Home కలం తెలుగులో దివ్యాంగ సాహిత్యం

తెలుగులో దివ్యాంగ సాహిత్యం

kalam

ఇది అస్తిత్వాల యుగం. ఏ వర్గం, సమాజమయితే నిరాదరణకు, నిర్లక్ష్యానికి, చిన్నచూపుకు గురువుతుందో ఆ వర్గము, సమాజము ఆత్మగౌరవాన్ని నిలబెట్టే క్రమంలో నేడు అస్తిత్వ పోరాటాల్ని చేస్తున్న సందర్భం. ఈ పోరాటంలో ఆయా వర్గాలను, సమూహాలను ఒకే భావజాలంలోకి తీసుకరావడం, వారిలో ఎరుకను, స్పృహను రగిలించి, వారిని హక్కుల పరిరక్షణ వైపుగా కార్యోన్ముఖులను చేయడం, తద్వారా ఆ అస్తిత్వానికి సామాజిక గుర్తింపు తీసుకరావడానికి ఇతర వర్గాల, సమూహాల సానుభూతి సహకారంతో ఐక్య కార్యాచరణలో కల్సి వచ్చే విధంగా భావజాల వ్యాప్తి జరుగుతున్నది. వీటన్నటికి అక్షరాలుతోడై ఆయా వర్గాలకు, సమూహాలకు అనుగుణంగా సాహిత్యం సృజించబడుతున్నది. ఈ క్రమంలోనే తెలుగు సాహిత్యంలో దళిత, స్త్రీ, మైనార్టీ, బిసి అస్తిత్వానికి సంబంధించిన కవిత్వం వివిధ ప్రక్రియల్లో దీర్ఘకాలికంగా కొనసాగుతూ వారి ఆత్మగౌరవం నిలబెట్టుకొనే ప్రయత్నం చేస్తుంది. అదే క్రమంలో నేడు గత దశాబ్దం కాలం నుండి నూతనంగా దివ్యాంగ సాహిత్యం వివిధ ప్రక్రియలల్లో చోటు చేసుకుంటూ వారి సమూహానికి, వర్గానికి కొమ్మ కాస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నది. ఏ భావజాల వ్యాప్తికైనా సాహిత్యం ప్రధానాంశంగా ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటి సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకొని నేడు వివిధ సాహిత్య ప్రక్రియలల్లో దివ్యాంగ సాహిత్యం మన ముందుకు వస్తున్నది. తెలుగు ప్రాచీన సాహిత్యంలో దివ్యాంగులకు సంబంధించిన సాహిత్యం మనకు అంతగా కనిపించనప్పటికి పురాణ గాథల్లో అక్కడక్కడ కొన్ని పాత్రల ద్వారా వారి ఉనికిని మనం గమనించవచ్చు.

భాగవతంలోని కుబ్జ పాత్ర, మహాభారతంలోని ధృతరాష్ర్టుడు, అష్టావకృడి పాత్రలు, సూర్యుని రథ సారథి అనూరుడు తదితర పాత్రలు ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఆధునికి సాహిత్యంలో గుర్రం జాషువా, దేవులపల్లి కృష్ణ శాస్త్రి మొదలగు కవులు దివ్యాంగ సాహిత్యాన్ని సృజంచారు. అనంతరం నేడు ఎంతోమంది కవులు, రచయితలు, సామాజిక బాధ్యతతో దివ్యాంగ సాహిత్యాన్ని సృజిస్తూ వారి హక్కులు, ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే కాకుండా, వారి అస్తిత్వాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుండడం నిజంగా అభినందించవలసిన విషయం. సమాజానికి మేలు చేకూర్చేది, మానవతకు పట్టం కట్టేది, సమభావనను కలిగించేదే నిజమైన సాహిత్యమైనప్పడు అ దిశలోనే నేడు దివ్యాంగ సాహిత్యం మనముందుకు కదులుతున్నది. తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలో ఉన్నటువంటి కవిత్వం, కథ, నవల, పాట, నాటిక తదితర అంశాల్లో దివ్యాంగ సాహిత్యం మనకు ప్రస్పుటంగా కనిపిస్తుంది.దివ్యాంగ సాహిత్యంలో ‘కవిత్వం ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ఆర్తితోనూ, ఉద్వేగంతోనూ మనసు మూలాల్లోకి చొచ్చుకెళ్ళి ఘనీభవించిన మనసులను కరిగించే శక్తి కవిత్వానికి ఉంది. అందుకే నేడు అనేక మంది కవులు ఈ పక్రియలో దివ్యాంగ సాహిత్యాన్ని సందర్భానుసారంగా సృష్టిస్తూ దివ్యాంగ సమాజానికి అండగా నిలుస్తున్నారు. అయితే గత దశాబ్దం పైగా దివ్యాంగలకు సంబంధించిన రచనలు సాహిత్యంలో చోటు చేసుకున్నా సంపుటాలుగా మాత్రం అర దశాబ్దం కాలం నుండే ఎక్కువగా ప్రచురణకు నోచుకోవడం ఆలోచించవలసిన విషయము. వీటిలో నెల్లూరు జిల్లాకు చెందిన కవి మోపూరు పెంచల నర్సింహ్మం వెలువరించిన “వెలుగుపూలు” (2007), అనంతపురం జిల్లాకు చెందిన కవి కేరే జగదీష్ వెలువరించిన “రాత్రి సూర్యుడు” (2012) రచనలు అంధుల జీవనశైలి, వారి స్థితిగతులను తెలిపే దీర్ఘకావ్య సంపుటులుగా వెలువడ్డాయి. అదే విధంగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పరిశోధన విద్యార్థి చిక్కా హరీష్ కుమార్ వెలువరించిన “నేనైతే వికలాంగున్నే” (2013), వరంగల్ జిల్లాకు చెందిన కవి, ఉపాధ్యాయుడు బిల్ల మహేందర్ వెలువరించిన “గెలుపు చిరునామా?’ (2015), హైదరాబాద్‌కు చెందిన సామాజిక సేవకురాలు, రచయిత్రి వెలువరించిన “ధిక్కారనానీలు” (2013) మొదలగు స్వీయ సంపుటాలు దివ్యాంగుల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తాయి. ఆ తర్వాత దివ్యాంగులలో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నంలో భాగంగా వందమంది కవులు రాసిన వంద కవితలతో బిల్ల మహేందర్ సంపాదకత్వంలో వచ్చినటువంటి “కాలాన్ని గెలుస్తూ” (ప్రత్యేక ప్రతిభావంతులపై కవితా సంకలనం) సంకలనం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మైలురాయిగా చెప్పవచ్చు. ఒక ఆత్మవిశ్వాసం ప్రోదిచేసే లక్ష్యంతో ప్రయత్నపూర్వకంగా వచ్చినటువంటి ఈ కవితా సంపుటి దివ్యాంగులపై వచ్చిన మొట్టమొదటి కవితా సంకలనంగా దీనికి ముందు మాట రాసినటువంటి ప్రస్తుత తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొనడం విశేషం. తర్వాత 2015 లో టింగరి వెంకటేశ్ సంపాదత్వంలో వెలువడిన “నన్ను మాట్లాడనివ్వండి” కవితా సంకలనం, వాటితో పాటుగా అప్పడప్పుడు దివ్యాంగ సాహిత్యాన్ని సృజిస్తున్నటువంటి కత్తుల బాలక్రిష్ట (నల్గొండ), సిరిసిల్ల రాజేశ్వరీ (సిరిసిల్లా) తదితర కవులు దివ్యాంగ సాహిత్యాన్ని సృజిసూ వారి ఉనికిని చాటుతున్నారు. అంతేగాకుండా డా.నందిని సిధారెడ్డి ‘అవిటితనం, ఆచార్య సత్యనారాయణ “దేహనేత్రాలు”, డా. నలిమెల భాస్కర్ ‘గుడ్డివాళ్ళ చూపు’, జూలూరి గౌరి శంకర్ చూపు, అన్వర్ “గిఫ్టెడ్ చిల్డ్రన్ కవితలు వారి స్వీయ కవితా సంపుటాల్లో ప్రచురించి దివ్యాంగ సమాజానికి అండగా నిలుస్తున్నారు.

కథకు సంబంధించిన ప్రక్రియలను గమనించిప్పడు మనకు ఎక్కడా దివ్యాంగ సాహిత్యానికి సంబంధిత స్వీయ కథా సంపుటాలు కనిపించవు. కాని ఆయా కవులు వారి స్వీయ సంపుటాలలో అక్కడక్కడ దివ్యాంగ సాహిత్యానికి సంబంధించిన కథల్ని వెలువరించడం మనం చూడవచ్చు. కథా సంకలనాలను పరిశీలించినట్లయితే వరంగల్ జిల్లాకు చెందిన వేముల ఎల్లయ్య సంపాదకత్వంలో వచ్చిన “అవిటి కథలు” (2012), కృష్ణా జిల్లాకు చెందిన అసిలేటి నాగరాజు సంపాదకత్వంలో వచ్చిన “నేను సైతం” (2016) కథా సంపుటాల్లో దివ్యాంగుల జీవన విధానము, సమాజములో వారి నడవడి, వాటితో పాటుగా కాలా నుగుణంగా దివ్యాంగుల సమాజంలో వస్తున్న మార్పుల్ని మనం చూడవచ్చు. అంతేగాకుండా హైదరాబాద్ కు చెందిన గురజాడ శోభ పేరిందేవి, శివలెంక నాగఉదయలక్ష్మి, ప్రకాశం జిల్లాకు చెందిన పెండ్యాల గాయత్రి తదితరులు దివ్యాంగ సాహిత్యానికి సంబంధించిన కథల్ని రాస్తున్నారు. నవల ప్రక్రియలో మోపూరి పెంచల నర్సింహ్మం “వెన్నల వర్షం”, యుద్ధనపూడి సులోచన ‘ఆరాధన’ వేదన శకుంతల ‘ఆర్తి’, శివలెంక నాగఉదయలక్ష్మి “జీవన రేఖలు” (అముద్రితం) తదితర నవలల్లో దివ్యాంగుల చుట్టూ తిరిగే పాత్రలే కాకుండా దివ్యాంగులే ప్రధాన పాత్రధారిగా నడిచే విధానాల్ని చూడవచ్చు. ఇవే కాకుండా సంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ కవి, గాయకులు, స్ఫూర్తి (ఇంద్రారెడ్డి) గారు దివ్యాంగ జీవన విధానాలు, వారి హక్కులు, ఆత్మగౌరవంపై దాదాపుగా ఇప్పటికే 80 పైగా పాటలు రాసి ప్రచురించడం చేశారు. అదేవిధంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వెలువడ్డ దాదాపు పది పాటలు క్యాసెట్ రూపంలో లభ్యమవుతున్నాయి. దీనితో పాటుగా వరంగల్ జిల్లాకు చెందిన గడ్డం కేశమూర్తి “వికలాంగుల జీవన విధానం”, రాజశేఖర్, జానకి సంపాదకీయంలో వచ్చినటువంటి “వికలాంగుల విద్య- జీవన విధానము’ తదితర వ్యాస సంకలనాలు దివ్యాంగుల సమస్యల్ని తెలియజేస్తాయి. చివరిగా 1995 వికలాంగుల చట్టం ప్రకారం సమాజంలో అన్ని వర్గాల వారు ఏ విధంగానైతే మావన హక్కుల్ని స్వేచ్ఛను అనుభవిస్తున్నారో అట్లాగే దివ్యాంగులు కూడా వాటిని అనుభవించాలి. వారి అస్తిత్వాన్ని పరిపూర్ణంగా కాపాడుకోవాలి. దీని కోసం తెలుగు సాహిత్యంలో వివిధ అస్తిత్వాలు ఏ విధంగానైతే గుర్తించబడి వారి వారి ప్రయోజనాలను కాపాడుతున్నాయో అదేవిధంగా దివ్యాంగ సాహిత్యం కూడా తెలుగు సాహిత్యంలో గుర్తించబడి, వివిధ ప్రక్రియలలో వస్తున్నటువంటి దివ్యాంగ సాహిత్యాన్ని పూర్తిగా వెలుగులోకి తీసుకొని రావాలి. అప్పడే వారి ప్రయోజనాలను, అస్తిత్వాన్ని కాపాడినట్లవుతుంది.

1995 వికలాంగుల చట్టం ప్రకారం సమాజంలో అన్ని వర్గాల వారు ఏ విధంగానైతే మావన హక్కుల్ని స్వేచ్ఛను అనుభవిస్తున్నారో అట్లాగే దివ్యాంగులు కూడా వాటిని అనుభవించాలి. వారి అస్తిత్వాన్ని పరిపూర్ణంగా కాపాడుకోవాలి. దీని కోసం తెలుగు సాహిత్యంలో వివిధ అస్తిత్వాలు ఏ విధంగానైతే గుర్తించబడి వారి వారి ప్రయోజనాలను కాపాడుతున్నాయో అదేవిధంగా దివ్యాంగ సాహిత్యం కూడా తెలుగు సాహిత్యంలో గుర్తించబడి, వివిధ ప్రక్రియలలో వస్తున్నటువంటి దివ్యాంగ సాహిత్యాన్ని పూర్తిగా వెలుగులోకి తీసుకొని రావాలి.

                                                                                                                                            బిల్ల మహేందర్ 9177604480