటినుంచి ఉంది….
టెర్రస్‌లపై మొక్కలు పెంచడం అనేది ఈ మధ్యకాలంలో వచ్చిందికాదు. పూర్వం ఇంటి ముందు పెరట్లో కొన్ని కూరగాయమొక్కలు పెంచి పండించిన వాటినే తినేవారు. దాంతో రసాయనాలు వాడకుండా ఉండే వాటిని తినేవారు. ఇంకా అప్పుడు బయట తయారుచేసిన పదార్థాలు ఉండేవి కావు. ఇంట్లో వండిన వాటిని మాత్రమే తినేవాళ్లు. ఇంక అప్పుడు బెల్లం వాడకం ఎక్కుగా ఉండేది. బెల్లంతో పోలిస్తే చెక్కరలో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. చాలా వరకు షుగర్ వచ్చిన వారు అన్నం తినడం మానేసి గోధుమతో తయారు చేసిన చపాతీలను తింటుంటారు. కానీ నిజానికి మనం తినే కూరల్లో ఉండే విటమిన్ల ద్వారా ఆరోగ్యంగా ఉండే పరిస్థితుల ఎక్కువశాతం ఉంటాయి.

ఇప్పుడున్న రోజుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. చాలా వరకు ఆఫీస్‌లో ఒత్తిడికి గురవుతున్నారు. అలాగే ఇంటికి వస్తుంటారు. వీరికి జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. అలాంటి వారు ఇలా ఇంటిపై గార్డెన్ పెట్టి ప్రతిరోజు వాటికి ఒక గంట సమయం కేటాయిస్తే వారికి ఉన్న ఒత్తిడిలో సగంవరకు తగ్గుతుంది. ఫలితంగా అనారోగ్యాలకు దూరంగా కూడా ఉండవచ్చు.

                                                                                                                                                విష్ణు