Home రంగారెడ్డి సమయం లేదు మిత్రమా దంచుకో.. సంపాదించుకో..!

సమయం లేదు మిత్రమా దంచుకో.. సంపాదించుకో..!

cartoon

*గడువు సమీపిస్తుండటంతో సంపాదనపై సర్పంచ్‌ల గురి
*అడ్డగోలుగా అనుమతుల పర్వం
*రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఫిర్యాదుల వెల్లువ
*నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్న వైనం

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :
దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కపెట్టుకోవాలన్న నానుడిని ప్రజాప్రతినిధులు ఆచరణలో అమలు చేస్తున్నారు. పవర్‌లో ఉన్నప్పుడు నాలుగు రాళ్లు వేనకేసుకోవాలని భవిష్యత్‌లో రాజకీయం చేయాలంటే ఆర్థికంగా నిలదొక్కుకుంటేనే సాధ్యమని నిర్ణయానికి వచ్చిన సర్పంచ్‌లు చెలరేగిపోతున్నారు. రంగారెడ్డి జిల్లాలో 415, మేడ్చల్ జిల్లాలో 77, వికారాబాద్ జిల్లాలో 367 గ్రామ పంచాయతీలు ఉండగా మెజారిటీ సర్పంచ్‌ల పదవీకాలం ఆగస్టుతో ముగియనుంది. శివారులోని పంచాయతీలను నగరంలో విలీనం చేయడం లేదా నగర పంచాయతీలుగా మార్చడం దాదాపు ఖాయం కావడంతో ప్రస్తుతం కొనసాగుతున్న సర్పంచ్‌లే ఆయా గ్రామాలకు చివరి సర్పంచ్‌లుగా మారనున్నారు. సర్పంచ్‌లుగా ఎన్నికయిన ప్రారంభంలో గ్రామాల అభివృద్దితో పాటు ప్రజాసేవలో తరించినా నిధులు పుష్కలంగా లేకపోవడం మూలంగా జేబులు ఖాళీ అయ్యాయని ఇప్పుడు పుష్కలంగా ఉన్న నిధులను ఆరు నెలలో ఖాళీ చేసి తాము పెట్టిన ఖర్చుతో పాటు అదనంగా నాలుగు రాళ్లు సంపాదించుకోవాలని, కొత్త సర్పంచ్‌లకు ఖాళీ ఖజానా అప్పగించడానికి తయారవుతున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని శివారు మండలాల్లో గత ఆరు నెలలుగా రియల్ వ్యాపారం జోరు మీద ఉండటంతో గ్రామ పంచాయతీలకు నిధులు పుష్కలంగా రావడంతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులకు సైతం భారీగానే జేబులు నిండుతున్నాయి. కొంత మంది సర్పంచ్‌లు తమ గ్రామాల్లో ఎక్కడ లేఅవుట్ వెలసినా అనుమతుల పేరుతో అడ్డగోలుగా వసూళ్లు చేయడంతో పాటు ప్రతి లేఅవుట్‌లో స్థాయికి తగ్గట్టుగా ఐదు వందల నుంచి వేయి గజాల వరకు తమ బంధుమిత్రుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుని అనుమతులు ఇస్తున్నారు. మాజీలుగా మారకముందే కావలసిన వాటికి అనుమతులు జారీచేయడంతో పాటు కావలసిన రికార్డులను సరిచేసుకుని అవసరమైన వాటిని ఇంటికి తరలించడానికి సైతం ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. గ్రామ పంచాయతీల నిధుల వినియోగంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన పంచాయతీ అధికారుల పర్యవేక్షణ లోపం క్రింది స్థాయి అధికారులు మిలాఖత్ మూలంగా అడ్డగొలుగా నిధులను వినియోగిస్తున్న వైనం వెలుగు చూస్తున్న కేవలం నామమాత్రంగా సర్పంచ్‌లపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవడం తప్ప గ్రామ కార్యదర్శి, ఇఓఆర్‌డిలపై చర్యలు తీసుకుంటున్న అనవాళ్లు మచ్చుకైన కనిపించిన పాపాన పోవడం లేదు. మేడ్చల్ జిల్లాలో కార్యదర్శిలపై చర్యలు తీసుకోగా రంగారెడ్డి జిల్లాలో మాత్రం కాసుల మత్తులో అలాంటి చర్యలకు సిఫార్సు చేసిన దాఖలాలు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫిర్యాదుల వెల్లువ.. చర్యలు నామమాత్రమే
గ్రామ పంచాయతీ సర్పంచ్‌లపై పిర్యాదుల వెల్లువ కొనసాగుతుంది. శివారు పంచాయతీలలో అనుమతుల పేరుతో అడ్డగొలు దందా సాగుతుందని కలెక్టర్‌లకు, పంచాయతీ అధికారులకు వరుస పిర్యాదులు అందుతున్నాయి. ప్రజావాణిలో సైతం గ్రామాల్లో జరుగుతున్న అక్రమ దందాలపై పిర్యాదులు వస్తున్న పంచాయతీ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శిలు కలసి అక్రమ లేఆవుట్‌లు, నిర్మాణాలకు సహకరిస్తున్నారని పంచాయతీ సభ్యులు ప్రజావాణిలో పిర్యాదు చేసి ఆరు నెలలు దాటిన ఇంతవరకు కనీస విచారణ నిర్వహించిన సందర్బాలు సైతం రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో పంచాయతీ అధికారులు కొన్ని గ్రామ పంచాయతీలలో సాగుతున్న అక్రమాలపై విచారణ నిర్వహించి సర్పంచ్‌లను సస్పెండ్ చేస్తు ఆదేశాలు జారీచేసిన వారం రోజులలో సచివాలయం నుంచి లేదా కోర్టు నుంచి స్టే ఆర్డర్‌లు రావడం పరిపాటిగానే మారింది. రెండు రోజుల క్రితం గండిపేట్ మండలం బండ్లగూడ గ్రామ సర్పంచ్ హరిక్రిష్ణను సస్పెండ్ చేయడంతో పాటు 65 లక్షలు రికవరికి ఆదేశాలు జారీచేశారు. గతంలో సైతం పదిమంది వరకు సర్పంచ్‌లపై ఇలాంటి చర్యలు తీసుకున్న రికవరి సంగతి దేవుడేరుగు తిరిగి పదవి అనుభవిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో మరో పాతిక మంది సర్పంచ్‌లకు నోటిసులు అందచేసిన అక్రమాల దందా మాత్రం రోజు రోజుకు పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడ తగ్గిడం లేదు. ఉన్నతాధికారులు కార్యాలయాలను వదిలి రంగారెడ్డి జిల్లాలోని గండిపేట్,శంషాబాద్,మొయినాబాద్, మహేశ్వరం, కందుకూర్, ఫరూక్‌నగర్, కొత్తూర్, ఇబ్రహింపట్నం, హయత్‌నగర్ మండలాల్లో ఒక్కరోజు పర్యటిస్తే అక్రమ లేఆవుట్‌ల జాతరతోపాటు వాటికి అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్న సర్పంచ్‌లు, కార్యదర్శిల బాగోతం బయటకు వస్తుంది. మేడ్చల్ జిల్లాలోని పంచాయతీలలో సైతం ఇలాంటి పరిస్థీతులు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలు సకాలంలో జరపడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు సాద్యమైనంత త్వరగా సర్పంచ్‌ల చెక్‌పవర్‌కు చెక్ పెట్టి నిధులు దుర్వీనియోగంను అడ్డుకోవడానికి సైతం ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్దం చేశారని సంక్రాంతి పండుగ అనంతరం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.