Home ఆఫ్ బీట్ “కళలను కలుషితం చేయొద్దు”

“కళలను కలుషితం చేయొద్దు”

టెలివిజన్‌లోని కొన్ని చానెళ్లలో పిల్లల డాన్స్ కార్యక్రమాలు వస్తుంటాయి. వాటిలో  సినిమా పాటలకు నృత్యం చేస్తున్న పిల్లలే కనిపిస్తుంటారు. ఒక్కరు కూడా మన సంప్రదాయ నృత్యంగానీ, మన కీర్తనలకు నృత్యం చేయడం గానీ  చేయరు. ఇంచుమించు నృత్య కార్యక్రమాలు టీవీలలో కనుమరుగయ్యాయంటే అతిశయోక్తి కాదేమో. చిన్న పిల్లలు కురుచ బట్టలతో అశ్లీల నృత్యాలు చేస్తుంటే…అభినందించే జడ్జిలు, ఆనందపడిపోయే తల్లిదండ్రులు ఉండటం మన దురదృష్టం.. చిన్న వయసులోనే తమ పిల్లలు సెలబ్రిటీలు అవ్వాలనే తపనతో కొంతమంది పేరెంట్స్ ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి వాటిని పూర్తిగా వ్యతిరేకిస్తూ, నృత్య పాఠశాలను స్థాపించి చిన్నారులకు కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు రాధికాశ్రీనివాస్. సినిమా పాటలకు నృత్యం చేయించడాన్ని అస్సలు పోత్సహించరు. అఖిలతో రాధిక తన మనోభావాలను పంచుకున్నారు. 

Arts

నృత్య పాఠశాల పెట్టాలనే ఆలోచన మా పాప తన్మయశ్రీ వల్ల వచ్చింది. నాకు వచ్చిన నృత్యాన్ని తనకు నేర్పిస్తుండగా, చుట్టుపక్కల వాళ్లకు తెలిసి వాళ్ల పిల్లల్ని కూడా నా దగ్గర కు తీసుకొచ్చేవారు. అలా వచ్చే చిన్నారులు ఎక్కువ అయ్యేసరికి స్కూల్ పెట్టాను. మా గురువుగారు ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి. వెంపటి చినసత్యం గారి శిష్యులు. ఆయన తన చివరి క్షణం వరకు పిల్లలకు ఉచితంగా నృత్యం నేర్పించారు. నాకు ఆయనే ఆదర్శం. నామినల్ ఫీజులతో నృత్యం నేర్పిస్తున్నాను.
పాఠశాలల్లోని ఫేర్‌వెల్ పార్టీ, వార్షికోత్సవంలాంటి కార్యక్రమాలలో సినిమా పాటలను పెట్టి స్టూడెండ్స్ చేత డాన్స్ చేయించడం తరచుగా చూసేదాన్ని. చాలా బాధ కలిగేది. సినిమా పాటలనేవి ఒక సందర్భాన్ని బట్టి ఉంటాయి. ఆ సందర్భాన్ని మనం మన వేదికపైన పిల్లల చేత చూపించలేం. కనీసం నా పాప అయినా సినిమా పాటలు చేయకుండా సంప్రదాయ కీర్తనలతో కూడిన నృత్యం చేయాలనే సంకల్పంతో సఫిల్‌గూడాలో సాయి సన్నిధి కూచిపూడి డాన్స్ అకాడెమీని స్థాపించాను. చిన్న పిల్లలకు నేర్పించడం నాకు ఇష్టం. అకాడెమీ పెట్టి మూడున్నర ఏళ్లయింది. ప్రతిరోజు సాయంత్రం పాఠాలు నేర్పిస్తుంటాను. గురుపూజలు, గజ్జెపూజలంటూ ప్రత్యేకంగా ఫీజులు వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తాను. ప్రస్తుతం 40 మంది విద్యార్థులు ఉన్నారు. నాలెడ్జ్ షేరింగ్ అనేది మా విద్యార్థులకు నేర్పిస్తుంటాను. ఆర్థిక సమస్యలున్న చిన్నారులకు ఉచితంగా నృత్యం నేర్పిస్తున్నాను. నృత్యం నేర్చుకుంటే శరీరానికి దృఢత్వం, మానసికానందం కలుగుతాయి. బరువు తక్కువగా పుట్టిన మా అమ్మాయికి నృత్యాన్ని నేర్పించి మామూలు స్థితికి తేగలిగాను.
వెస్ట్రన్ డాన్స్ తప్పు కాదు..
మన వాళ్లు సినిమా పాటల నృత్యాలనే వెస్ట్రన్ డాన్స్ అంటున్నారు. ఒరిజనల్ వెస్ట్రన్ డాన్స్‌లు చాలా బాగుంటాయి. క్లాసికల్ అంటే ఎక్కువ ఖర్చు. సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఇందుకే పేరెంట్స్ వెనుకబడుతున్నారు. చదువులు ఒత్తిడిని కలిగించేవిగా తయారయ్యాయి. ప్లానింగ్ ఉంటే మాత్రం కష్టం కాదు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సహనం ఉండాలి. పిల్లలకు కళలను నేర్పిస్తే వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుంది. దీంతో రెండు గంటల్లో చదివేది ఒక గంటలో చదువుతారు. టైం మేనేజ్‌మెంట్ అనేది వస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.
సెమీ క్లాసికల్ నేర్పిస్తుంటా…
కూచిపూడి , భరతనాట్యం అనేవి దేవుని గురించి సామాన్య జనానికి తెలియజేసేవి. నారాయణ తీర్థులు, క్షేత్రయ్యలాంటివారి పాటల్లోని తీయందనాన్ని జనాలకు అందజేయాలి. నృత్యం నేర్చుకోవడం వల్ల సాహిత్యం మీద కూడా మక్కువ కలుగుతుంది. ఉదాహరణకు ఒక చిన్న పాపకు ముద్దుగారె యశోదను నేర్పించామనుకోండి. కృష్ణున్ని ఒక్కొక్క వజ్రంతో పోలుస్తారు. మనకు ఇన్నిరకాల వజ్రాలున్నాయా అనేది పిల్లలకు తెలుస్తుంది. నేను నా విద్యార్థులచేత సెమీ క్లాసికల్ చేయిస్తుంటాను. అష్టకాలైన మధురాష్టకం, కృష్ణాష్టకంలాంటివి తీసుకుంటాను. దయచేసి ఎవ్వరు కూడా కూడిపూడి బోర్డు పెట్టి సినిమా పాటల చేత డాన్స్ నేర్పించొద్దని నా మనవి.
చదువుకు, నృత్యానికి ముడిపెట్టారు …
మా ఇంట్లో ఎవరికీ నృత్యంలో ప్రవేశం లేదు. ఓ తెలుగు సినిమాలో హేమమాలిని నృత్యం చూసి నాకు కూచిపూడి నేర్చుకోవాలనే కోరిక పుట్టింది. రెండవ తరగతి నుంచి కూచిపూడి నేర్చుకోవడం మొదలుపెట్టాను. నెలకు ఇరవై రూపాయల ఫీజు తీసుకునేవారు అప్పుడు మా గురువుగారు. డాన్స్ నేర్చుకుంటానన్న నాకు మా నాన్నగారు సూర్యప్రకాశరావు ఒక కండిషన్ పెట్టారు. బాగా చదువుకుని స్కూలు ఫస్ట్ వస్తే నృత్యం నేర్చుకోవాలన్నారు. అమ్మ కన్యాకుమారికి కళలంటే ఇష్టం. తనకు రాకపోయినా నాకు నేర్పించింది. అక్క, అన్నయ్య వైజాగ్‌లోనే ఉంటారు. నాకు 2006లో పెళ్లి అయ్యింది. మా వారు శ్రీనివాసరావు నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారు. అత్తమామలు శ్రీరామమూర్తి, నాగరత్నంలు నా అభిరుచిని గౌరవిస్తుంటారు.
చాలా ప్రోగ్రాంలు చేస్తున్నాం…
నెలకు 5, 6 కార్యక్రమాలు చేస్తుంటాను. ప్రోగ్రాం కోసం పిల్లలను తయారు చేయడం చాలా కష్టం. కానీ వచ్చే ఫలితం మాత్రం బాగుంటుంది. దీంట్లో కూడా కమర్షియల్‌కి పోను. పేరెంట్స్ టు ఆర్టిస్టు, పేరెంట్స్ టు ఆర్గనైజర్ అనేది పాటిస్తుంటాను. స్టూడెంట్స్‌తో కలిసి నేను కూడా నృత్యం చేస్తుంటాను. ఇప్పటి వరకు చాలా చోట్ల ప్రోగ్రాంలు చేశాం. దేవనార్ బ్లైండ్ స్కూల్, బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి ఆడిటోరియంలో ప్రోగాంలు ఇచ్చాం. డిడిలో చేశాం. మహానంది, భద్రాచలం టెంపుల్స్‌లో కార్యక్రమాలను ఇచ్చాం. ప్రస్తుతం శ్రీశైలంలో చేయాల్సి ఉంది. మా విద్యార్థుల చేత మెడిటేషన్, యోగాలాంటివి కూడా చేయిస్తా.
గుడి యాజమాన్యం బాధ్యత తీసుకోవాలి…
ఎక్కువ మంది పిల్లలు కూచిపూడి నేర్చుకునేలా చేయడం నా భవిష్యత్తు లక్షం. గుడి యాజమాన్యాలు కళలను పోత్సహించే బాధ్యతను తీసుకోవాలి. టెంపుల్‌లో చాలా ఉత్సవాలు, జాతరలు చేస్తుంటారు. ఒక క్లాసికల్ పెట్టినా.. రోడ్డుపై స్టేజ్ వేసి తూతూ మంత్రంగా చేస్తున్నారు. అలా కాకుండా నిజంగా కళను గౌరవించాలనేది నా అభ్యర్థన. సంప్రదాయ కళలను బతికించడం అందరి కర్తవ్యం.