Home కరీంనగర్ కుక్కలు బాబోయ్..కుక్కలు

కుక్కలు బాబోయ్..కుక్కలు

Dogsబెంబేలెత్తుతున్న ప్రజలు, పట్టించుకోని పాలకవర్గాలు
మన తెలంగాణ/పెద్దపల్లి రూరల్: గ్రామాల్లో కుక్కల బెడద ఎక్కువైంది. ఏ వీధిలో చూసినా పదుల సంఖ్యలో కుక్కలు ఒకే చోట కనిపిస్తుండడంతో ప్రజలు వాటిని చూసి భయాందోళనకు గురవుతున్నారు. మండలంలోని కొత్తపల్లితోపాటు భోజన్నపేట, బ్రాహ్మణపల్లి, నిమ్మనపల్లి, అప్పన్నపేట, మూలసాల, రంగంపల్లి తదితర గ్రామాల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. పాఠశాలకు వెళ్తున్న పిల్లలు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్తున్న వారిపై కుక్కలు దాడి చేస్తుండడంతో గాయాల పాలవుతున్నారు. రాత్రివేళల్లో పరిస్థితి మరీ దయనీయంగా తయారైందని, కనిపించిన వారినల్లా పరుగులు పెట్టిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల బెడద నివారణ కోసం గతంలో ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు వినియోగించుకునే వీలు కల్పించినప్పటికి పాలకవర్గాలు మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు. అలాగే ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారిని కిలో మీటరు వరకు వెంబడిస్తున్న సమయంలో ప్రమాదానికి గురై గాయాల పాలైన సందర్భాలున్నాయి. పక్క రాష్ట్రంలో కుక్కల నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కానీ పెద్దపల్లి జిల్లాలోని పలు గ్రామాల్లో తీవ్రమైన సమస్యగా మారిన కుక్కల బెడదను నివారించేందుకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు చొరవ తీసుకొని ప్రజల ప్రాణాలకు రక్షణగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
కుక్కల వల్ల రెండు చేతులు కోల్పోయా..
గతంలో మా గ్రామంలో కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఆ సమయంలో 20 మందికిపై కుక్కల దాడిలో గాయపడ్డారు. రెండు చేతులపై కుక్కలు దాడి చేయడంతో విషపుశాతం ఎక్కువగా ఉందని డాక్టర్లు తేల్చారు. వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేక పోవడంతో నా రెండు చేతులు తొలగించారు. – పంగ మధునమ్మ, కొత్తపల్లి
ప్రభుత్వ చర్యలు చేపట్టాలి
కుక్కల బెడద ఏర్పడింది గ్రామీణ ప్రాంతాలనుండి కుక్కలు కరిచిన కేసులు చికిత్స కు వస్తున్నారు. కొందరు డబ్బులు లేక ట్రీట్ మెంట్ తీసుకొవడం లేదు కుక్కలు దాడి చేస్తే ఎమౌవుతుందో తెలియని అగాహన ఉంది , ముందుగా ప్రజలకు కుక్కలు కరిస్తే రాబీస్ వ్యాపించి మరణం సంభవిస్తుంది.కాబట్టి ప్రభుత్వం పరంగా చర్యలు తీసుకుంటూ పూర్తి స్థాయిలో కుక్క కాటుకు గురయిన వారు చికిత్స పోందించేందుకు కృషి చేయాలి..
– డాక్టర్ కిరణ్ కుమార్ , యండి.పెద్దపల్లి