Home జగిత్యాల దివ్యాంగుల సమగ్ర అభివృద్దికి “సక్షమ్‌” సేవలు…

దివ్యాంగుల సమగ్ర అభివృద్దికి “సక్షమ్‌” సేవలు…

artificial limbs

 

జగిత్యాల : దివ్యాంగుల సమగ్ర అభివృద్ది కోసం సక్షమ్ స్వచ్చంద సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని జగిత్యాల ఎంఎల్‌ఏ డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. వికలాంగుల సమగ్ర అభివృద్ది కోసం పని చేస్తున్న జాతీయ సంస్థ సక్షమ్ ఆధ్వర్యంలో వికలాంగులకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంగళవారం ఎంఎల్‌ఏ సంజయ్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దివ్యాంగుల సంక్షేమం కోసం సక్షమ్ సంస్థ జగిత్యాల ప్రాంతంలో ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందన్నారు. గత సంవత్సరం అంధుల కొరకు ప్రత్యేక క్యాంపు నిర్వాహణతో పాటు రక్తహీనతతో బాధపడుతున్న వారి కోసం కార్యక్రమాలను నిర్వహించిందన్నారు.

శారీరక దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు ఇవ్వడం అంటే వారికి పునర్జన్మ ప్రసాదించినట్లేనని ఎంఎల్‌ఏ తెలిపారు. దివ్యాంగులు ఆత్మ విశ్వాసంతో జీవితంలో అభివృద్ది సాధించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, దివ్యాంగులకు నెలకు రూ.3వేల ఆర్థిక సాయంతో పాటు పెళ్ళి చేసుకుంటే రూ.2 లక్షలు అందజేస్తుందన్నారు. సక్షమ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వేద ప్రకాష్ మాట్లాడుతూ… తమ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దివ్యాంగులు అంటే శారీరక వికలాంగులు కాదని, వారిలో ఏదో ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుందని, వారిలో ఆత్మ విశ్వాసం నింపగలిగితే జీవితంలో విజయం సాధిస్తారన్నారు.

దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు ఇవ్వడమే కాకుండా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తమ సంస్థ పని చేస్తుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నలమూలల నుండి తరలివచ్చిన 175 మంది శారీరక దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సక్షమ్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ తాటిపాముల సురేష్, భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు చింత ప్రకాష్, డాక్టర్ భీమనాత్ని శంకర్, డాక్టర్ రామేశ్వరి, ట్రస్మా అధ్యక్షులు యాదగిరి శేఖర్‌రావు, భారత్ వికాస్ పరిషత్ కార్యదర్శి నరేందర్, సత్యం, రఘునందన్, అశోక్, మహిపాల్‌రెడ్డి, బోగ ప్రవీణ్, చిత్తారి మధుకర్, కస్తూరి రమణ, నర్సయ్య, రాజేందర్, భూపతి, నీలిమ, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Distributed artificial limbs to the disabled