Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

కాసుల కోసమే… కడుపుకోత

Doctors-image

ప్రైవేటు ఆసుపత్రుల్లోపెరుగుతోన్నదోపిడీ పర్వం
సురక్షిత ప్రసవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్తగా 26 మార్గదర్శకాలు
పట్టించుకోని అధికారులు

మన తెలంగాణ/సిటీబ్యూరో : సాధారణ ప్రసవాలు నిర్వహించాలని ప్రభు త్వం పదే పదే హెచ్చరిస్తున్నా ప్రైవేటు ఆసుపత్రులు ఆ విషయాన్ని పట్టించుకోవడంలేదు. ప్రసవం సమయంలో కుటుంబసభ్యులకు ఏదో భయం చెప్పి చివరకు సిజేరియన్ నిర్వహించి లక్షలాది రూపాయలను సొమ్ము చేసుకుంటున్నాయి. కేవలం కాసుల కోసమే అవసరం లేకున్నా కడుపుకోతలు కోస్తున్నారే తప్ప, సాధారణ ప్రసవాలపై కనీసం పట్టించుకోవడంలేదు. నగరంలో నిత్యం జరగుతోన్న ప్రసవాల్లో 70శాతానికిపైగా సిజేరియన్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సాధారణ ప్రసవాలు చేస్తే డబ్బులు రావని భావించి నగరంలోని అనేక ప్రైవేటు ఆసుపత్రులు అవసరం లేకున్నా కాసులకు కక్కుర్తి పడి ప్రాణాలతో చెలగాటం ఆడుతూ సిజేరియన్లు చేస్తుండటం బహిరంగ రహస్యం. ఇటీవల ఇదే విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఓ) కూడా స్పందించి సురక్షిత ప్రసవానికి అవసరమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.

సహజ ప్రసవం కోసం తొలికాన్పుకు కనీసం 12 గంటలు, రెండో కాన్పు అయితే కనీసం 10 గంటలు ఆగాలని, అప్పటికీ కాన్పు కాకపోతేనే సిజేరియన్‌కు వెళ్లాలని డబ్లూహెచ్‌ఓ గతంలోనే తన మార్గదర్శకాల్లో వెల్లడించింది. అయితే, పురిటి నొప్పులు మొదలైన తరువాత ప్రతి గంటకు గర్భంలో ఉన్న శిశువు ఒక సెంటీమీటర్ బయటకు రావడమనేది తప్పనిసరి అంశంగా భావించనవసరం లేదని కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో డబ్లూహెచ్‌ఓ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు నిర్వహించిన డబ్లూహెచ్‌ఓ సురక్షిత ప్రసవం కోసం గతంలోనే 30 మార్గదర్శకాలను విడుదల చేసింది. తాజాగా మరో 26 మార్గదర్శకాలను జారీ చేసింది. నొప్పులు మొదలుకొని కాన్పు జరిగే వరకు మూడు దశలపాటు, బాలింత తీసుకోవాల్సిన జాగ్రత్తలను అందులో పాందుపర్చింది. గతంలో మొదటి దశ కింద 21 మార్గదర్శకాలు ఉండగా, కొత్తగా మరో 11 సూచనలను వాటికి జోడించింది. రెండోదశలో ఎనిమిది రికమెండేషన్స్ ఉండగా, కొత్తగా ఆరు మార్గదర్శకాలను జోడించింది. మూడో దశలో ఆరు రికమెండేషన్స్ ఉండగా, కొత్తగా ఐదింటిని సూ చించింది. బాలింత సంరక్షణలో ఉండగా మూడింటిని కొత్తగా జోడించింది.

చర్యలు తీసుకోవాలని : సాధారణ ప్రసవం జరిగే అవకాశం ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులకు ప్రాణభయం పెట్టి అవసరం లేకుండా సిజేరియన్‌లను నిర్వహిస్తున్న ఆసుపత్రులు, వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.

Comments

comments