Home కరీంనగర్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

Karimnagarతొలి రోజు పెద్దపల్లి, గోదావరి బ్లూస్ జట్ల విజయం
గోదావరిఖని : గ్రామీణ స్థాయిలో ప్రతిభ గల క్రీడాకారులను వెలికితీసే లక్షంతో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సెలక్షన్ కం టోర్నమెంట్ బుధవారం గోదావరిఖని సింగరేణి స్టేడియంలో ప్రారంభమయ్యాయి. గోదావరిఖని వేదికగా జరిగే ఈ పోటీల్లో గోదావరిఖని, పెద్దపల్లి, మంథని డివిజన్లకు చెందిన 12 జట్లు పాల్గొంటుండగా, కరీంనగర్ వేదికగా జరిగే టోర్నమెంట్‌లో మరో 12 జట్లు పాల్గొంటున్నాయి. అండర్-25 వయస్సు క్రింద జరిగే ఈ టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేసి తద్వారా తెలంగాణలోని అన్ని జిల్లాల జట్లతో లీగ్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఈ పోటీలను మోజెస్ కరుణాకర్, వీర్ల సంపత్, బేబి శ్రీనివాస్, జగదీశ్, శ్రావణ్, గంగాధర్, ఇంతియాజ్, వెంకట్, నాగరాజులు పర్యవేక్షిస్తున్నారు. కాగా బుధవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో పెద్దపల్లి శ్రావణ్ ఎలెవన్, గాంధీ డిగ్రీ కళాశాలల జట్లు తలపడగా మొదట బ్యాటింగ్ చేసిన గాంధీ డిగ్రీ కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్ చేసిన పెద్దపల్లి జట్టు కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్షాన్ని ఛేదించి విజయం సాధించారు. గాంధీ జట్టులో ఫయాజ్ 48 పరుగులు చేసి ఒక వికెట్ తీసుకోగా, పెద్దపల్లి జట్టులో ఫైసన్ 38, కషేక్ 32 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. కాగా రెండవ మ్యాచ్‌లో గోదావరి బ్లూస్, గౌతమీసాయి డిగ్రీ కళాశాల జట్లు తలపడగా మొదట బ్యాటింగ్ చేసిన గోదావరి బ్లూస్ నిర్ణీత 16 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 176 పరుగులు సాధించగా జట్టులో అభిలాష్ 84, అరుణ్ 32, కన్నా 32 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన గౌతమీసాయి జట్టు 61 పరుగులకు ఆలౌట్ అయింది. బ్లూస్ జట్టులో శివ, నరేందర్‌లు రెండేసి వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని చేకూర్చినట్లు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కోమల్ల మహేష్ కుమార్ తెలిపారు.