Home ఆఫ్ బీట్ పేదలపాలిట వరం పూర్ణిమ

పేదలపాలిట వరం పూర్ణిమ

ఆమె ఒక పేద గిరిజన కుటుంబంలో జన్మించింది. కానీ కష్టపడేతత్వం, సేవాగుణంతో ఇప్పుడు ఢిల్లీ స్థాయికి ఎదిగింది. వరంగల్ జిల్లాలోని గిరిజన ప్రాంతంలో జన్మించిన పూర్ణిమ డాక్టర్‌గా  పేద మహిళలకు, చిన్న పిల్లలకు ఉచిత సేవలందిస్తోంది. 

 

Doctor-Purnima

దేశ రాజధాని ఢిల్లీలో వైద్యురాలిగా పనిచేస్తున్న పూర్ణిమ తన భర్త డాక్టర్ ఆనంద్ ప్రోత్సాహంతో సేవా కార్యక్రమాలు చేపట్టింది. ‘బంజారా మహిళ’ పేరుతో ఒక ఎన్జీవోను స్థాపించింది. ఎంతో మంది అనాథ పిల్లలకు తన వంతు సాయం అందిస్తూ మిగతావారికి స్ఫూర్తిగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించింది. పుదుచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడి నిర్వహిస్తున్న నవ జ్యోతి ఇండియా సంస్థతో పాటు నోబెల్ గ్రహీత కైలాష్ సత్యర్థి ఆధ్వర్యంలో నడుస్తున్న ‘బచ్‌పన్ బచావో’తో కూడా కలిసి పనిచేస్తోంది.

ప్రయాస్, సేవ్ చైల్డ్, మాక్స్ ఇండియా ఫౌండేషన్, చైల్ ఫండ్ ఇండియాలాంటి సంస్థల ఆధ్వర్యంలో ఇప్పటివరకు 200లకు పైగా హెల్త్ క్యాంపులు నిర్వహించింది. ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు మహిళలకు, చిన్నపిల్లకు ఎనీమియా టెస్ట్‌లు కూడా చేస్తుంది. డాక్టర్ పూర్ణిమ సేవాతత్పరతకు ‘దీన జన బంధు’ పురస్కారం లభించింది. ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినం అయిన ఏప్రిల్ 7న వరంగల్‌తో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని డాక్టర్ పూర్ణిమ చెబుతోంది. సొంత గడ్డపై సేవ చేసే అదృష్టం కోసం ఎదురు చూస్తున్నానని, తెలంగాణ ప్రభుత్వం తగిన తోడ్పాటును అందిస్తుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

పూర్ణిమ భర్త ఆనంద్ కూడా వైద్యుడే. వైద్యుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టి సినిమాలపై ఉన్న మక్కువతో సినీ ఇండస్ట్రీకి వచ్చాడు. ఒకవైపు డాక్టర్‌గా కొనసాగుతూనే… మనసుకు నచ్చిన సినీరంగంలోనూ రాణిస్తున్నాడు. సామాజిక స్పృహ, సమాజంలోని దురాచారాలపై లఘు చిత్రాలను చిత్రీకరిస్తున్నాడు.

బాలికా విద్య మీద రూపొందించిన ప్రజాహక్కు, శతాబ్దాలుగా సమాజాన్ని పట్టిపీడిస్తున్న సామాజిక రుగ్మత అయిన అంటరానితనం మీద తీసిన అంటరానితనం, గిరిజన కుటుంబం నుంచి వచ్చిన ఓ ఆడపిల్లలో సూపర్ పవర్‌పై తీసిన చిరుతేజ్ సింగ్ అనే చిట్టి సినిమాలకు గానూ జాతీయ అవార్డ్ దక్కింది. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో రూపొందిన మహిళా సాధికారత, బాలికా స్వేచ్ఛ అనే లఘుచిత్రాలను ఓ కమిటీ పరిశీలించి ఉత్తమ చిత్రాలకు జాతీయ అవార్డును అందజేస్తుంది. ఆడపిల్లల జీవితాలను ప్రభావితం చేసే మూడు సందేశాత్మక షార్ట్‌ఫిల్మ్ లు తీశాడు. ఆడపిల్ల పుట్టడమే శాపంగా పరిగణించే సమాజంలో పుట్టిన, పుడుతున్న పిల్లలను తెగనమ్ముకునే ప్రాంతం నుంచి వచ్చిన చిరుతేజ ప్రస్థానంపై డైరెక్టర్ ఆనంద్ బయోపిక్‌ని చిత్రీకరించాడు. ఆ లఘుచిత్రాన్ని మార్చ్ 10న విడుదల చేయనున్నట్లు తెలిపాడు.

కొమ్మలపాటి సాయిసుధ,
మనతెలంగాణ, ఢిల్లీ ప్రతినిధి