Home ఎడిటోరియల్ జిఎస్‌టి-అంతా భ్రాంతియేనా!

జిఎస్‌టి-అంతా భ్రాంతియేనా!

GST-Bill

వస్తు-సేవలపన్ను బిల్లులను పార్లమెంటు ఆమోదిం చటంతో ఈ కొత్త పరోక్ష పన్నుల విధానం జులై 1 నుండి అమలులోకి రానుంది. ‘ఒకదేశం-ఒకే పన్ను’ అని ఘనంగా చెప్పుకుంటున్నప్పటికీ, వాస్తవంలో బహుళ పన్నులు, సెస్సులు ఉంటాయి. పన్ను రేటు కూడా ఒకటి కాదు. జిఎస్‌టి కౌన్సిల్ నాలుగంచల పన్ను స్వరూపాన్ని – 5, 12, 18, 28 శాతం – ఆమోదించింది. విలాసవంతమైన కార్లు, ఇతర విలాస వస్తువులపై, పొగాకు, మద్యం వంటి అరిష్ట(సిన్ గూడ్స్) సరుకులపై అదనంగా 12-15 శాతం సెస్సు ఉంటుంది. జిఎస్‌టి కౌన్సిల్ ఛైర్మన్ అయిన ఆర్థిక మంత్రి ఇలా చెప్పారుః “అయోగ్యత (డీమెరిట్) వస్తువులపై సెస్సు అత్యధిక జిఎస్‌టి రేటుపైన 15 శాతంగా పరిమితి విధించినప్పటికీ అది ఆచరణలో 12శాతమే ఉంటుంది”. జిఎస్‌టి రాష్ట్రాల మధ్య పన్ను విధింపులో ఏకరూపతను తెస్తుంది. అయితే అయోగ్యత వస్తువుల వర్గీకరణ బ్రహ్మపదార్థం లాంటిది.
ఎక్సైజ్ సుంకాలు, సేవాపన్ను, కస్టమ్స్ సుంకం వంటి కేంద్ర పన్నులు సెంట్రల్ జిఎస్‌టిలో (సిజి ఎస్‌టి) విలీనమవుతాయి. అమ్మకంపన్ను, వినోదం పన్ను, వ్యాట్, ఇతర రాష్ట్ర పన్నులు రాష్ట్ర జిఎస్‌టి (ఎస్‌జిఎస్‌టి)లో కలిసి పోతాయి. అంతర్రాష్ట వ్యాపారాలు సంలీన జిఎస్‌టి (ఇంటి గ్రేటెడ్‌జిఎస్‌టి) కిందకు వస్తాయి. రాష్ట్రాలకు పన్నుల ఆదాయంలో నష్టం సంభవిస్తే దాన్ని ఐదేళ్లపాటు కేంద్రం భర్తీచేసే మరో బిల్లు కూడా ఆమోదించబడింది. ఎస్‌జి ఎస్‌టి బిల్లును రాష్ట్ర శాసనసభలు ఆమోదించాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పాడి ఆవులాంటి పెట్రోలియం ఉత్పత్తులు జిఎస్‌టి కిందకు రావు. అవసరాన్నిబట్టి వడ్డించే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది.
సూక్ష్మంగా చెప్పాలంటే, పరోక్ష పన్నులు సుమారు 40 శాతం ఉంటాయి. పెట్రోలియం ఉత్పత్తు లపై మరి కొంత అదనంగా ఉంటుంది. ఉదాహరణ కు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.27 వేలకోట్ల మేర పంట రుణాలను రద్దు చేయ తలపెట్టి నందున పెట్రోలియం ఉత్పత్తులపై పన్నును 5శాతం పెంచా లని ఆలోచిస్తున్నది. ఇటువంటిది ఏ రాష్ట్రంలో నైనా జరగవచ్చు.
జిఎస్‌టి అమలును ప్రారంభించేముందు కేంద్ర ప్రభుత్వం 16రకాల సెస్సులను రద్దు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల ఆదాయ నష్టం రూ.65వేల కోట్లు. కృషి వికాస్, స్వచ్ఛభారత్ సెస్‌లు వాటిలో ఉన్నాయి. ఇది పన్నుల భారం తగ్గుతుందన్న అభిప్రాయం కలిగించవచ్చు. అయితే అది వాస్తవం కాదు. ఎందుకంటే, రాష్ట్రాలు, కేంద్రం ప్రస్తుత ఆదాయ స్థాయిని కోల్పోని రీతిలో జిఎస్‌టి పన్నుల రేట్లుంటాయి.
సరఫరాల గొలుసులో అమ్మకం లేక కొనుగోలు ప్రతి ఒక్క దశలో విలువ జత అయిన వస్తువులు, సేవలపై జిఎస్‌టి వసూలు చేయబడుతుంది. వస్తువులు, సేవల కొనుగోలుపై చెల్లించే జిఎస్‌టిని వాటి సరఫరాపై చెల్లించవలసిన జిఎస్‌టి పరిహ రిస్తుంది. ఉత్పత్తిదారు లేక టోకు వర్తకుడు లేక చిల్లర వర్తకుడు చెల్లించే అనువర్తిత జిఎస్‌టి టాక్స్ క్రెడిట్ మెకానిజం ద్వారా తిరిగిపొందుతాడు. జిఎస్‌టి అంతిమ వినిమయంపై – అనగా వినియోగదారునిపై ఎక్కుపెట్టబడిన పన్ను. అందువల్ల పన్నురేట్లు, దశలు ఎలా ఉన్నప్పటికీ అది అంతిమంగా సామాన్య మానవుని నెత్తికే వస్తుంది. దాని యావత్ ప్రభావాన్ని అంచనా వేయటం సులభంకాదు.
పెక్కురకాల పన్నులు వ్యాపారుల, పరిశ్రమ సమస్యలు పెంచుతాయి. ఆయా వస్తువులపై పన్ను ఒకే రీతిగా ఉండదు. వస్తువులను వివిధ పన్నురేట్ల కింద వర్గీకరిస్తారు. దీన్ని అత్యున్నతాధికార సంస్థ జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయిస్తుంది. వస్తువులు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి చేరేటప్పుడు ఐజిఎస్‌టి విధిస్తారు. దాంతో వస్తువుల రేట్లలో ఆయా ప్రాంతా లను బట్టి వ్యత్యాసం ఉంటుంది. స్థానిక సంస్థలు విధించే సుంకాలు అదనం. ఇది పరిస్థితిని మరింత జటిలం చేస్తుంది. జిఎస్‌టికి ప్రాతిపదికగా చెప్ప బడుతున్న ఏకరూప పన్ను విధానం దానికి బలం చేకూర్చకపోవచ్చని పరిశ్రమ సందేహిస్తున్నది.
సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై జిఎస్‌టి కింద అత్యధిక పన్ను రేటు 28శాతంపై వేర్వేరు సెస్సులు ప్రతిపాదించబడినాయి. సిగరెట్లుపై ప్రస్తుత పన్ను 53శాతం. దానిపైన 15 శాతం సెస్సు విధించవచ్చు. కేంద్రం, రాష్ట్రం రెండూ సెస్సు విధిస్తే, దానికి 1శాతం ఐజిఎస్‌టి తోడైతే మొత్తం పన్నులు 28+3౦+1=59 శాతానికి చేరతాయి.
పొగాకుతో పాటు లగ్జరీకార్లు, హైటెక్ వాచీలపై ప్రస్తుతం వేర్వేరు పన్ను రేట్లున్నాయి. పన్నులను ప్రస్తుత స్థాయిలో ఉంచటమన్నది ప్రాథమిక సూత్రం. ఏదైనా వస్తువుపై (ప్రస్తుత) పన్ను జిఎస్‌టి శ్లాబు రేటు కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఆ వ్యత్యాసాన్ని సెస్సు భర్తీ చేస్తుంది. అంటే ఈ తరహా వస్తువులు ఒక్కొక్కదానికి ఒక్కో పన్ను రేటు ఉంటుంది.
జిఎస్‌టి పన్ను వ్యవస్థను ఇది జటిలం చేస్తుంది. బంగారంపై కూడా 4శాతం పన్ను విధించనున్నారు. అలా ఆరు వేర్వేరు సెస్సు లుంటే జిఎస్‌టి కింద 10రకాల పన్ను రేట్లుంటాయి.
కార్లు, ఆటోమొబైల్స్‌పై పన్ను రాష్ట్రస్థాయిల్లో మరింత గందరగోళంకానుంది. ఏకరీతి రేటును జిఎస్‌టి ఉద్దేశించినప్పటికీ, 800 లేక 1000 సిసి లోపు కార్లు మినహా మిగతావన్నీ లగ్జరీ కార్లకిందే లెక్క. 1200 సిసి పైబడిన పెట్రోలు కార్లు, డీజిల్ కార్లపై వేర్వేరు సెస్సులు విధిస్తే కార్లపైన సెస్సులు నాలుగు రకాలు దాటవచ్చు.
జిఎస్‌టి కౌన్సిల్‌కు ప్రభుత్వం తెలిపిన అంచనా ప్రకారమే, ప్రతిపాదిత జిఎస్‌టి పన్ను స్వరూపం తమలపాకు, పొగాకు, ఇతర మత్తు కలిగించే వస్తువు ల ధరలను ౦.22 శాతం తగ్గిస్తుంది. ఈ కేటగిరీకి విని యోగదారుల ధరల సూచీలో 2శాతం వెయిటేజి ఉంది.
సెస్సులు ఐదేళ్ల తదుపరి – రాష్ట్రాలకు పరిహారం చెల్లింపు కాలం ముగిశాక ఎత్తివేయబడతాయని ప్రభుత్వం చెపుతున్నది. అయితే సెస్సులు రద్దు చేయటంలో ప్రభుత్వానికి సత్కీర్తి లేదు.
చిన్న వ్యాపారులను ఆందోళనపరస్తున్న అంశం మరొకటుంది. ఇప్పుడు అనేక వస్తువులు పన్ను విధింపు కిందలేవు. బహుళస్థాయి జిఎస్‌టి వచ్చాక మినహాయింపు జాబితా బహుకొద్ది వస్తువులకు పరిమతమవుతుంది. అప్పుడు వినియోగదారులపై అదనపు భారం తప్పదు. రెస్టారెంట్లలో వినియోగ దారు చెల్లించాల్సిన 25శాతం పైగా పన్ను తగ్గుతుందో లేదో తెలియదు. ఏదిఏమైనా, వినియోగ దారుకు ఎటువంటి ఉపశమనం లభించదు. ప్రతి వస్తువుకు అతడు అదనపు ధర చెల్లించాల్సి రావచ్చు.

– శివాజీ సర్కార్