Home రాజన్న సిరిసిల్ల మహిళల పట్ల వివక్షత తగదు

మహిళల పట్ల వివక్షత తగదు

మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉస్తేల సృజన

women

 సిరిసిల్ల:  భారతదేశంలో మహిళల పట్ల తీవ్ర వివక్ష కొనసాగుతుందని చివరికి ప్రభుత్వం గ్రామాల్లో ఉపాధి కోసం చేపడుతున్న ఉపాధిహామీ పనుల్లో కూడా సమానపనికి, సమాన వేతనం చెల్లించకపోవడం అత్యంత బాధాకరమని భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉస్తేల సృజన అన్నారు. సమాన పనికి వివక్ష లేకుండా సమాన వేతనం చెల్లించాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కార్మిక భవనంలో నిర్వహించిన రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి భారత జాతీయ మహిళా సమాఖ్య ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

దేశంలో దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల మహిళలకు రక్షణ లేకుండా పోతుందన్నారు. వారిపై నిరంతరం అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను చేపడుతామని ఆమె హెచ్చరించారు. స్కీం వర్కర్లైన ఆశాలు, అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారికి కనీస వేతనంగా నెలకు 18000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిర్భయ చట్టాన్ని అమలు చేయాలని, వరకట్న దురాచారాన్ని అరికట్టాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలు స్థానిక సమస్యలపై సమర్ధవంతంగా ఉద్యమాలు చేపట్టాలని మహిళల పట్ల చూపుతున్న వివక్షను ప్రశ్నించే తత్తం, నిలదీసే తత్తాన్ని అలవర్చుకోవాలన్నారు. స్థానిక సమస్యలే వేదికగా ఉద్యమాలు నిర్మించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్లె సత్తవ్వ, అరకొండ లక్ష్మి, కెవి అనసూర్య, సుంకెనపల్లి శాంతవ్వ, ఊశకోయల లక్ష్మి, మౌలానాబీ, ఎలగొండ మణవ్వ, ఎస్‌కె రఫీక, ఆకుల లలిత, జక్కని సత్తవ్వ, కోడం ప్రమీల తదితరులు పాల్గొన్నారు.