Home దునియా పేదల కనురెప్ప కనకదుర్గ

పేదల కనురెప్ప కనకదుర్గ

Kanaka-Durga

పిల్లల పట్ల తల్లిదండ్రుల నిర్లక్షం విపరీతంగా వుంది…. ఈ నిర్లక్ష్యమే పిల్లలను సంఘ విద్రోహులుగా మారుస్తుంది….చట్టాలపై ప్రజల్లో మరింత అవగాహన రావాలి. రాజ్యాంగం పొందుపర్చిన హక్కులను సాధించుకోవడమే కాదు…ప్రతి ఒక్కరూ తన నిజ జీవితంలో ప్రతి హక్కును సాధించుకోవడమే సమ న్యాయం. పేదలకు, ముఖ్యంగా మహిళలకు సత్వర న్యాయం అందించడం కోసం అహర్నిశలు పాటు పడుతున్నారామె. బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు సామాన్య జనం సమస్యల్లో ఉన్నారంటే చాలు నేనున్నాను..అంటూ భరోసా ఇస్తూ ముందుకు పోతున్నారు ఉమ్మడి మెదక్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.కనకదుర్గ. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో దాదాపు 500 వరకు ఉచిత న్యాయ శిబిరాలు నిర్వహించారు.

అంతేగాక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ముస్ల్లిం యువతీ యువకులకు వివాహాలు జరిపించే ఖాజీలకు సైతం ప్రత్యేక సమావేశం నిర్వహించి బాల్య వివాహాలు జరిపించడం వల్ల జరిగే అనర్థాల గురించి వివరించడంతో పాటు తలాక్ తలాక్ పేరిట జరిగే విడాకుల పర్వాన్ని కూడా కట్టడి చేయాలని సూచించారు. ఒకవైపు ముస్లిం వివాహ చట్టంలా ఉన్నప్పటికీ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన హక్కులను వివరిస్తూ వారిలో కూడా చైతన్యాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

కనకదుర్గ తన కార్యాలయంలో కంటె ఎక్కువ సమయం జనంలోనే వుంటారు. ఎవరైనా ఫిర్యాదులు చేస్తేనే స్పందించాలనే మనస్తత్వానికి ఆమె పూర్తిగా విరుద్ధం. ప్రజల ఇబ్బందులపై కలుగుతున్నాయని ప్రతికల్లో వచ్చే వార్తలకు ఆమె వెంటనే స్పందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన సమస్యలైన బాల్య వివాహాలు, ఆడ బిడ్డల విక్రయాలు, ఇటుక బట్టీలు తదితర రంగాల్లో పనిచేసే బాల కార్మికులకు విముక్తి కల్పించడం కోసం కూడా ఆమె అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. జిల్లాలోని కొన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు తెలియని పథకాలు కూడా ఆమెకు తెలుసు.

ప్రభుత్వం కల్పించే అవకాశాలను ప్రజల దరికి చేరవేయడం కోసం న్యాయమూర్తి కనకదుర్గ అధికారులను తానే స్వయంగా కలిసి మరీ వాటిని అమలు చేయిస్తుంటారు. ఇళ్లల్లో పాచి పని చేసుకొని జీవించే పేద పిల్లల కోసం ప్రభుత్వం నెలకు రెండువేల నుంచి రెండున్నర వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తుందనే విషయాన్ని ఆమె స్వయంగా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు చెప్పి సంగారెడ్డి మండలంలోని 40 మంది పేద పిల్లలకు ప్రతినెలా ప్రభుత్వం నుంచి రూ.2500 ఆర్థిక సాయం ఇప్పిస్తున్నారు. ఈ విధమైన పథకం ఒకటి వుందని కూడా అధికారులు ఇప్పటివరకు పెద్దగా ఎక్కడా ప్రచారం కల్పించలేదు.

ఇంతేగాక హత్నూర మండలం నాగపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొడపాక గ్రామానికి చెందిన మమతకు ప్రభుత్వం ప్రతినెలా ఇచ్చే రూ.1500 ఆసరా పెన్షన్ నుంచి ఆమె తల్లి తీసుకున్న అప్పు కింద ప్రతినెలా వెయ్యిరూపాయలు రికవరీ చేస్తున్నారన్న విషయం న్యాయమూర్తి కనకదుర్గ దృష్టికి వచ్చింది. ఆ వెంటనే స్పందించి ఆమె సదరు బ్యాంకు అధికారులు మాట్లాడి తల్లి చేసిన అప్పుకు బిడ్డ నుంచి ఎలా రికవరీ చేస్తారని నిలదీయంతో పాటు మమత పెన్షన్ రికవరీ కాకుండా చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో హెచ్‌ఐవి బారిన పడిన తల్లిదండ్రుల పిల్లలు అనాథలు కాకుండా అలాంటి వారందరినీ గుర్తించి వారందరినీ స్వచ్ఛంద సంస్థలో ఆశ్రయం కల్పించారు.

పట్టణ ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ కనిపించే 40 మంది బడీడు పిల్లలను కూడా పోలీసుల, మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో గుర్తించి వారిని మహిళా శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. పెద్దల సమస్యల కంటె న్యాయమూర్తి కనకదుర్గ పిల్లల హక్కుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. జిల్లాలో ఎక్కడ బాల్య వివాహలు జరిగినా, ఆడ పిల్లల విక్రయాలు జరిగినా సంబంధిత వ్యక్తుల ఇళ్లకు వెళ్లి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. నోటీసులు ఇచ్చి తన వద్దకు పిలిపించుకొని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించే అవకాశం ఉన్నప్పటికీ రాజీ మార్గమే రాజమార్గమని భావించి కౌన్సిలింగ్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నారు.

గత మార్చినెలలో సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో పర్యటించిన జిల్లా న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి కనకదుర్గ దృష్టికి పదవ తరగతి విద్యార్థుల సమస్య వచ్చింది. చాలా గ్రామాలకు బస్సు సౌరకర్యం లేదని, విద్యార్థులు ఐదు నుంచి పది కిలోమీటర్ల వరకు సొంత వాహనాలు లేదా కాలి నడకన పరీక్షాకేంద్రాలకు వెళ్లి పరీక్షలు రాస్తున్నారని తెలియడంతో ఆమె వెంటనే న్యాయ సేవకుల ద్వారా సర్వే జరిపించి 151 గ్రామాలకు బస్సు సౌకర్యంలేదని తేల్చారు. దీంతో అప్పటి కలెక్టర్ రోనాల్డ్ రోస్‌తో చర్చించిన ఆమె ఆయా గ్రామాల పిల్లలు పరీక్షలు రాసేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయించారు.

పోలీసులు, రెవెన్యూ అధికారులు తమ ప్రభుత్వ వాహనాల ద్వారా బస్సు సౌకర్యం లేని పిల్లలను పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు అవకాశం కల్పించారు. పేదలకు సత్వర న్యాయం అందించాలన్న లక్షంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థకు పూర్తిగా న్యాయం చేకూర్చడమే తన ప్రధాన కర్తవ్యమని కనకదుర్గ అన్నారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో చాలా మంది పేదలకేగాక ముస్లిం వధువులకు పెళ్లి సమయంలో మెహర్ పేరిట బ్యాంకులో రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయిస్తున్నారు. తలాక్ తీసుకొనే సందర్భంలో ఈ డబ్బు వారికే పోతుంది. ఈ చిన్న మొత్తంతో యువతి ఎలా జీవిస్తుందన్న ఉద్దేశంతో సంగారెడ్డి, సిద్డిపేట, మెదక్ జిల్లాల్లోని ఖాజీలతో (ముస్లిం యువతీ,యువకులకు వివాహాలు జరిపించే పెద్దలు) సమావేశం ఏర్పాటు చేసి కౌన్సెలింగ్ ఇచ్చామని అన్నారు.

ఇటీవల తాము ఒక యువతి పేరిట ఐదు లక్షలు, మరో యువతి పేరిట పది లక్షల రూపాయలు మెహర్ పేరిట డిపాజిట్ చేయించామని తెలిపారు. బాల్య వివాహాలు జరుగకుండా అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ముస్లిం యువతీ యువకులను జాగృతం చేశామని అన్నారు. మూడు జిల్లాల్లో 52 మంది పారా లీగల్ వలంటీర్లు పనిచేస్తున్నారని, వారి ద్వారా పేద ప్రజల్లో చట్టాల గురించి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. రైతుల ఆత్మహత్యల నివారణ కోసం ప్రత్యేకంగా పారా లీగల్ వలంటీర్లను నియమించి అప్పుల్లో ఉన్న రైతులకు కౌన్సెలింగ్ ఇప్చించామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కనకదుర్గ వివరించారు.