Home నిర్మల్ గాడిన పడని గొర్రెల పంపిణీ

గాడిన పడని గొర్రెల పంపిణీ

goat

* సగం కూడా పూర్తి కాని వైనం
* పంపిణీ చేసినవి రోగాలతో మృత్యువాత
* లబోదిబోమంటున్న లబ్ధిదారులు

మన తెలంగాణ/నిర్మల్‌టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు సగం కూడా పూర్తి కాలేదు. ఒక్కో లబ్ధిదారుడికి 21 గొర్రెలతో కోటీశ్వరులను చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా యంత్రాంగాన్ని నడిపించడంలో విఫలమైందంటున్నారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటి వరకు 7148 గొర్రెలను పంపిణీ చేయాల్సి ఉండగా కేవలం 2665 గొర్రెలు పంపిణీ చేశారు. పంపిణీ చేసిన వాటిలో ఇప్పటి వరకు 362 గొర్రెలు చనిపోయాయి. ముఖ్యంగా ఇతర జిల్లాల నుండి కొనుగోలు చేసిన గొర్రెలు రోగాల బారిన పడుతున్నాయి. అలాగే మరి కొంత మంది లబ్ధిదారులు తమకు ఇచ్చిన సబ్సిడీ గొర్రెలు మరణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది రైతులు గొర్రెలు చనిపోతాయన్న భయంతో వాటిని అమ్మకాలు చేస్తున్నారు. సబ్సిడీ గొర్రెలతో వచ్చే రోగాలతో తమ వద్ద ఉన్న మరిన్ని గొర్రెలకు కూడా ఈ రోగాలు వ్యాపించవచ్ఛని భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యం గా ఆంధ్ర నుండి గొర్రెలను తీసుకురావడంతో అక్కడి వాతావరణం, ఇక్కడి వాతావరణం తట్టుకోలేక గొర్రెలు రోగాలబారిన పడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు గొర్రెల పంపిణీ పథకంపై దృష్టి సారించి లబ్ధిదారులకు అందజేయాలని పలువురు కోరుతున్నారు.
వైద్య సిబ్బంది కొరత
గొర్రెల కొనుగోలు పేరుతో వైద్యులు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లడంతో ఆసుపత్రిలలో సిబ్బంది కొరత త్రీవంగా ఉంది. జిల్లాలో డాక్టర్లు 5, కాంపోండర్లు 18, స్టోరేజ్ కీపర్లు 7, అటెండర్లు 6 చొప్పున సిబ్బంది కొరత ఉంది.
జూన్ వరకు పూర్తి చేస్తాం
నిర్మల్ జిల్లాలో 2, 3 దఫాల్లో గొర్రెల పంపిణీ కార్యక్రమం జూన్ వరకు పూర్తి చేస్తాం. ప్రతీ నియోజకవర్గంలో మొబైల్ వెటర్నరీ ఆసుపత్రి ద్వారా చికిత్సలు అందిస్తున్నాం. గ్రామంలో వైద్యులు అందుబాటులో లేకుంటే టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటి వరకు మృతి చెందిన 167 గొర్రెలకు ఇన్సూరెన్స్‌ను కూడా అందజేశాం. గొర్రెలను అమ్మితే చర్యలు తప్పవు.
జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి గజ్జారాం