Home ఎడిటోరియల్ క్రికెట్ దేశసేవ చేస్తోందా?

క్రికెట్ దేశసేవ చేస్తోందా?

Doing cricket national service?

క్రికెట్ ప్రపంచంలోనే అత్యధిక ప్రజలు మెచ్చే ఆట. అవును అది ఆట మాత్రమే.., ఆటను ఆటలాగానే చూడండి. పది మంది వేరే జట్టు పై ఓడిపోతే దేశం ఓడినట్లు కాదు, గెలిస్తే దేశం గెలిచినట్టు కాదు. అత్యధిక ప్రజలు మెచ్చినంత మాత్రాన క్రికెట్ దేశసేవ చేసినట్టు అంతకన్నా కాదు. మీ ఆట మీరు ఆడుకోండి అంతేకానీ మీరేదో దేశాన్ని ఉద్దరిస్తున్నారని చెప్పకండి. మిమ్ములను అలా ప్రోమోట్ చేస్తుంటే మీరే స్వయంగా ఆపండి. ఒక జట్టు గెలిస్తే అది దేశానికి ఎలా ఆపాదిస్తారు.
ప్రపంచ దేశాల ప్రభుత్వాలు క్రికెట్ ని అధికారికంగా ప్రకటించి అవును ఈ ఆటలో ఓడిపోతే మా దేశం ఓడిపోయినట్లే అని ఎప్పుడైనా? ఎక్కడైనా ప్రకటించారా? సరే ఒక దేశానికి ప్రతినిధులుగా మీరు ఆడుతున్నారు. ప్రతినిధి ఓడిపోతే పూర్తీ దేశం ఓడినట్లు కాదు, గెలిచినట్లూ కాదు. ఇది ఒక క్రికెట్ కి మాత్రమే కాదు అన్ని ఆటలకు వర్తిస్తుంది. ఒక ఆటగాడు మెడల్ సంపాదిస్తే కోట్లు కుమ్మరించే ప్రభుత్వాలు ఒక సైనికుడి మరణానికి ఎందుకు అన్ని కోట్లు ఇవ్వరు? అదే రాజకీయం అంటే ప్రజలను పిచ్చోలను చేసి ఆడిస్తున్నారు.దేశసేవ వేరు దేశానికి పేరు తీసుకురావడం వేరు ఇది అందరూ గమనించాలి. ఒక సైనికుడు కుటుంబాన్ని వదిలి చేసేది సేవ ఒక క్రికెటర్ తన భార్యపిల్లలతో కలిసి దేశాలు తిరిగి ఆట ఆడి తను సంపాదించుకుంటూ తను పేరు తెచ్చుకుంటుంటే అది దేశానికి పేరు తెస్తుంది. కాని సేవచేసినట్లు ఎలా అవుతుంది.?
క్రికెట్ లో ఎన్నో సెంచరీలు, ఎవరూ చేయలేని రికార్డ్ చేశారని భారతరత్న ఇచ్చారు. నిజంగా అది ఆయన దేశానికి సేవ చేశారని ఇచ్చారని ఎవరైనా అనుకంటే అది మూర్ఖత్వమే. ఒక ఆట ఆడితే ఎంతో మంది ఎంటర్టైన్మెంట్ అవుతారు, చాలా మందికి ఉపాధి కలుగుతుంది ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మంది లబ్ది పొందుతారు. మరి బెట్టింగ్ మాఫియాగురించి ఎవరు మాట్లాడరు ఎందుకని? కొన్ని లక్షల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.
ఈ బెట్టింగ్ మాఫియాలో సినీ పరిశ్రమ ఉంది. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వీరు ప్రభుత్వాలకు అవసరం కదా! పారిశ్రామికవేత్తలు రాజకీయ పార్టీలకు డొనేషన్స్ ఇస్తారు. సినీ పరిశ్రమ వారు ప్రచారం చేస్తారు. మరి పేద, మధ్యతరగతి వారు బెట్టింగ్ బారినపడి కుటుంబాలనే బలి చేసుకుంటున్నారు. వీరి సంగతేంటి? ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. చిన్న చిన్న బెట్టింగ్స్ చేసేవారిని పోలీసులు పట్టుకుంటారు మరి తిమింగలాలను ఎందుకు పట్టుకోరు?
ఇండియా, పాక్ మ్యాచ్ జరుగుతుంటే రెండు దేశాలకు యుద్ధం జరుగుతోంది అనేలా వాతావరణం సృష్టిస్తారు. ఏదైనా చర్య జరిగితే దాని నుండి మంచి ఆశించాలి కాని పాక్ ఆటగాళ్ళు ఉగ్రవాదులు కాదు కదా! అలా అయితే మన ప్రభుత్వం వారికి పాస్ పోర్ట్ ఇచ్చి దేశంలోకి ఆహ్వానించదు కదా! మరి ఆ జట్టుపై ఓడిపోతే పాక్ దేశంపై మనం గెలిచినట్టు ఎలా అవుతుంది.? ఔను నిజమే పాక్ లో ఎక్కువ శాతం ఉగ్రవాదులు ఉన్నారు. ఆ దేశ ప్రభుత్వం వారిని కాపాడుతోంది అని ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు రెండు దేశాల ప్రభుత్వాలు చర్చలు చేస్తాయి.
మనం దేశంలో ఉన్న ఉగ్రవాదుల హతం కోసం ప్రపంచదేశాల సహాయం తీసుకుంటాము కాని ప్రపంచదేశాల క్రికెటర్స్ సహాయం కాదుగా. ఇక్కడ కూడా ఒక దేశంలో ఉన్న ఉగ్రవాదులపై పోరాటం దేశ సైనికులు చేస్తారు. సరే ఇన్ని వేల కోట్లు సంపాదిస్తున్నారు కదా ఐ.పి.ఎల్ లో కనీసం కొన్ని మ్యాచ్ లకు వచ్చే ఆదాయం మొత్తం రైతులకు, సైనికులకు ఇస్తే బాగుపడతారు కదా! అప్పుడు మీరు దేశసేవ చేసినట్లు అవుతుంది కదా. ఏదో చిన్న చిన్న దానాలు చేసి పబ్లిసిటి స్టంట్స్ చేసే వారి శాతమే ఎక్కువగా కనిపిసున్నది.
ఒక జట్టు మరొక జట్టుపై గెలిచినప్పుడు అతను తన దేశ జెండాను గ్రౌండ్ లో ఎగిరేస్తే ఆ దేశ ప్రజలందరికీ ఆనందమే కాని అదే దేశ జెండాను ఒక పేద వాడను అభివృద్ధి చేసి, అక్కడ ఎగిరేస్తే దానికి పదింతలు సంతోషం వేస్తుంది కదా! ఒక సైనికుడి మరణం న్యూస్‌లో పెద్దగా కవర్ కాదు. అదే ఒక ఆటగాడి ఎఫైర్ గురించి పత్రికలు కూడా మొదటి పేజీలో వేసి ప్రచారం చేస్తారు. క్రికెటర్స్ ను వ్యతిరేకించడం లేదు క్రికెట్ ని అసలు వ్యతిరేకించడం లేదు, ఆటను ఆటలా చూడాలి అంటున్నా ప్రపంచానికి మొత్తం అన్నం పెట్టే రైతులు అసలైన సేవకులు. నిజానికీ ఈ భారతదేశంలో కార్మికశక్తిని ఎప్పుడూ గుర్తించరు. అందుకే మనం చూస్తున్నాము నేటి రైతుల దుస్థితి.
క్రికెటర్స్ ఐడెంటిటీ భారతదేశానికి ఐడెంటిటీ కాదు…, భారతదేశమే వారికి ఐడెంటిటి ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలి. నిజానికి క్రికెటర్స్ ఎక్కడికి వెళ్లాలన్నా పోలీసులు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు ఇలా ఎంతోమంది వారికి సెక్యూరిటీ ఉండాలి. వారిది అసలైన దేశసేవ. నిజానికి క్రికెటర్స్ ఎక్కడా మేము దేశసేవ చేస్తున్నామని చెప్పుకోరు కాని కొంతమంది అమాయకులే వారేదో సేవ చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. నిజానికి సేవ చేసేవాడికన్నా చేయనివాడికే ఇక్కడ పేరు వస్తుంది, డబ్బు వస్తుంది. ఎంతమంది జవానులు దేశం కోసం మరణిస్తున్నారో సరైన లెక్కలు మనలో ఎంతమందికి తెలుసు? అదే ఒక క్రికెటర్ ఎన్ని రన్స్ కొట్టాడు , ఎన్ని సెంచరీలు కొట్టారు ఇవి మాత్రం అత్యధికులకు తెలుస్తాయి.
ఏది ఏమైనా ఆట కొంతమంది వ్యక్తులకు సంబంధించినది దేశానికి కాదు. మన దేశం అభివృద్ధి చెందుతున్న నుండి డెవలప్ కంట్రీగా అయినప్పుడు, రైతుల ఆత్మహత్యలు లేని దేశంగా మారినప్పుడు, సైనికులకు సముచిత స్థానం ప్రభుత్వాలు కల్పించినప్పుడు, అన్నం కోసం మరణించే వారు దేశంలో లేనప్పుడు, భారతదేశ మహిళలపై హత్యచారాలు ఆగినప్పుడు అప్పుడు మన దేశం ప్రపంచ దేశాలపై గెలుస్తుంది. అప్పడు మనదేశ జెండా సగర్వంగా రెపరెపలాడుతుంది. మేరా దేశ్ మహాన్, జై హింద్.