Home ఖమ్మం జనరిక్ మెడిసిన్ దొరికేనా..?

జనరిక్ మెడిసిన్ దొరికేనా..?

  • జనరిక్ మందులు రాసేందుకు వైద్యులు అనాసక్తి
  • మెడికల్ మాఫియాతో జనరిక్ బుట్టదాఖలు
  • వంద రూపాయల్లోనే లభించాల్సిన వైద్యం వేలల్లో కూడా లభించని పరిస్థితి
  • బ్రాండెడ్ కంపెనీలు వైద్యులతో కుమ్మక్కై కమీషన్లు

Generic-Medicines

మణుగూరు : మాటలు కోటలు దాటినా, చేతులు గడపదాటడం లేదనే చందంగా జనరిక్ మెడిసిన్ విక్రయాల తీరు ఉంది. బ్రాండెడ్ కంపెనీ ఔషధాలతో పోలిస్తే జనరిక్ మందులు అతిచౌక, వైద్యుల వాటినే రాసేందుకు ప్రాధాన్యత నివ్వాలి. దానిపై ప్రత్యేక చట్టం తెస్తామన్న ప్రభుత్వం మాటలు నీటి మూటలుగానే మారాయి. పట్టణంలో దాదాపు 20 మెడికల్ షాపులు ఉన్నాయి. ఈ షాపులన్నీ ఒక అసోసియేషన్‌గా ఏర్పడి జనరిక్ మెడిసిన్‌ను తుంగలో తొక్కి ప్రజలకు దూరం చేస్తున్నారు. వీరికి తొత్తులుగా వైద్యాధికారులు సైతం వ్యవహరిస్తున్నారు. వైద్యులు కూడా కమీషన్లకు కక్కుర్తిపడి రోగులకు బ్రాండెడ్ కంపెనీ మెడిసిన్‌నే రాస్తున్నారు. జనరిక్ మందులు యాంటీ బయోటిక్స్‌తో పాటు పారాసెట్‌మాల్, జలుబు, దగ్గు, జ్వరం తదిదర వ్యాధులకు కేవలం రూ.10లకే పది టాబ్లెట్లు అందుతాయి. అదే బ్రాండెడ్ కంపెనీ రూ.60ల నుండి వందల్లో పలుకుతుంది. కానీ మెడిసిన్ మాత్రం దాదాపుగా రెండింటిలో ఒకే రకంగా ఉంటుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనరిక్ మెడిసిన్ దుకాణాలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. బ్రాండెడ్ కంపెనీలు వైద్యులతో కుమ్మక్కై కమీషన్లు, బహుమతులు ఎరచూపడంతో వైద్యులు కూడా బ్రాండెడ్ కంపెనీలకే మొగ్గుచూపుతున్నారు. మెడికల్ షాపు నిర్వాహకులను టూర్లపేరుతో జపాన్, సింగపూర్, మలేషియా దేశాలు తిప్పి చూపిస్తున్నారు. దీంతో సామాన్య మానవునికి జనరిక్ అనే తెలియకుండా పోయింది. వంద రూపాయల్లోనే లభించాల్సిన వైద్యం వేలల్లో కూడా లభించని పరిస్థితి ఏర్పడింది. విదేశాల్లో సైతం జనరిక్ మెడిసిన్ అధికంగా వాడుఉతన్నట్లు ఒక సర్వేలో వెల్లడైంది. స్పెయిన్‌లో జనరిక్ మందులు వాడేలా ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మన దేశంలో కూడా జనరిక్ మందులు వాడేలా చట్టం తీసుకొస్తామన్నారు. కానీ అది ఆదిలోనే హంసపాదును ఎదుర్కొంది. పట్టణంలో వైద్యాధికారులు స్పందించి జనరిక్ మెడిసిన్‌పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.