Home దునియా అన్నం తిన్నాక ఇలా చేయకండి

అన్నం తిన్నాక ఇలా చేయకండి

తింటే ఆయాసం తినకపోతే నీరసం అని సామెత..! అధికాహారం ఎలా అనర్థదాయ కమో, అల్పాహారం, నిరాహారం కూడా అంతే అనర్థకం. ఆరోగ్యం బాగుండాలంటే ఆహార, విహారాలు బాగుండాలని పెద్దలు చెప్పినమాట. తినడంలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో  తిన్నాక కూడా అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

Meals

వాక్ ఎ మైల్ ఆఫ్టర్ ఎ మీల్ అన్న సామెతను గుర్తు చేసుకుంటూ చాలా మంది అన్నం తిన్నాక వాకింగ్ కు బయల్దేరతారు. అలా చేస్తే నిండు నూరేళ్ళు గుండ్రాయిలా బతుకుతామని చెబుతుంటారు. తినగానే నడక లంకించుకుంటే జీర్ణవ్యవస్థ కుదురుగా ఉండదు. ఫలితంగా అన్నంలో ఉన్న పోషకవిలువలను జీర్ణించుకోడానికి వీలులేకుండా పోతుంది. అంతగా వాకింగ్ చేయాలనుకుంటే తినకముందు చేయండి.ఒకవేళ ఆకలికి తట్టుకోలేక తింటే కొంపలేం మునిగిపోలేదు. ఒక గంట ఆగి వాకింగ్ చేయండి. తిన్న వెంటనే హడావుడి పడి రొప్పుతు రోదుతు వాకింగ్‌కు వెళ్ళవద్దు.

* తిన్నాక వ్యాయామం చేయకూడదు. ఇంట్లోనే అయినా హడావుడిగా అటు ఇటు నడవవద్దు.
* అన్నం తిని గట్టిగా చెయ్యికూడా కడుక్కోకుండానే ఏదో ఒకటి చిరుతిండి మొదలెట్టేస్తారు కొందరు. ఆరోగ్యపరంగా ఎంతో జాగ్రత్తగా ఉంటున్నామనుకునే వారు అన్నం తినగానే ఏదో ఒక పండు తింటారు. అలా చేయడం మంచిదికాదు. అందువల్ల కడుపులో ఉబ్బరం కలుగుతుంది. ఎక్కిళ్ళు పట్టుకున్నాయంటే చాలా చాలా ఇబ్బందులొస్తాయి. ఆరోగ్య కాంక్ష ఉందనుకుంటే అన్నం తినడానికి గంటా రెండు గంటల ముందు తినండి. ముందే తింటే అన్నం తినలేమనుకునేవారు అన్నం తినడం అయ్యాక గంటా రెండు గంటలయ్యాక తినండి.
* అన్నం తినగానే టీ తాగే అలవాటు ఉంటుంది చాలా మందికి. అలా చేయడం కూడా తప్పే! సాయంత్రం ఆరింటప్పుడు చాయ్/కాఫీ తాగితే ఆకలివేయదు. నిద్రపట్టదు.. 7.308గంటలప్పుడు అన్నం తినలేం..అనే వారు అన్నం తిన్నాకా గ్లాసుడు చాయ్/కాఫీ తాగుతుంటారు. అలా తాగితే రిలాక్సింగ్‌గా ఉంటుందని, వేడి వేడిగా తాగుతాం కనుక తిన్నది చక్కగా అరుగుతుందని అంటారు. కానీ ఇది నిజంకాదు. ముందే మనం తినే ఆహారంలో ఉండే ప్రోటీన్ల శాతం తక్కువ. దానికి తోడు అన్నం తినగానే టీ/కాఫీ తాగితే ఆ కాస్త ప్రోటీన్ గట్టిపడిపోయి అరగక మొరాయిస్తుంది. అందువల్ల అది అరగడం కష్టమైపోతుంది. జీర్ణాశయం మీద అనవసరంగా ఒత్తిడి పడుతుంది. ఫలితంగా దాని సామర్థం త్వరగా తగ్గిపోతుంది.
* సుష్ఠుగా భోంచేశాక అబ్బా..చాలా ఎక్కువైపోయిందంటూ చాలామంది ప్యాంట్ బెల్ట్‌ను లూజ్ చేస్తారు లేదా బిగగట్టిన లుంగీని వదులుచేసుకుంటారు. వాళ్ల ఆలోచన సంగతెలా ఉన్నా అలా చేయడం వల్ల అన్నవాహికలో ఇబ్బందులు వస్తాయి.
* అన్నం తిన్న వెంటనే స్నానం చేయకూడదు. ఆఫీసు నుంచి వచ్చే వాళ్ళు ఆకలి మంటలతో ఆవురావురంటూ ఇంటికి వచ్చిపడతారు. అలసటగా ఉన్నా, ఒళ్ళంతా చెమటతో జిడ్డెత్తిపోతున్నా ఏదోఒకటి తినడానికే సిద్ధపడిపోతుంటారు. స్నానం చేసి రమ్మని పోరుతున్నా తిన్నాక చేస్తానంటూ భోజనానికి కూచుండిపోతారు. తినడం అయ్యాక స్నానానికి తయారవుతారు. తిన్న వెంటనే స్నానం చేయకూడదు అంటున్నా వినరు. స్నానం చేసేసి పడుకోవాలి..నిద్ర దంచేస్తోందంటారు. నిజానికి అలా చేయడం తప్పు. మనం అన్నం తిన్నాక ఒంట్లో ఉన్న నెత్తురంతా కడుపుదగ్గరకు వస్తుంది. తిన్న అన్నాన్ని జీర్ణంచేయడానికి జీర్ణవ్యవస్థకు ఈ రక్తం తోడ్పాటునందిస్తుంది. తిన్నవెంటనే స్నానం చేస్తే కడుపులోకి చేరవలసిన రక్తం కాళ్ళలోకి, పిక్కల్లోకి, చేతుల్లోకి, ఇతర శరీరాంగాలన్నిటిలోకి చేరుతుంది. అందువల్ల జీర్ణశక్తి డీలాపడుతుంది. ఫలితంగా అజీర్ణం పట్టుకునే ప్రమాదం ఉంది.
* చాలా మందికి ఇలా తినగానే అలా నిద్రపోవడం అలవాటు. ఇలా చేయడం కూడా మంచిదికాదు. మనం నిద్రలోకి జారిపోతే జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. ఫలితంగా గ్యాస్ పట్టుకునే ప్రమాదం ఉంది. గ్యాస్ రెండు రకాల కారణాల వల్ల వస్తుంది. 1. తిన్నది సరిగా అరగకపోతే గ్యాస్ వస్తుంది. దీనివల్ల పదేపదే తేన్పులు వస్తాయి. మాట్లాడుతుంటే కూడా మాటలకు మధ్య అడ్డుపడి గ్యాస్ బైటికి వస్తుంది. 2. తిన్నది అసలే అరగకపోతే పుల్ల తేన్పులు వస్తాయి. ఈ తేన్పులు చాలా ఇబ్బందిగా ఉంటాయి. కనుక తినీ తినగానే నిద్రకు ఉపక్రమించకండి.
* తినగానే మీ తండ్రో, అన్నో, తమ్ముడో, భర్తో సిగరెట్ తాగుతుంటే వద్దని చెప్పండి. సిగరెట్ తాగడం ఎప్పుడూ మంచిదికాదు. మరీముఖ్యంగా అన్నం తిన్న వెంటనే సిగరెట్ తాగడం అస్సలు మంచిదికాదు. ఈ సమయంలో సిగరెట్ ఒక్కటి తాగినా అది పది సిగరెట్లతో సమానంగా పనిచేస్తుంది. అందువల్ల త్వరగా క్యాన్సర్ బారిన పడే
ప్రమాదముంది.
* చాలా మంది అన్నం తినేముందు, తింటూ, తిన్నాక నీళ్ళు చాలా తాగుతుంటారు. అలా చేయడం మంచిదికాదు. అన్నం తినడానికి ముందు నీళ్ళు తాగితే తక్కువ తింటాం. అందువల్ల ఒళ్ళు బరువెక్కకుండా ఉంటుంది.. ఇది ఒక డైటింగ్ చిట్కా..అంటారు పిల్లలు. మరికొందరు ముద్ద మింగుడుపడాలన్నట్టుగా అన్నం తింటూ తరచు నీళ్ళు తాగుతుంటారు. అలా చేయడం వల్ల ఆహారం గట్టిగా ఒక ముద్దలా ఉండదు. కనుక జీర్ణించుకోడానికి చాలా టైమ్ తీసుకుంటుంది. అందుకని అలా చేసిన వారికి కడుపంతా ఉబ్బరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. తిన్నాక నీళ్ళు గ్లాసులకొద్దీ తాగడం కూడా మంచిదికాదు. అందువల్ల మనం తిన్న అన్నాన్ని జీర్ణంచేసుకోవాల్సిన జఠరాగ్ని పల్చబడిపోతుంది. అందువల్ల జీర్ణంచేసుకునే శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా అన్నం జీర్ణం కావడానికి చాలా టైమ్ తీసుకుంటుంది.తిన్నవారికి ఎప్పటికీ అరగక చాలా
చిరాకుగా, చీదరగా, ఆయాసంగా ఉంటుంది.