Home తాజా వార్తలు ఉండవల్లిని మరో బషీర్‌బాగ్ చెయొద్దు…

ఉండవల్లిని మరో బషీర్‌బాగ్ చెయొద్దు…

Pawan-Kalyan

అమరావతి: ల్యాండ్ పూలింగ్ నుంచి ఉండవల్లి గ్రామానికి మినహాయింపు ఇవ్వాలని స్థానిక రైతులు డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం ఉండవల్లిలో రైతులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. రోడ్డు నిర్మాణం పేరుతో ఉండవల్లి భూములను కాజేయాలని టిడిపి ప్రభుత్వం చూస్తోందని  రైతులు మండిపడ్డారు. ల్యాండ్ పూలింగ్ అడ్డుకునే శక్తి కేవలం పవన్‌కు మాత్రమే ఉందని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 1200 అడుగుల రోడ్డు ఉండవల్లి మీదుగా వేస్తామనడమనేది తమని వేధించడమేనని రైతులు వాపోయారు. పవన్ చెప్పారని ఆనాడు టిడిపికి ఓటేశామని, తమ భూములను కాపాడాల్సిన బాధ్యత పవన్‌దేనన్నారు.

అనంతర పవన్ సమావేశంలో మాట్లాడారు. బలవంతంగా భూములు లాక్కుంటే ఊరుకునేదిలేదని, ఎంతటిపోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భూములు తీసుకుంటే సరైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బలవంతపు భూసేకరణను అంగీకరించేదిలేదని, రైతులు భూములు ఇస్తేనే ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు భూములిచ్చిన రైతులు.. పరిహారం కోసం ఇవాళ్టి వరకు ఎదురుచూస్తున్నారని దుయ్యబట్టారు. రైతులకు ఇష్టం లేకుండా భూములు తీసుకుంటే… వారికి అండగా ఉండి పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ సభలు పెట్టి అందరి అనుమతితో భూములు తీసుకోవాలని, రైతుల నుంచి బలవంతంగా భూమిని లాక్కుంటే పోరాటం చేస్తానని,  మరో బషీర్‌బాగ్‌ను చేయాలనుకుంటే… పోలీసుల తూటాకు ముందు తన గుండెను చూపుతానని అభయమిచ్చారు. ప్రభుత్వం భూములను కొద్దిమంది చేతిలో పెట్టడాన్ని జనసేన వ్యతిరేకిస్తుందన్నారు.