Home తాజా వార్తలు త్వరలోనే రెండో విడత గొర్రెల పంపిణీ

త్వరలోనే రెండో విడత గొర్రెల పంపిణీ

Sheep-Distributionహైదరాబాద్ : రాయితీపై దక్కన్ జాతి గొర్రెలను పంపిణీ చేసేందుకు పశుసంవర్థక శాఖ, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భారీ సబ్సిడీతో మొదటి విడతలో 3,65,000 మందికి పైగా 78 లక్షల గొర్రెలు ఇచ్చింది. వేసవిలో పశుగ్రాసం కొరతతో పంపిణీ నిలిపివేయగా, వర్షాలు కురుస్తున్నందున త్వరలోనే జూలై మొదటి వారం లేదా రెండో వారంలో రెండో విడత లబ్ధిదారులందరికీ గొర్రెల పంపిణీ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వ అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపినట్లు గొర్రెలు, మేకల అభివృద్ధి ఫెడరేషన్ ఎం.డి లక్ష్మారెడ్డి తెలిపారు.

ఇందుకు అవసరమైన రుణాన్ని జాతీయ సహకార అభివృద్ధి బ్యాంకు (ఎన్‌సిడిసి) ద్వారా తీసుకుంటున్నట్లు వివరించారు. రెండో విడతలో 3.61 లక్షల మంది లబ్ధిదారులకు 75.98 లక్షల గొర్రెలు పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే 6 లక్షల గొర్రెలు పంపిణీ చేసినట్లు అధికారులు చెప్పారు. అయితే గొర్రెల పంపిణీపై ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు అందాయి. దీంతో ఒకటి పాత పద్ధతిలోనే గొర్రెలను కొనుగోలు చేయడం లేదా టెండర్ల ప్రక్రియ చేపట్టి పంపిణీ లేదా రాయితీని నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో వేయడం వంటి అంశాలపై పరిశీలన చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వర్షాలు మొదలు కాగానే నెల్లూరు జాతితో పాటు, పదివేల యూనిట్ల దక్కన్ జాతి గొర్రెలను అందించనున్నట్లు ఉమ్మడి మహబూబ్‌నగర్, సిద్దిపేట, వరంగల్ జిల్లాల నుంచి గొల్ల, కురుమల సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ జాతిగా పేరున్న దక్కన్ గొర్రెలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు మాంసం ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తుండటంతో, ఉన్ని ఉత్పిత్తి చేసే దక్కన్ గొర్రెలకు క్రమంగా డిమాండ్ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు కొన్ని జిల్లాల రైతులే కావాలని అడుగుతుండటంతో ప్రభుత్వం దృష్టి సారించింది. తొలి విడతలోనూ కొన్ని దక్కన్ జాతి గొర్రెలు పంపిణీ చేశారు. మహారాష్ట్రలోని సతారా, సాంఘి, షోలాపూర్, నాందేడ్, కర్ణాటకలోని బళ్లారి, చిత్రదుర్గ, దావణగిరి, బీదర్, గుల్‌బర్గా ప్రాంతాల నుంచి ఈ జాతి గొర్రెలను సేకరించనున్నారు.

రవాణా, దాణా, మందులు ఇలా అన్ని ఖర్చులు కలుపుకొని రూ.1,25,000లకు ఒక్కో యూనిట్‌ను కొనుగోలు చేయనున్నారు. ఆయా రాష్ట్రాల్లో లభ్యత, మన దగ్గర ఉన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని 10వేల యూనిట్ల(యూనిట్‌కి 21గొర్రెలు) కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. రోగనిరోధక శక్తి వీటిలో ఎక్కువగా ఉంటుందని, కరవు పరిస్థితుల్లో తక్కువ మేత తీసుకొని బతకగలవని పశుసంవర్ధకశాఖ అధికారులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, సిద్దిపేట ప్రాంతాల్లో దక్కణీ జాతి గొర్రెలు ఉన్నాయంటున్నారు.

Distribution of Sheep Second Installment in Telangana