Search
Saturday 21 July 2018
  • :
  • :
Latest News

కాల్తీ కాటు

Do not care agricultural officers

అనుమతి లేని నర్సరీలు
దిగుబడిపై తీవ్ర ప్రభావం
నష్టపోతున్న రైతులు
పట్టించుకోని వ్యవసాయ అధికారులు 

మన తెలంగాణ/ఖమ్మం : ప్రతి యేటా అన్నదాతలు కల్తీ కాటుకు గురవుతున్నా సరైన చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. వరుసగా కల్తీ విత్తనాల కారణంగా దిగుబడులు తగ్గి నష్టపోతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు పరిశీలనలు, విచారణలంటూ హడావుడి చేయడం తప్ప ఫలితం ఉండడం లేదు. ఇటీవల కాలంలో నర్సరీలలో పెంచిన మిరప నారును రైతులు ఉపయోగిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 200కు పైగా మిర్చి నారు పెంచే నర్సరీలు ఉన్నాయి. మిర్చి నర్సరీ యాజమానులు నర్సరీ ఏర్పాటుకు ముందు నారు పోసేటప్పుడు ఖచ్చితంగా అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అనుమతులు ఇవ్వాల్సి ఉండగా కార్యాలయాల్లో పని జరిగిపోతుంది. గతేడాది కొందరు నర్సరీ యాజమానులు కల్తీ విత్తనాలతో మిర్చి నారు పెంచడంతో కాతా,పూత లేకుండా పోయింది. నవంబరు మాసం గడచినా పూత, కాత లేకపోవడంతోరైతులు ఆందోళనకు దిగారు. రైతులు రోడ్డెక్కడంతో నర్సరీ యాజమానులు పెద్ద మనుషుల సమక్షంలో నష్టపరిహారం చెల్లించగా మరి కొందరు కన్పించకుండా పోయారు. ఉమ్మడి జిల్లాలో గతేడాది 75వేల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేయగా 20వేల ఎకరాల్లో పంట కల్తీ భారీనపడింది. గడచిన ఏడాదే కాదు వరుసగా మూడేళ్ల నుంచి ఇదే పరిస్థితి. ప్రతి యేటా దిగుబడి తగ్గడం, కాతా, పూత లేకపోవడంతో పలుమార్లు ఆందోళనలు చేయడం జరిగింది. నర్సరీలలో పెంచిన నారు ద్వారా మిర్చిలో అధిక దిగుబడులు వస్తాయన్న ఆశతో రైతులు నర్సరీలపై ఆధారపడుతున్నారు. ఏ రైతుకు ఆ రైతు నర్సరీలను పెంచడం కూడా సాధ్యం కాదు. ఖర్చుతో కూడుకున్న పని కావడంతో నర్సరీలపై ఆధారపడుతున్నారు. మిర్చి నారు విక్రయం జరిపే నర్సరీల ద్వారానే ఉమ్మడి జిల్లాల్లో కోట్లాది రూపాయల వ్యాపారం నడుస్తుంది. గతంలో మాదిరి మిర్చి విత్తనాలు నాటే పరిస్థితి లేదు. దీనిని ఆసరగా చేసుకుని నర్సరీ వ్యాపారులు అక్రమ పద్దతులకు పాల్పడుతున్నారు. వ్యవసాయ అధికారులు నర్సరీ వద్ద సదుపాయాలు ఏ రకం విత్తనాలు నాటారు, ఎరువుల వాడకం ఏంటి అనే విషయాలను పరిశీలించడం లేదు. జిల్లాలో నర్సరీల పెంపకం వ్యవసాయాధికారులకు ఆదాయ వనరుగా మారింది. దీంతో యాజమానులు ఏం చెబితే దానికి తల ఊపుతున్నారు. దీంతో రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులైనా నర్సరీలపై దృష్టిసారించి కల్తీలను అరికట్టగలిగితే మిర్చి రైతులకు మేలు జరుగుతుంది.

Comments

comments