Home రాజన్న సిరిసిల్ల పకడ్బందీగా టెన్త్ పరీక్షల నిర్వహణ

పకడ్బందీగా టెన్త్ పరీక్షల నిర్వహణ

Collector-Krishna-Bhasker

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: కలెక్టర్ కృష్ణభాస్కర్ 

మన తెలంగాణ / సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మార్చి 14 నుండి 30వ తేదీ వరకు నిర్వహించే పదవ తరగతి వార్షిక పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. గురువారం జిల్లా విద్యాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 7938 మంది విద్యార్థులు, 39 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారని ఇందులో 7369 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 569 మంది ప్రైవేట్ విద్యార్థులని తెలిపారు. పరీక్షల నిర్వహణలో సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు.

స్ట్రాంగ్ రూం వద్ద ఆర్మ్‌డ్ పోలీసులను నియమించాలని, కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ పంపిణీ సందర్భంగా పోలీస్ ఎస్కార్ట్ తీసుకోవాలన్నారు. ఫ్లయింగ్ స్కాడ్‌లో ఒక ఎస్సై, కానిస్టేబుళ్లను నియమించాలన్నారు. ప్రతి చీఫ్ సూపరింటెండెంట్‌కు ఎస్కార్ట్ ఇవ్వాలన్నారు. పరీక్షలు జరిగే సమయంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలన్నారు. ప్రశ్నాపత్రాల విషయంలో వదంతులు ప్రబలకుండా ఇంటెలిజెన్స్ విభాగాన్ని అప్రమత్తం చేయాలన్నారు. సమాధాన పత్రాలను పోస్టల్ ద్వారా పంపించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో అత్యవసర వసతులు, త్రాగునీరు, ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు, వైద్య సిబ్బంది ఉండేలా చూడాలన్నారు.

విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు గ్రామాల నుండి తరలించేందుకు వీలుగా బస్సులను వినియోగించాలన్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన వాహనాలను సమకూర్చాలన్నారు. జిల్లా మొత్తం 9 స్టోరేజీ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్షల నిర్వహణకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చేనేత లక్ష్మి పథకంలో విద్యాశాఖకు చెందిన 111 మంది సిబ్బంది చేరడం పట్ల అభినందిస్తూ వారి కార్డులను ఎంఈవో రాంచందర్‌రావుకు అందించారు. ప్రతి ఒక్కరు చేనేత లక్ష్మిలో చేరాలని సూచించారు. కార్యక్రమంలో డిఈవో రాధాకృష్ణ, పరీక్షల నిర్వహణ సహాయ కమీషనర్ శ్రీనివాస్, డిఎస్పీ సుధాకర్, ఎంఈవోలు, ఇతరులు పాల్గొన్నారు.